నాడు ‘ప్యాకేజీ’కి అంగీకరించా | Chandrababu Comments In Dharma Porata Deeksha At Delhi | Sakshi
Sakshi News home page

నాడు ‘ప్యాకేజీ’కి అంగీకరించా

Feb 12 2019 5:01 AM | Updated on Mar 28 2019 5:23 PM

Chandrababu Comments In Dharma Porata Deeksha At Delhi - Sakshi

ఢిల్లీలో జరిగిన సభలో మాట్లాడుతున్న సీఎం

సాక్షి, న్యూఢిల్లీ: నాడు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించానని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలో.. ఎన్డీయే నుంచి బయటకొచ్చేందుకు ప్రత్యేక హోదానే కారణమని చిత్రీకరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఖర్చుతో, ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకుని నిర్వహించిన ఈ దీక్ష ఉదయం 8.40కి ప్రారంభం కాగా.. రాత్రి 8 గంటలకు మాజీ ప్రధాని దేవెగౌడ నిమ్మరసం ఇవ్వడంతో ముగిసింది. ఆర్థిక సంఘాన్ని సాకుగా చెబితే ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించానన్న చంద్రబాబు.. హోదా వద్దని తాము చెప్పలేదన్న ఆర్థిక సంఘం సభ్యుల ప్రకటనతో అప్రమత్తమై ఎన్డీఏ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. కాగా 14వ ఆర్థిక సంఘం 2015లో నివేదిక ఇవ్వగా.. ఎన్డీయే నుంచి టీడీపీ 2018లో బయటకు రావడం గమనార్హం. 
 
నాది కాదు.. మీది యూటర్న్‌ 
ప్రసంగం మొత్తం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన అంశాన్ని సమర్ధించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. ‘ఎవరికీ ప్రత్యేక హోదా ఇవ్వలేదని, మీకు కూడా ఇవ్వమని కేంద్రంలోని పెద్దలు చెప్పారు. ప్రత్యేక హోదా కంటే మిన్నగా ఇస్తామంటే ఇమ్మని చెప్పాం. అయితే మనకు ఇవ్వకుండా 11 రాష్ట్రాలకు ఇచ్చిన రోజే మాకెందుకు ఇవ్వరని నిలదీసి అడిగిన ఘనత మా ప్రభుత్వానిది. అక్కడి నుంచి పోరాటం ప్రారంభించాం. కేంద్ర ప్రభుత్వం అసత్యాలు చెబుతోంది. డబ్బులిచ్చినా లెక్కలు చెప్పడం లేదని మాట్లాడుతున్నారు. అన్ని లెక్కలు ఇచ్చినా పీఎంవో డబ్బులు ఇవ్వకుండా అడ్డుపడింది. మనం ఎప్పుడూ కూడా లెక్కలు ఇవ్వకుండా ఆగింది లేదు. భారతదేశంలోనే పారదర్శకత గల ఏకైక ప్రభుత్వం టీడీపీ. మీతో కలిసి ఉన్నంతవరకు మంచివాళ్లుగా కనిపించాం. మా పనుల కోసం అడిగితే, ప్రత్యేక హోదా అడిగితే మీకు మేం వ్యతిరేకంగా కనబడ్డాం. ఏపీకి అన్యాయం చేశారు కాబట్టే పోరాడుతున్నాను. 14వ ఆర్థిక సంఘాన్ని సాకుగా చూపి హోదా ఇవ్వలేమన్నారు. తాము హోదా వద్దనలేదని 14వ ఆర్థిక సంఘం సభ్యులు కూడా ప్రకటించారు. నేను యూటర్న్‌ తీసుకున్నానని అంటారు.. కానీ నాది కాదు మీది యూటర్న్‌’ అని ప్రసంగం ఆసాంతం ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్న నెపం తనది కాదని చెప్పేందుకు చంద్రబాబు కష్టపడ్డారు. 
 
ఇప్పటికైనా తప్పు సరిదిద్దుకోండి 

ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో చంద్రబాబు విరుచుకుపడ్డారు. ‘మా ముఖాన పార్లమెంటు మట్టి, యమునా నీళ్లు కొట్టారు. పార్లమెంటులో రేపో ఎల్లుండి ద్రవ్య బిల్లు రానుంది. ఇప్పటికైనా చేసిన తప్పును సరిదిద్దుకోండి. మొత్తం 18 డిమాండ్లు ఉన్నాయి. వాటిని నెరవేర్చాలి. ప్రత్యేక హోదా ఇవ్వాలని మనం అడిగితే ప్రధాని గుంటూరు వచ్చి మనపై ఎదురుదాడి చేశాడు. వ్యక్తిగత దూషణలు చేస్తాడు. మనం అలా చేస్తే ప్రధాని ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ప్రజల సొమ్ముతో ధర్నా చేస్తున్నామని అంటున్నాడు. ఫొటో సెషన్‌ కోసం చేస్తున్నామని అన్నాడు. మీ కంటే గొప్ప నటుడు ఎవరూ లేరు..’ అని మోదీపై విమర్శలు గుప్పించారు.  
 
