చేనేతలను మోసగించిన ఘనత బాబుదే

Butta Renuka Slams On Chandrababu Naidu - Sakshi

చేనేత, చేతివృత్తుల ఆత్మీయ సమావేశంలో ధ్వజమెత్తిన ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల

అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతల అభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే ఆర్కే

మంగళగిరి: రాష్ట్రంలోని చేనేతలను నమ్మించి మోసగించిన ఘనత చంద్రబాబుదేనని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ధ్వజమెత్తారు. తన కొడుకు రాజకీయ భవిష్యత్తు కోసం చేనేత మహిళలను మభ్యపెట్టి మోసం చేసి అవమానించిన చంద్రబాబుకు రాష్ట్రంలోని నేతన్నలంతా తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేనేత, చేతివృత్తుల సంఘాల నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. బుట్టా రేణుక మాట్లాడుతూ జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించేలా ఎన్డీయే ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎంత చెప్పినా బాబు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మాట ఇచ్చారంటే ఎంత నష్టం జరిగినా నిలబెట్టుకుంటారన్నారు.

బీసీలకు 41 సీట్లు ఇవ్వడంతో పాటు తనకు ఇచ్చిన కర్నూలు ఎంపీ సీటు తాను పార్టీ మారినా మరో బీసీ పద్మశాలీయులకే ఇచ్చారు కానీ బాబులా మోసం చేయలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల మాట్లాడుతూ చంద్రబాబు తమను నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ మహిళలను మోసం చేసిన చంద్రబాబు, లోకేష్‌లకు బీసీలంతా ఐక్యంగా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచి మంగళగిరిలో చరిత్ర సృష్టించాలన్నారు. ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేత పరిశ్రమ అభివృద్ధితో పాటు స్వర్ణకారుల సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు.

పలువురు నేత సంఘాల నాయకులు మాట్లాడుతూ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బీసీలైన మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమలను పిలిచి టిక్కెట్‌ ఇచ్చారని గుర్తు చేశారు. నేడు సంఘాల నేతలను గంటల తరబడి పడిగాపులు కాయించి అవమానించి చివరకు తన కుమారుడికి టిక్కెట్‌ ఇచ్చి బీసీలను అగౌరవపరచిన చంద్రబాబుకు బీసీల సత్తా ఏమిటో తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో బీసీ నేత దామర్ల కుబేరస్వామి, కాండ్రు శ్రీనివాసరావు, మాచర్ల సుధాకర్, దామర్ల ఉమామహేశ్వరరావు, ప్రగడ ఆదిసుదర్శనరావు, చింతక్రింది సాంబశివరావు, చింతకింది కనకయ్య, పాండురంగారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top