
సాక్షి, అమరావతి: హైదరాబాద్‌లో ఉన్న తాను రాష్ట్రానికి వచ్చేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు డీజీపీ గౌతం సవాంగ్‌ను కోరారు. ఈ మేరకు డీజీపీకి శనివారం లేఖ రాశారు. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే విమానంలో సోమవారం ఉదయం 10.35 గంటలకు ప్రయాణించాలనుకుంటున్నానని అందులో తెలిపారు. విశాఖలో ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను కలిశాక అదేరోజు అక్కడినుంచి గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసానికి రోడ్డు మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నట్టు వివరించారు.
విజయనగరం నడిబొడ్డున ఉన్న చారిత్రాత్మకమైన మూడు లాంతర్ల పిల్లర్‌ను కూల్చివేయడం తనను షాక్‌కు గురి చేసిందని అన్నారు. ఆ ప్రాంతంలో అశోక్‌గజపతిరాజు కుటుంబం గుర్తులను లేకుండా చేసేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్యల్లో ఇదొకటని ట్విట్టర్‌లో శనివారం విమర్శించారు. కాగా, అంగన్వాడీ వర్కర్లు కరోనా సమయంలోనూ జీవితాన్ని పణంగా పెట్టి పోరాడారని, వారికి రూ. 50 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని ఎమ్మెల్సీ నారా లోకేష్.. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు శనివారం ఆయనకు లేఖ రాశారు.