డబ్బులిచ్చిన వాళ్లకే టికెట్లు

Cheruku Muthyam Reddy comments on Uttam Kumar Reddy - Sakshi

ఉత్తమ్‌పై మాజీ మంత్రి ముత్యంరెడ్డి ఆరోపణ 

ఎన్నికల్లో తడాఖా చూపిస్తానని సవాల్‌

తొగుట(దుబ్బాక): శాసన సభ ఎన్నికల్లో గెలిచే వారికి కాకుండా డబ్బు సంచులిచ్చిన వారికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి టికెట్లు అమ్ముకున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు చెరుకు ముత్యంరెడ్డి ఆరోపించారు. మెదక్‌లోని ఆయన స్వగృహంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా కేవలం దుబ్బాకలో గ్రూపులను ప్రోత్సహించి పార్టీని భ్రష్టు పట్టించారనిమండిపడ్డారు. 2009లో అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి తన నిజాయితీని గుర్తించి టికెట్‌ ఇచ్చారని గుర్తుచేశారు. వైఎస్‌తోనే నిజమైన కాంగ్రెస్‌ పోయిందని, ప్రస్తుతం పైరవీకారులు, లంచాలిచ్చేవారి హవా నడుస్తోందని దుయ్యబట్టారు. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి దుబ్బాకలో పార్టీని బతికించానని చెప్పారు. స్వార్థంతో నియోజకవర్గంలో ముగ్గురి మధ్య అగ్గి రాజేసి పార్టీని నాశనం చేస్తున్నారని ఉత్తమ్‌పై మండిపడ్డారు. ఇటీవల కామారెడ్డి పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభకు వాహనాలలో కార్యకర్తలను తీసుకురమ్మని ఎందుకు చెప్పారని నిలదీశారు.

ఆర్థికంగా తనను ఇబ్బందుల పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందే తనకు టికెట్‌ ఇవ్వబోమని చెప్పాల్సిందన్నారు. మెదక్‌ జిల్లాలోని సంగారెడ్డి, జహీరాబాద్, నర్సాపూర్, అందోల్‌ నియోజకవర్గాలలో గ్రూపులకు స్థానం లేకుండా చూశానన్నారు. గాంధీ భవన్‌ బండారాన్ని బయటపెడతానని ఆయన హెచ్చరించారు. నా తడాఖా ఏంటో ఉత్తమ్‌కు చూపిస్తానని చెప్పారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని ప్రతీ మండలాన్ని పర్యటిస్తామన్నారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్‌ అడ్రస్‌ గల్లంతు చేస్తామని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల గెలుపుకోసం కృషి చేస్తామన్నారు. తన నామినేషన్‌ ఉపసంహరించుకున్న తర్వాత టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయం కోసం పని చేస్తానని ప్రకటించారు. కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా పత్రాన్ని మెసేజ్‌ ద్వారా పంపించినట్టు ఆయన ప్రకటించారు. సమావేశంలో ఆయన అనుచరులు పాగాల కొండల్‌రెడ్డి, బాల్‌రెడ్డి, బాలమల్లు, యాదగిరి, రామస్వామి, వెంకట్, అశోక్, స్వామి, చంద్రం, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top