దీక్షకు పలువురు నేతల సంఘీభావం 

చంద్రబాబు దీక్షకు కాంగ్రెస్‌ కూటమిలోని మిత్రపక్షాలు సంఘీభావం తెలిపాయి. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, మాజీ ప్రధానులు దేవెగౌడ, మన్మోహన్‌ సింగ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ సీఎంలు కేజ్రీవాల్, కమల్‌నాథ్, జమ్ముకశ్మీర్, మధ్యప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా, దిగ్విజయ్‌ సింగ్, లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, ఎస్పీ నేత ములాయం సింగ్‌ యాదవ్, టీఎంసీ ఎంపీ డెరిక్‌ ఒబ్రెయిన్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. ఏపీ నుంచి ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు చలసాని శ్రీనివాస్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్, ఏపీ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ జేఏసీ, ఏపీ జేఏసీ–అమరావతి సంఘాల నేతలు హాజరయ్యారు.  నేడు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఏపీ డిమాండ్లను వినిపిస్తామని, ఏపీ భవన్‌ నుంచి ఊరేగింపుగా వెళ్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 
 
రియాల్టీ షోని తలపించిన బాబు దీక్ష  
రూ.10 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి ప్రభుత్వం తరపున చంద్రబాబు చేపట్టిన ఒక రోజు ఢిల్లీ దీక్ష రియాల్టీ షోని తలపించింది. సొమ్ము సర్కారుదే అయినా దీక్షలో కూర్చుకున్న వారంతా పసుపు చొక్కాలు ధరించిన కార్యకర్తలే కావడం గమనార్హం. ఉదయం రాజ్‌ఘాట్‌ వద్ద మహాత్ముడికి, ఏపీ భవన్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం చంద్రబాబు దీక్షను ప్రారంభించారు. పలువురు జాతీయ స్థాయి నేతల్ని దీక్షకు పిలిపించుకుని వారితో పొగిడించుకునేందుకు చంద్రబాబు ఆరాటపడినట్లు కనిపించింది. సంఘీభావం తెలిపేందుకు వచ్చిన నేతలను ఆహ్వానించడం, వారిని సాగనంపడంలో బాబు బిజీగా గడిపారు. జాతీయస్థాయి నేతలు చంద్రబాబును పొగడడం, తిరిగి చంద్రబాబు వారిని పొగడడం.. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే తంతు కొనసాగింది. ప్రత్యేక హోదా కోసం గతంలో ఏపీలో ధర్నాకు వచ్చిన రాహుల్‌ గాంధీ, ఇతర జాతీయ నేతలపై కోడిగుడ్లు, టమోటాలు వేయించినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్పి వివరణ ఇచ్చాకే ఢిల్లీలో దీక్ష చేయాలని ఏపీ కాంగ్రెస్‌ నేతలు డిమాండ్‌ చేసిన విషయం తెలిసిందే. ఏపీ కాంగ్రెస్‌ నుంచి ఒక్క నేత కూడా దీక్షకు హాజరుకాకపోవడం గమనార్హం.  
 
తెలుగు తమ్ముళ్లపై చంద్రబాబు అసహనం 
ఢిల్లీ దీక్షకు రూ. 10 కోట్ల ప్రజా ధనాన్ని వెచ్చించిన చంద్రబాబు దీక్ష మధ్యలో తీవ్ర అసహనానికి గురయ్యారు. రూ. 1.2 కోట్లు వెచ్చించి అనంతపురం, శ్రీకాకుళం నుంచి ఏర్పాటు చేసిన రెండు రైళ్ల ద్వారా వచ్చిన టీడీపీ కార్యకర్తలు దీక్ష ప్రాంగణాన్ని వదిలి నగర వీక్షణకు వెళ్లడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీక్ష ప్రాంగణంలో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో మైక్‌ అందుకొని కార్యకర్తలందరూ కుర్చీల్లో కూర్చొవాల్సిందిగా అభ్యర్థించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement