‘సంక్షేమం’లో మనమే బెస్ట్‌ 

Chandrababu Comments At Nuzvid Election preparatory meeting - Sakshi

ఎన్నికల సన్నాహక సభల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు  

చింతలపూడి సభకు ఎమ్మెల్యే పీతల సుజాత డుమ్మా 

ఆద్యంతం సానుభూతి కోసం ఆరాటం 

సీబీఐ, ఈడీ, ఐటి గ్రిడ్స్‌ కేసులు పెట్టారని ఆక్రోశం 

నూజివీడు/చింతలపూడి: మన రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు అమలైనట్లుగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు కావడం లేదని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కృష్ణాజిల్లా నూజివీడు, పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడిలో జరిగిన టీడీపీ ఎన్నికల సన్నాహక సభల్లో ఆయన పాల్గొన్నారు. నూజివీడులో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్పి.. కేవలం 2 శాతం లోపు ఓట్లకు పరిమితం చేశారన్నారు. బీజేపీ ప్రత్యేకహోదా ఇస్తానని తిరుపతిలో వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత  మాట తప్పారని ధ్వజమెత్తారు. దేశాన్ని కాపాడతానన్న కాపలాదారుడు నరేంద్రమోదీ మోసం చేశాడని విమర్శించారు. పట్టిసీమ కృష్ణాడెల్టాకు వరమని, ఈ ఏడాది జూలై నాటికి గ్రావిటీతో పోలవరం నుంచి నీటిని సరఫరా చేస్తామని చెప్పారు. 15లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడానికి ఎంవోయూలు కుదుర్చుకున్నామని, దీని ద్వారా 30 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. 

హైదరాబాద్‌ను నేనే అభివృద్ధి చేశా.. 
ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేస్తూ రెచ్చిపోయారు. హైదరాబాద్‌ను తానే అభివృద్ధి  చేశానని, సైబరాబాద్‌ను సృష్టించి ఆదాయాన్ని పెంచానని హైదరాబాద్‌ అభివృద్ధి తన కష్టార్జితం అని చెప్పుకున్నారు. చింతలపూడిలో ఆయన మాట్లాడుతూ.. పదే పదే జగన్, మోదీ, కేసీఆర్‌ను తలుచుకుంటూ వారిపై తన అక్కసునంతా వెళ్ళగక్కారు. మోదీ, కేసీఆర్‌ తనపై, తన పార్టీ నాయకులపై సీబీఐ, ఐటీ దాడులు చేయించి, ఐటి గ్రిడ్స్‌పై కేసులు పెట్టించి ఇబ్బందులు కలగచేశారని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీకి దిగిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను భయపెట్టి, బెదిరించి ప్రతిపక్ష పార్టీలోకి చేరేలా కుట్రలు చేశారని ఆరోపించారు. వివేకానందరెడ్డి  హత్య ఇంటి దొంగల పనేనని అన్నారు.   కాగా, చింతలపూడిలో జరిగిన సభకు స్థానిక ఎమ్మెల్యే పీతల సుజాత డుమ్మా కొట్టారు. ఆమెకు టికెట్‌ నిరాకరించడంతో ఇండిపెండెంట్‌గా నామినేషన్‌ వేసే ఆలోచనలో ఉన్నట్లు కార్యకర్తలు చెబుతున్నారు. 

ఆద్యంతం సానుభూతి పొందేందుకు యత్నం..  
ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి లబ్ధిపొందేలా చంద్రబాబు ప్రసంగం సాగింది. ఓటుకు నోటు కేసులో దొరికి హైదరాబాద్‌ను వదిలేసి వచ్చారన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినప్పటికీ.. కష్టాల్లో  మనల్ని వెళ్లగొట్టారంటూ  సానుభూతిని పొందడానికి బాబు ప్రయత్నించడం సొంత  పార్టీ శ్రేణులకే విస్మయం కలిగించింది. కాగా, ‘సాక్షి’ దినపత్రికపై చంద్రబాబు మరోసారి తన అక్కసును వెళ్లగక్కారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top