
కాంగ్రెస్ పార్టీ కీలక కమిటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులకు మొండిచేయి చూపారు.
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు కాంగ్రెస్ పార్టీ వడివడిగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పార్టీని పరిపుష్టం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టింది. 2019 ఎన్నికలకు సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కీలక కమిటీలను కాంగ్రెస్ పార్టీ శనివారం ఏర్పాటు చేసింది. కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ, పబ్లిసిటీ కమిటీలను నియమించింది. తనకు ఎంతో నమ్మకస్తులైన సూర్జివాలా రణదీప్, కేసీ వేణుగోపాల్‌లకు కోర్ కమిటీలో స్థానం కల్పించారు పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.
తొమ్మిది మంది సభ్యుల కోర్ కమిటీలో సోనియా గాంధీ విశ్వాసపాత్రులు అశోక్ గెహ్లట్, ఏకే ఆంటోనీ, గులామ్ నబీ ఆజాద్, మల్లిఖార్జున ఖర్గే, అహ్మద్ పటేల్, జైరామ్ రమేశ్, చిదంబరం ఉన్నారు. 19 మందితో మేనిఫెస్టో కమిటీ, 13 మంది సభ్యులతో పబ్లిసిటీ కమిటీలను ఏర్పాటు చేశారు. జైరామ్ రమేశ్, చిదంబరం.. కోర్ కమిటీ, మేనిఫెస్టో కమిటీల్లోనూ ఉన్నారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలకు మేనిఫెస్టో తయారు చేయడానికి, పబ్లిసిటీ ప్రణాళిక రూపొందించే పనిలో కమిటీలు నిమగ్నమవుతాయని అశోక్ గెహ్లట్ తెలిపారు.
తెలంగాణ, ఏపీ నేతలకు మొండిచేయి
కాంగ్రెస్ పార్టీ కీలక కమిటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాయకులకు స్థానం దక్కలేదు. మూడు కమిటీల్లో తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలకు మొండిచేయి చూపారు. వచ్చే ఏడాది ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తెలుగు నాయకులను హైకమాండ్ పట్టించుకోకపోవడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణమే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తామని రాహుల్ గాంధీ ఇప్పటికే ప్రకటించారు. కనీసం మేనిఫెస్టో కమిటీలో కూడా తెలుగు నేతలకు చోటు కల్పించకపోవడం గమనార్హం. సూర్జివాలా రణదీప్‌ను రెండు కమిటీల్లోనూ (కోర్, పబ్లిసిటీ) తీసుకోవడం విశేషం.