నాకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి?

Congres MLC Ponguleti Sudhkar Reddy Slams CM KCR Regarding Rythu Bandhu Scheme - Sakshi

తెలంగాణ సర్కారుకు పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ప్రశ్న

సాక్షి, హైదరాబాద్‌ : రైతు సంక్షేమం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వాలు నెహ్రూ హయాం నుంచి మన్మోహన్‌ సింగ్‌ వరకు ఎంతో కృషి చేశాయని, తెలంగాణ సీఎం కేసీఆర్‌ రైతు సమస్యలపై నాలుగేళ్లుగా గాఢ నిద్రలో ఉండి ఇప్పుడు రైతుబంధు పథకం అంటూ హడావిడి చేస్తున్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మట్లాడుతూ.. రైతుబంధు పథకం రైతుల సమస్యలన్నింటికీ జిందా తిలిస్మాత్‌ అన్నట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రైతుబంధు పథకాన్ని పది ఎకరాలలోపు వాళ్లకు అమలు చేస్తూనే.. కౌలు రైతులను ఆదుకునే విధంగా రైతుబంధు విధివిధానాలను రూపొందిస్తే రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడినట్లుగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. పట్టాదారు పాసు పుస్తకం నమోదులో అనేక అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు.

‘దేవాలయ, ప్రభుత్వానికి చెందిన స్థలాలు ప్రైవేట్ వక్తులకు చెందిన పట్టాదారు పుస్తకాల్లో నమోదైన సంఘటనలు రాష్ట్రంలో అనేక చోట్ల జరిగాయి. ఈ తరహా సంఘటనల వెనుక భారీ కుంభకోణం దాగి ఉంది. అంతేకాక ఖమ్మం జిల్లా నారాయణపురంలోని నా స్వంత భూమిలోని సర్వేనెంబర్ 351/12/1, సర్వే నెంబర్‌116లు కొత్త పాస్ బుక్‌లో ఎంట్రీ కాలేదు. అయినా కూడా నాకు రైతు బంధు చెక్‌లు వచ్చాయి. నాకే ఇలా జరిగితే సామాన్యుడి పరిస్థితి ఏంటి. నేను రైతుబంధు చెక్‌ను ప్రభుత్వానికి తిరిగి ఇచ్చేశాను. ప్రభుత్వ భూములకు కూడా తప్పుడు ఎంట్రీలతో చెక్‌లు డ్రా చేస్తున్నారు. అటవీ భూముల, దేవాదాయ శాఖ భూముల అన్యాక్రాంతంపై ఫిర్యాదులు వస్తున్నాయి. భూప్రక్షాళనలపై పూర్తిస్థాయిలో సమీక్షించాల్సిన అవసరం ఉంది. అక్రమాలపై రాష్ట్రస్థాయి మానిటరింగ్ కమిటీ వేయాలి లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.  రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో మండలస్థాయిలో రివ్యూలు పెట్టాలి అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాల’ని పొంగులేటి వ్యాఖ్యానించారు.

‘ఐదు లక్షల రూపాయల బీమాలో ఎల్ఐసీ నియమాలపై దృష్టి సారించండి. విభజన చట్టాన్ని సాధించుకోవడంలో కేసీఆర్ అలసత్వం చేస్తున్నారు. షీలాబేడీ కమిటీ ఇచ్చిన నివేదిక విభజన చట్టంలోని అంశాలకు విరుద్ధంగా ఇచ్చారు. సింగరేణికి 81 శాతం వాటాలున్న ఏపీ హెచ్ఎంఈఎల్‌ను (ఏపీ భారీ మిషనరీ ఇంజినీరింగ్ లిమిటెడ్) ఏపీకి చెందేలా షీలాబేడీ కమిటీ నివేదిక ఇవ్వడం సరికాదు. ఈవిధంగా తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటున్నా కేసీఆర్ ఎందుకు స్పందించరు. కుమారస్వామి ప్రమాణస్వీకారం చేయడానికి ముందే వెళ్లి కలవడం కిలాడీ రాజకీయాల్లో భాగం. అటు జేడీఎస్‌ మెప్పుకోసం.. ఇటు బీజేపీకి బాధ కలగకూడదని కేసీఆర్ ఇలా చేస్తున్నార’ని తీవ్రంగా విమర్శించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top