అది గత ప్రభుత్వ ఘనకార్యమే! | Buggana Rajendranath Comments On TDP Govt | Sakshi
Sakshi News home page

అది గత ప్రభుత్వ ఘనకార్యమే!

Oct 24 2019 5:03 AM | Updated on Oct 24 2019 5:03 AM

Buggana Rajendranath Comments On TDP Govt - Sakshi

సాక్షి, అమరావతి: ఇండియా ఇన్నోవేటివ్‌ ఇండెక్స్‌ – నీతి ఆయోగ్‌ సర్వేలో ఏపీకి 10వ ర్యాంకు వచ్చిందని ప్రతిపక్ష నేత చంద్రబాబు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, తదితరులు దుష్ప్రచారం చేస్తుండటంపై ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. సర్వే గత ఐదేళ్ల ప్రభుత్వ పనితీరును బేరీజు వేసి చేసిందని గుర్తు చేశారు. బుధవారం సచివాలయంలో మాట్లాడిన ఆయన రాష్ట్రంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితులకు టీడీపీ ప్రభుత్వమే కారణమన్నారు. 

ఐదేళ్లు కావాలి: నీతి ఆయోగ్‌ సర్వేలో పేర్కొన్న ఏడు ఇండికేటర్లు, 30 సబ్‌ ఇండికేటర్లు మూడు నెలల్లో అమలు చేసేవి కావని మంత్రి బుగ్గన అన్నారు. వాటికి కనీసం ఐదేళ్లు కావాలని తెలిపారు. ‘ఇండియా ఇండెక్స్‌ సర్వేలో రాష్ట్రాల పరిస్థితులపై నివేదిక ఇచ్చారు. కొత్తదనం, వినూత్న ఆవిష్కార పరిస్థితులపై సర్వే చేశారు. మన రాష్ట్రంలో ఉన్న పరిజ్ఞానాన్ని అమలు చేసే విధానంలో వెనుకంజలో ఉన్నామని వారు చెప్పారు.  అసలు ఈ పరిస్థితికి చంద్రబాబు పాలన కారణం కాదా?’ అని బుగ్గన ప్రశ్నించారు. ‘ఇన్నాళ్లు లక్షల కోట్లు పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని టీడీపీ నేతలు చెప్పారు. అదే నిజమైతే ఈ పరిస్థితి ఎందుకొస్తుంది’? అని నిలదీశారు.

ప్రస్తుత పరిస్థితికి టీడీపీ ప్రభుత్వమే కారణం
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితికి గత టీడీపీ ప్రభుత్వమే కారణమని మంత్రి బుగ్గన తేల్చిచెప్పారు. పరిశ్రమలకు రాయితీలు ఇవ్వకుండా ఆ రంగాన్ని నిర్వీర్యం చేశారని విమర్శించారు. 2014–15లో పరిశ్రమలకు రాయితీల కింద రూ.2 వేల కోట్లు ఇచ్చిన టీడీపీ ప్రభుత్వం 2015–16లో రూ.290 కోట్లు కేటాయించి కేవలం రూ.26 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. 2016–17లో రూ.470 కోట్లు కేటాయించి రూ.292 కోట్లే విడుదల చేసిందని, 2017–18లో రూ.976 కోట్లు కేటాయించి రూ.740 కోట్లు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. 2018–19లో రూ.3,500 కోట్లు కేటాయించినా రూ.740 కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. 

స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు
‘స్థిరమైన అభివృద్ధి లక్ష్యాల్లో రెండోదైన జీరో హంగర్‌లో రాష్ట్రం 17వ స్థానంలో ఉంది. అందుకే ప్రతి ఒక్కరికి పౌష్టికాహారం అందేలా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తున్నాం. తాగునీరు, పారిశుధ్యంలో 16వ స్థానంలో ఉండగా, ఆ సమస్యను అధిగమించేందుకు వాటర్‌గ్రిడ్‌ వంటి పథకాలు అమలు చేస్తున్నాం. పరిశ్రమలు, మౌలిక వసతుల్లో 20వ ర్యాంక్‌లో ఉన్నందువల్ల, ఈ పరిస్థితి మార్చేందుకు కొత్త పారిశ్రామిక విధానం ప్రకటించాం. ప్రాంతీయ అసమానతల్లో 14వ ర్యాంక్‌లో ఉన్నాం. దీన్ని అధిగమించడం కోసం ప్రభుత్వం అన్ని ప్రాంతాలపై దృష్టి పెట్టింది.’ అని బుగ్గన వివరించారు.

డిస్కమ్‌లను నష్టాల్లోకి నెట్టారు: టీడీపీ ప్రభుత్వం డిస్కమ్‌లను నష్టాల్లోకి నెట్టిందని, మరోవైపు తాము విద్యుత్‌ను అధిక ధరకు కొన్నామని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి బుగ్గన ధ్వజమెత్తారు. కర్ణాటక నుంచి థర్మల్‌ విద్యుత్‌ కొనుగోలు కోసం 2018, అక్టోబర్‌లో ఒప్పందం చేసుకున్నది టీడీపీ ప్రభుత్వమేనన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement