ఏపీ దిశ చట్టం బిల్లుపై మద్దతంటూనే మెలిక!

Chandrababu Inappropriate Comments On Disha Act Bill - Sakshi

ఏపీ దిశ చట్టం బిల్లుపై సూచనలకు బదులు చంద్రబాబు అసందర్భ వ్యాఖ్యలు

అధికార పక్షం అభ్యంతరం

కొడాలి నాని, అచ్చెన్న మధ్య వాగ్వాదం

సాక్షి, అమరావతి: ‘ఏపీ దిశ’ చట్ట రూపకల్పన బిల్లులపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు శుక్రవారం శాసనసభలో చేసిన అసందర్భ ప్రస్తావనలు శాసనసభలో దుమారం రేపాయి. బిల్లుపై సూచనలు చేయడానికి బదులు ఎలక్షన్‌ వాచ్‌ డాగ్‌ రిపోర్టులంటూ ఆయన వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రులు, అధికార పక్ష సభ్యులు అభ్యంతరం తెలిపారు.

సూచనలు కోరితే ఏమిటిది?
హోంమంత్రి సుచరిత ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణ బిల్లు ప్రతిపాదించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ప్రతిపాదిత చట్టానికి తాము పూర్తిగా మద్దతు తెలుపుతున్నామని, అయితే ఈ ఉత్సాహం అమలులోనూ ఉండాలన్నారు. తక్షణ న్యాయం అనేది ఉండదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పారని, దానిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఎలక్షన్‌ వాచ్‌ డాగ్‌ ఏడీఆర్‌ నివేదిక ప్రకారం ముగ్గురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయని విపక్ష నేత వ్యాఖ్యలు చేయడంపై మంత్రి విశ్వరూప్‌ అభ్యంతరం తెలిపారు.

ఆ ఘనత మీదే..
తహశీల్దారు వనజాక్షి కేసులో చంద్రబాబు నిర్వాకాన్ని ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రశ్నించారు. ఓ మహిళా అధికారిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ప్రశంసించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. ఐజీపీ హోదా కలిగిన ఎన్‌.బాలసుబ్రమణ్యంపై నాడు టీడీపీ ఎంపీ, ఎంఎల్‌ఏ, ఎమ్మెల్సీలు దాడి చేస్తే బాధిత అధికారికి న్యాయం చేయడానికి బదులు పంచాయితీ చేసిందెవరని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నిలదీశారు. వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలపై క్రిమినల్‌ కేసులున్నాయని చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం పట్ల మంత్రి వెలంపల్లి అభ్యంతరం తెలిపారు. టీడీపీ హయాంలో తమపై కేసులు పెట్టారంటూ కాల్‌ మనీ, సెక్స్‌రాకెట్‌ కేసులను ప్రస్తావించారు.

ఎర్రగడ్డ ఆస్పత్రి...అమరావతిలో మానసిక చికిత్సాలయం
శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ దళిత మహిళ టెక్కలి సీఐ, ఎస్‌ఐ, అచ్చెన్నాయుడి వేధింపులు భరించలేక గతంలో సచివాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిందని ఎమ్మెల్యే అప్పలనాయుడు గుర్తు చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందిస్తూ అధికార పార్టీ సభ్యులు, మంత్రుల వ్యాఖ్యలు వినలేకపోతున్నామని, కొడాలి నానీని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చేరిస్తే మంచిదనటంతో వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అచ్చెన్నను ముందు వెటర్నరీ ఆస్పత్రిలో చేర్చాలని, అమరావతిలో మానసిక చికిత్సాలయం ఏర్పాటు చేసి అందులో తొలి పేషెంట్‌గా చంద్రబాబును చేర్చాలని లేదంటే ఆయన మార్షల్స్‌ను, పోలీసులను కొడుతుంటారని మంత్రి కొడాలి నాని ఘాటుగా ప్రతిస్పందించారు.

ఈ దశలో అచ్చెన్న, కొడాలి నానీ మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో ఆ పదాలను రికార్డుల నుంచి తొలగించాలని అంబటి రాంబాబు స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాత మాట్లాడిన చంద్రబాబు బిల్లుకు మద్దతిస్తున్నామంటూనే మార్షల్స్‌తో జరిగిన వివాదాన్ని ప్రస్తావించారు. ఏకపక్షంగా తీర్పు ఇచ్చారని, తాను అనని మాటలను అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని ఆరోపించారు. ఈ సమయంలో టీడీపీ సభ్యుడు నిమ్మల రామానాయుడు, కన్నబాబుకు మధ్య ’నాయుడు’ అనే పదంపై వాగ్వాదం జరిగింది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top