చాయ్‌వాలాకా చమత్కార్‌

Chaiwala Elected As Prime Minister Of India - Sakshi

ఒక చాయ్‌వాలా ప్రధాని పదవిని అధిరోహిస్తాడని ఎవరైనా ఊహించగలరా? అసాధ్యమనుకుంటాం. కానీ  అదే చాయ్‌వాలాకి దేశంలోనే అత్యున్నత పదవిని అప్పగించి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో అసాధ్యమైనదేదీ లేదని రుజువు చేశారు ఈ దేశ ప్రజానీకం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే కాదు ఈ దేశ రాజకీయచరిత్రనే మలుపుతిప్పిన అసాధ్యుడు నరేంద్రమోదీ. నమో మంత్రంతో జనంమదిని మెప్పించి, సరికొత్త నినాదాలతో కుర్రకారుని ఒప్పించి, స్వచ్ఛభారత్‌ ఆచరణతో సరికొత్త భారత్‌ని ఆవిష్కరించి గత ఎన్నికలకు ముందే మోదీ తనదైన మార్కుతో యువతరం గుండెల్లో చెరగని జ్ఞాపకంగా మారారు. టీ కొట్టులో గ్లాసులు కడిగే దగ్గర్నుంచి దేశంలో అవినీతిని తరిమికొట్టేవరకూ మోదీ ప్రస్థానం ఎల్లలు దాటింది. చాయ్‌ వాలా నుంచి పుల్వామా వరకూ ఆయనకు అన్నీ కలిసొచ్చిన అంశాలే. ఆయన జీవన ప్రస్థానంలో అనేకానేక అపశృతులూ లేకపోలేదు.

గుజరాత్‌ మతకల్లోలం, గోద్రా అల్లర్లూ, దళితులపై దాడులూ ఆయన పాలనపై చీకటి ముద్రలే. అయినప్పటికీ ఆయన అభివృద్ధిమంత్రం, దేశభక్తి తంత్రంతో ప్రజలు మళ్ళీ పట్టం కట్టారు. వ్యక్తిగత జీవితానికీ, రాజకీయజీవితానికి మధ్య అనేక అసమతుల్యతలున్నా, కట్టుకున్న యశోదా బెన్‌ని విడిచిపెట్టి రాజకీయ జీవితాన్నెంచుకునేలా చేశాయి. వైవాహిక బంధాన్ని కాదనుకున్నా రక్తసంబంధానికి తలొగ్గారు మోదీ. తల్లి హీరాబెన్‌ పాదాభివందనంతో భారతీయ తల్లుల ప్రేమను గెలుచుకున్నారు. యోగాని ఒక ఆసనంగా కాక భారతీయ సాంప్రదాయక సాహసంగా తీర్చి దిద్ది ప్రపంచప్రజల దృష్టిని ఆకర్షించారు. ఆహారం, ఆరోగ్యంపైనే కాదు ఆహార్యంపై సైతం ఆయనకు ఎనలేని శ్రద్ధ. వేదికపై నుంచుంటే ఆయన మాటే మంత్రమౌతుంది. వేదిక దిగితే ఆయన జనసంద్రంగా మారతాడు. సెల్ఫీల ప్రపంచంలో యువతరాన్నే తోసిరాజనే మోదీ గురించి...

