ప్రజాస్వామ్యం ఖూనీ!

Chandrababu needs something to blame for his imminent defeat - ys jagan mohan reddy - Sakshi

రాష్ట్రంలో అధికార పక్షం అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్‌ జగన్‌ ఫిర్యాదు

ఏపీలో ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా నిర్వహించండి

సీఎం చంద్రబాబు మొత్తం పోలీస్‌ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకుని తన సామాజికవర్గం వారితో నింపేస్తున్నారు

తన సామాజిక వర్గానికి చెందిన 35 మంది సీఐలకు డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చుకున్నారు

శాంతి భద్రతల కో ఆర్డినేషన్‌ డీఐజీ పోస్టును సృష్టించి సొంత సామాజిక వర్గానికి కట్టబెట్టారు

ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు నిఘా వ్యవస్థను ఇప్పటికే టీడీపీ జేబు సంస్థగా మార్చేశారు

డీజీపీ ఠాకూర్‌దీ అదే తీరు.. నాపై హత్యాయత్నం జరిగిన గంటలోనే కేసును తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేశారు

రాష్ట్రంలో పోలీస్‌ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించి ఎన్నికలను మానిప్యులేట్‌ చేయాలని చూస్తున్నారు

ఈ అధికారులను ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలి

అవినీతి ద్వారా సంపాదించిన సొమ్ములో రూ.4 వేల కోట్లను ఇప్పటికే నియోజకవర్గాలకు చేరవేశారు

పోలీసులతో వీటిని పంపిణీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు

ఓటరు జాబితాలో అవకతవకలను సరిదిద్దండి

రాష్ట్రంలో 59 లక్షలకుపైగా నకిలీ ఓట్లున్నాయి.. సుమారు 40 లక్షల మందికి ఏపీలో రెండు చోట్ల ఓట్లున్నాయి 

వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులైన 4 లక్షల మంది ఓట్లను అక్రమంగా తొలగించారు

ఈ పరిస్థితుల్లో తక్షణమే జోక్యం చేసుకోవాలని  కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ సీపీ వినతి

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ పలు అక్రమాలకు పాల్పడుతోందని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఓటర్ల జాబితాల్లో అవకతవకలకు పాల్పడడం, ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేయడం, పక్షపాతంగా వ్యవహరించే పోలీసు అధికారులను నియమించి ప్రతిపక్షాన్ని బెదిరించడం లాంటి దుశ్చర్యలకు అధికార పార్టీ పాల్పడుతోందని ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తెచ్చారు. పార్టీ ఎంపీలు, సీనియర్‌ నేతలతో కలసి సోమవారం ఢిల్లీలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌ సునీల్‌ అరోరాకు ఆయన ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. ఈ వ్యవహారంలో జోక్యం  చేసుకుని రాష్ట్రంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా, స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా జరిగేలా చూడాలని విన్నవించారు.  వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరులను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తూ టీడీపీ వక్ర మార్గాలను అనుసరిస్తోందని తెలిపారు. అర్హుడైన ఒక్క ఓటరును జాబితా నుంచి తొలగించినా అది అతడి హక్కును కాలరాసినట్లేనని, ప్రజాస్వామ్య ప్రక్రియను అవహేళన చేయడమేనని పేర్కొన్నారు.

అది గోప్యతకు భంగం కలిగించడమే..
టీడీపీ మొత్తం ఓటర్ల జాబితాను వెబ్‌సైట్‌లో ఓటర్ల ఫోటోలతో సహా పొందుపరిచిందని, అయితే ఎన్నికల సంఘం పార్టీలకు ఇచ్చిన జాబితాలో ఓటర్ల ఫోటోలు ఉండవని వైఎస్సార్‌ సీపీ నేతల బృందం ఈసీ దృష్టికి తెచ్చింది. టీడీపీ చర్యలు ఓటర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుందని, ఇది తీవ్రమైన అనైతిక చర్యని వివరించారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అవినీతికి పాల్పడి దోచుకున్న నాలుగైదు వేల కోట్ల రూపాయలను ఈ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు వీలుగా, వాటిని పంపిణీ చేసేందుకు టీడీపీ సర్కారు కొందరు పోలీసు అధికారులను కూడా ఎంపిక చేసుకుందని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పోలీసు అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ వారి ద్వారా ముఖ్యమైన రాజకీయ నేతల ఫోన్‌ నెంబర్లను ట్యాప్‌ చేయించడం, ప్రతిపక్షాలను వేధించడం, విపక్ష నేతలపై నిఘా, అవినీతి డబ్బుల తరలింపు లాంటి చర్యలకు దిగుతోందని ఎన్నికల సంఘానికి తెలిపారు.

ఈసీకి ఆధారాలతో సహా వివరించాం: వైఎస్‌ జగన్‌
కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌తో సమావేశం అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా ధిక్కరిస్తోందో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాం. అధికార తెలుగుదేశం ప్రభుత్వం ఓటర్ల జాబితాలో ఎలా అవకతవకలకు పాల్పడుతోందో ఈసీకి వివరించాం. ఆంధ్రప్రదేశ్‌లో 2018 సెప్టెంబర్‌ నాటికి 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉంటే ప్రస్తుతం వాటి సంఖ్య 59.18 లక్షలకు చేరింది. రాష్ట్రంలోని మొత్తం 3.69 కోట్ల మంది ఓటర్లలో 59.18 లక్షల మంది నకిలీ ఓటర్లు ఉన్నారు. దాదాపు 60 లక్షల నకిలీ ఓట్లలో ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ నమోదు చేసుకున్న ఓట్లు 20 లక్షల దాకా ఉన్నాయి. దాదాపు మరో 40 లక్షల ఓట్లు ఏపీలోనే రెండు చోట్లా నమోదయ్యాయి. ఇలా నకిలీ ఓట్లను ఎక్కడెక్కడ నమోదు చేశారన్న విషయాలను ఆధారాలతో సహా ఎన్నికల సంఘానికి సమర్పించాం. రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు నకిలీ ఓట్లను సృష్టిస్తూనే మరోవైపు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను సర్వేల పేరుతో జాబితా నుంచి అక్రమంగా తొలగిస్తోంది. ఈ క్రమంలో వైఎస్సార్‌ సీపీ మద్దతుదారులైన 4 లక్షల మంది ఓట్లను తొలగించారు. ప్రజా సాధికార సర్వే, పరిష్కార వేదిక, రియల్‌ టైమ్‌ గవర్నెన్స్, పిరియాడిక్‌ సర్వేల పేరుతో విపక్ష మద్దతుదారుల వివరాలు తెలుసుకుని వారి ఓట్లను తొలగిస్తున్నారు. ఈ తొలగింపు ప్రక్రియకు ఒక యాప్‌ను కూడా క్రియేట్‌ చేశారు. ఆధార్‌కార్డు, ఓటరు కార్డులను లింక్‌ చేస్తూ ఓట్లను తొలగిస్తున్నారు. ఈ విషయాలన్నిటినీ ఆధారాలతో సహా ఈసీ దృష్టికి తెచ్చాం.

సొంత సామాజిక వర్గానికి చెందిన 35 మందికి డీఎస్పీలుగా పోస్టింగులు
రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను సీఎం చంద్రబాబు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో ఈసీకి వివరించాం. పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే.. తన సామాజిక వర్గానికి చెందిన 37 మందిలో 35 మందికి సీఐల నుంచి డీఎస్పీలుగా ప్రమోషన్లు ఇచ్చారు. మిగిలిన ఇద్దరిలో ఒకరు చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి ఉన్నారు. ఇంత దారుణంగా డీఎస్పీలను ఎంపిక చేసుకుని పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్నడూ లేనివిధంగా ‘డీఐజీ లా అండ్‌ ఆర్డర్‌ కో ఆర్డినేషన్‌’ పోస్టు క్రియేట్‌ చేసి చంద్రబాబు తన సామాజిక వర్గానికి చెందిన ఘట్టమనేని శ్రీనివాస్‌రావును ఆ పదవిలో నియమించారు. ఇలా తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులను కీలక పోస్టుల్లో నియమించి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ విషయాలన్నిటిని ఎన్నికల కమిషన్‌కు వివరించాం.

ఆ ముగ్గురిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించండి..
‘చంద్రబాబు ఆధ్వర్యంలో డీజీపీ ఠాకూర్‌ పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్న వైనాన్ని ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు నివేదించాం. సీనియర్లు ఉన్నా చంద్రబాబు వారిని పక్కన పెట్టి ఠాకూర్‌ను డీజీపీగా నియమించారు. చంద్రబాబు వారిని ఎందుకు పక్కన పెట్టాడన్న విషయాలను సీఈసీకి వివరించాం. డీజీపీ చంద్రబాబుకు కొమ్ముకాశారు. నాపై విశాఖ ఎయిర్‌పోర్టులో హత్యాయత్నం జరిగితే ఎలాంటి విచారణ జరగక ముందే గంట లోపే చంద్రబాబుకు అనుకూలంగా వకాల్తా పుచ్చుకొని కేసును ఎలా పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారో కూడా ఈసీకి వివరించాం. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, న్యాయబద్ధంగా, ప్రజాస్వామ్యయుతంగా జరగాలంటే డీజీపీ, చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావు, లా అండ్‌ ఆర్డర్‌ కో ఆర్డినేషన్‌ డీఐజీ శ్రీనివాస్‌.. ఈ ముగ్గురిని ఎన్నికల బాధ్యతల నుంచి తప్పించాలని కోరాం. వీరిని తప్పిస్తే కానీ ఎన్నికలు స్చేచ్ఛగా జరగవు అని ఈసీకి వివరించాం.

