దొంగ ఓట్లకు తెరతీసిన చంద్రబాబు

Buggana Rajendranath Reddy comments on Chandrababu - Sakshi

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి  

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల్లో లబ్ధి కోసం చంద్రబాబు విచ్చలవిడిగా బోగస్‌ ఓట్లు సృష్టిస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ప్రజా పద్దుల కమిటీ చైర్మన్‌ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో శనివారం గవర్నర్‌ నరసింహన్‌ను వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసిన అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన నిర్వాకం వల్ల చాలామంది పేర్లు ఓటర్ల జాబితాలో కనిపించడం లేదని మండిపడ్డారు. విచ్చలవిడిగా ఓట్లు తీసేశారని, మరికొందరికి రెండు మూడు ఓట్లున్నాయని అన్నారు.

పల్లెలు, పట్నాల్లోని నకిలీ ఓట్లను తీయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటే.. దానికి బదులు ప్రభుత్వమే నకిలీ ఓటర్లను చేర్పించే ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 3.69 కోట్ల ఓట్లుంటే.. ఇంచుమించు 60 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పారు. వీటిని తొలగించకపోగా సాధికార సర్వే, ఆర్టీజీఎస్‌ అని సర్వేలు చేస్తూ.. చివరిలో మీరు ఏ పార్టీని ఇష్ట పడుతున్నారు? ఏ పార్టీకి ఓటేస్తారు? అనే ప్రశ్నల్ని సర్వేలో పెట్టారని, రాష్ట్ర ప్రభుత్వం సర్వే చేసేటపుడు ఇలా ఎక్కడైనా ఏ పార్టీకి ఓట్లేస్తారని అడుగుతారా? అని ప్రశ్నించారు.

సర్వేల పేరుతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సానుభూతి పరుల ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇవన్నీ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలో జరిగే ఎన్నికల్లో విచ్చలవిడిగా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు, కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మరో 15 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్‌ రానున్న నేపథ్యంలో ప్రజలతో ప్రమాణాలు చేయిస్తూ అన్యాయమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును కూడా గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లినట్టు చెప్పారు. అలాగే పోలీసు, రెవెన్యూ యంత్రాంగంలో టీడీపీ తమకు కావాల్సిన సామాజిక వర్గానికి చెందిన వారికి కీలక పదవులు కట్టబెడుతోందన్నారు.

పోలీసు, రెవెన్యూ శాఖతో పాటు ఎన్నికల విధి నిర్వహణలో ఎవరు భాగస్వాములవుతారో అలాంటి పోస్టుల్లో తమకు అనుకూలమైన వారిని నవంబర్, డిసెంబర్‌ నెలల్లో నియమించుకున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే వారినే డీఎస్పీ, ఆర్డీఓ తదితర పదవుల్లో పెట్టుకున్న తీరును జగన్‌మోహన్‌రెడ్డి గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ఎన్నికలు న్యాయంగా, స్వేచ్ఛగా జరగాలని, దొంగ ఓట్లను తొలగించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేసినట్టు వివరించారు.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top