 • గుజరాత్‌లో వాదానగర్‌ అనే చిన్న ఊర్లో 1950, సెప్టెంబర్‌ 16న మోదీ జన్మించారు. అత్యంత వెనుకబడిన ఘాంచి కులంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మోదీ చిన్నతనంలో పొట్ట కూటికోసం టీ అమ్మేవారు. 
 • పాఠశాల విద్య పూర్తయ్యాక ఆయన ఇల్లు విడిచిపెట్టి దేశపర్యటన చేశారు. అదే ఆయనకి జీవితాన్ని బోధించింది. ఈ దేశ భిన్న సంస్కృతిని అర్థం చేసుకునేలా చేసింది. రిషికేష్, హిమాలయాలు, రామకృష్ణ మిషన్, ఈశాన్య రాష్ట్రాల సందర్శన ఆయన  వ్యక్తిత్వంపై ఎనలేని ప్రభావం చూపింది.
 • రెండేళ్ల పాటు ఊరూరూ తిరిగిన ఆయన 1971లో అహ్మదాబాద్‌లో ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా చేరారు.
 • 1975–77లో అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు ముద్రించి, పోలీసుల కన్నుగప్పి అందరికీ పంచిపెట్టినప్పుడే ఆయనలో నాయకత్వ లక్షణాలు బయటపడ్డాయి.
 • 1985లో బీజేపీ గూటికి చేరి, 1987లో గుజరాత్‌ రాష్ట్ర శాఖ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 
 • అద్వానీ రథయాత్రకు అడ్డంకులు రాకుండా వెన్నంటి ఉన్నప్పుడు ఆయనలో శక్తి సామర్థ్యాలు ఎంతటివో పార్టీ అధిష్టానానికి తెలిసివచ్చింది. 
 • 2002లో తొలిసారిగా గుజరాత్‌ సీఎం అయ్యారు.
 • అదే సంవత్సరంలో జరిగిన గోద్రా అల్లర్లు ఆయన ప్రభుత్వానికి మాయని మచ్చలా మారాయి. ఆ అల్లర్లను తెరవెనుక నుంచి ప్రభుత్వమే ప్రేరేపించిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. 
 • దీంతో మోదీ ముఖ్యమంత్రిగా గద్దె దిగాల్సి వచ్చింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయ భేరి మోగించిన మోదీ ప్రజల్లో తనకు వ్యతిరేకత లేదని నిరూపించుకున్నారు. తర్వాత సుప్రీంకోర్టు కూడా మోదీ సర్కార్‌కి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. 
 • అప్పట్నుంచి వరసగా పదిహేనేళ్ల పాటు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించారు. ఎన్నో రాష్ట్రాలకు గుజరాత్‌ ఆదర్శంగా నిలిచింది. అయితే మానవాభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడే ఉందని కొన్ని సర్వేలు నిందించాయి.
 • మోదీ తన వాగ్ధాటితో ప్రజల్ని అమితంగా ఆకర్షించారు. అప్పట్లోనే సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగించుకుని కాంగ్రెస్‌ను దెబ్బకొట్టి ప్రధాని పీఠం అధిష్టించారు.
 • ప్రధానమంత్రి హోదాలో గత అయిదేళ్లలో అమెరికా సహా 59 దేశాలు చుట్టేశారు. ఇందుకోసం ఆయన చేసిన ఖర్చు రూ. 2,201 కోట్లు. ప్రధాని పదవిలోకి వచ్చాక దసరా సమయంలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు. దేవి భక్తుడైన మోదీ ప్రధానిగౌరవార్థం అమెరికా ఇచ్చిన విందుని కూడా కాదనుకుని, కేవలం నిమ్మరసం మాత్రమే తీసుకుని ఉపవాసాన్ని కొనసాగించారు.
 • నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభపై నమ్మకంతో 2014లో బీజేపీ ఆయనను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. అదే ఆ పార్టీకి అన్ని విధాలా కలిసొచ్చిన అంశం.
 • ఐదేళ్ల పాలనలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, నిరుద్యోగాన్ని అరికట్టలేకపోవడం, రైతు సమస్యలు వంటివి మోదీ ప్రతిభను మసకబార్చాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు పాక్‌తో నెలకొన్న ఉద్రిక్తతలు ఆయన నాయకత్వాన్ని అపారంగా విశ్వసించేలా చేశాయి. ఇప్పుడు దేశభద్రత అంశం కలిసొస్తుందన్న ఆశతో మోదీ ఉన్నారు.
Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top