వీరిద్దరూ ఎక్కడ?

Butta Renuka, kothapalli geetha not prosest to Centre - Sakshi

పార్లమెంట్‌లో నిరసనలకు రేణుక, గీత దూరం

అనర్హత భయంతో సీట్లకే పరిమితం

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో తమ రాష్ట్రానికి జరిగిన అన్యాయానికి నిరసనగా ఆంధ్రప్రదేశ్‌ ఎంపీలు పార్లమెంట్‌లో ఆందోళనలు కొనసాగిస్తున్నారు. టీడీపీ, వైఎస్సార్‌సీపీ ఎంపీలు తమ ఆందోళనలతో ఉభయ సభలను హోరెత్తిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇద్దరు మహిళా ఎంపీలు మాత్రం ఎక్కడా కనబడటం లేదు. వారి​ద్దరూ బుట్టా రేణుక, కొత్తపల్లి గీత అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వీరిద్దరూ వైఎస్సార్‌సీపీ తరపున పోటీ చేసి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత అధికార టీడీపీలోకి ఫిరాయించారు. తాజాగా పార్లమెంట్‌లో ఏపీ ఎంపీలు వెల్‌లోకి దూసుకెళ్లి ఆందోళనలు చేస్తున్నా వీరు మాత్రం తమ సీట్లను వదిలిరావడం లేదు. పార్లమెంట్‌ వెలుపల, బయటా సాగించిన నిరసన కార్యక్రమాల్లోనూ కనబడలేదు.

కారణం అదేనా?
టీడీపీ ఎంపీలతో కలిసి నిరసన చేపట్టకపోవడానికి అనర్హత భయమే అన్న వాదన విన్పిస్తోంది. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని ఇప్పటికే రాష్ట్రపతికి, లోక్‌సభ స్పీకర్‌కు వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. పార్లమెంట్‌లో టీడీపీ ఎంపీలతో కలిసి కనబడితే పదవికి ముప్పురావచ్చన్న భయంతో మహిళా ఎంపీలిద్దరూ ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని వినికిడి. కేంద్ర బడ్జెట్‌పై పార్లమెంట్‌లో వ్యవహరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో నిర్వహించిన టీడీపీ ఎంపీల సమావేశానికి హాజరైన రేణుక.. లోక్‌సభలో నిరసన కార్యక్రమాలకు దూరంగా ఉండటం గమనార్హం.

బాబు డ్రామా !
ఇదంతా చంద్రబాబు ఆడిస్తున్న నాటకమని వైఎస్సార్‌సీపీ ఆరోపిస్తోంది. ఇంతకుముందు జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలప్పుడు కూడా ఇలాంటి డ్రామానే నడిపారని గుర్తు చేసింది. తమ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల పేర్లను వైఎస్సార్‌సీపీలో కొనసాగతున్నట్టుగా చూపించి అసెంబ్లీ సమావేశాల ఉత్తర్వులను విడుదల చేశారని వివరించారు. అసెంబ్లీలో తాము లేకున్నా ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సభను నడిపిన విషయాన్ని వెల్లడించింది.

సుజనా, అశోక్‌ వెనుకంజ
కేంద్రానికి వ్యతిరేకంగా సాగిస్తున్న నిరసనల్లో కేంద్ర మంత్రులుగా ఉన్న టీడీపీ ఎంపీలు అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి ఎక్కడా కనిపించడం లేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న తాము నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటే తమ పదవులకు ఎక్కడ ప్రమాదం వాటిల్లుతుందన్న భయంతోనే వీరిద్దరూ వెనుకంజ వేస్తున్నట్టు కనిపిస్తోంది. ఏపీకి న్యాయం చేయలేమని పార్లమెంట్‌ సాక్షిగా కేంద్రం స్పష్టం చేసినా పదవులు పట్టుకుని ఎందుకు వేళాడుతున్నారని వీరిని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్రానికి న్యాయం చేయలేనప్పుడు కేంద్ర పదవులు ఎందుకని నిలదీస్తున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top