డబ్బుల పంపిణీకి పోలీసులను వాడుకునే యత్నం..
సీఎం చంద్రబాబు పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ఎన్నికలను భ్రష్టుపట్టించే ప్రయత్నం చేస్తున్నారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు చేసిన అవినీతిని కూడా సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. బాబు అవినీతిపై ముద్రించిన ‘ఎంపరర్‌ ఆఫ్‌ కరప్షన్‌’ పుస్తకాన్ని సీఈసీకి అందజేశాం. అవినీతి డబ్బులో దాదాపుగా రూ. 4 వేల కోట్లపైగా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు చేర్చడం, దాన్ని పంచేందుకు పోలీసులను ఎలా వాడుకోనున్నారో వివరించాం. మేం చెప్పిన అన్ని విషయాలను సీఈసీ విన్నారు. ఆధారాలతో సహా ఇచ్చాం. మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం. ఈ ముగ్గురు అధికారులను తప్పించకపోతే చంద్రబాబుకు నేరుగా కొమ్ముకాసినట్టే అవుతుందని చెప్పాం. రాష్ట్రంలో పోలీసు, అధికార యంత్రాంగం దుర్వినియోగంపై కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేస్తాం. ఔటాఫ్‌ టర్న్‌ పోలీసులకు ఏ రకంగా పదోన్నతులు ఇచ్చారు అన్న విషయాలను హోంశాఖ దృష్టికి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తాం.’ 

2014లో బాబు ఈవీఎంలను ట్యాంపర్‌ చేసి గెలిచారా?
ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేయవచ్చని సీఎం చంద్రబాబు పేర్కొంటున్నారని ఈ సందర్భంగా కొందరు మీడియా ప్రతినిధులు వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకురాగా ఆయన స్పందిస్తూ... ‘ఇదే చంద్రబాబు 2014 ఎన్నికల్లో మా మీద కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో గెలిచారు. అప్పుడు ఈవీఎంల ద్వారానే ఆయన గెలిచాడు కదా. మరి చంద్రబాబు అప్పుడు ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసి గెలిచాడని మేం అనుకోవచ్చా? ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ ఓడిపోయింది. మరి నిజంగానే ఈవీఎంలను ట్యాంపరింగ్‌ చేసే అవకాశం ఉంటే ఆ మూడు రాష్ట్రాల్లో కూడా ట్యాంపరింగ్‌ జరిగి ఉండేది. అప్పుడు అక్కడ కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశం ఉండేది కాదు. బీజేపీనే మళ్లీ అధికారంలోకి వచ్చేది. ఏదైనా మాట్లాడితే లాజిక్‌ ఉండాలి. లాజిక్‌ అనేది లేకుండా ఎలాగూ ఓడిపోతున్నాం కాబట్టి ఆ ఓటమికి ప్రత్యర్థి పార్టీల మీద నెపం నెట్టాలని ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తే చంద్రబాబుకు బుద్ధి లేదన్న విషయాన్ని ప్రజలు గమనిస్తారు, అర్థం చేసుకోగలుగుతారు..’ అని జగన్‌ పేర్కొన్నారు.

సీఈసీని కలిసిన వారిలో వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, పీవీ మిథున్‌ రెడ్డి,  శాసన మండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పీఏసీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మాజీ ఎంపీ బాలశౌరి, రవిచంద్రారెడ్డి తదితరులు న్నారు.

రాష్ట్రంలో అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను చంద్రబాబు ఏ విధంగా భ్రష్టు పట్టిస్తున్నారో ఈసీకి వివరించాం. పోలీస్‌ వ్యవస్థను చంద్రబాబు ఎంత దుర్వినియోగం చేస్తున్నారంటే.. తన సామాజిక వర్గానికి చెందిన 35 మందికి సీఐల నుంచి డీఎస్పీలుగా నిబంధనలకు విరుద్ధంగా  ప్రమోషన్లు ఇచ్చారు. 
– మీడియాతో వైఎస్‌ జగన్‌ 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top