
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి సీమ ప్రాజెక్టుల పట్ల చూపిన శ్రద్ధను వక్రీకరిస్తూ ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. అసెంబ్లీలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ప్రాజెక్టులపై జరిగిన చర్చ సందర్భంగా బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడారు. సీమలోని ప్రాజెక్టుల గురించి చంద్రబాబు ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. వైఎస్ ప్రభుత్వం వేసిన ఇంటర్‌లోకేటరీ అప్లికేషన్‌ను (ఐఏ) టీడీపీ సభ్యులు ప్రతిసారి వక్రీకరిస్తున్నారని తప్పుపట్టారు.
కృష్ణా జలాలను ట్రిబ్యునల్ బచావత్ అవార్డులో 2,130 టీఎంసీలుగా నిర్ధారించిందన్నారు. అందులో ఏపీకి 800 టీఎంసీలకుపైగా, కర్ణాటకకు 700 టీఎంసీలకుపైగా, మహారాష్ట్రకు 500 టీఎంసీలకుపైగా కేటాయించిందని గుర్తు చేశారు. అంతకుమించి వచ్చే మిగులు జలాలకు ప్రాజెక్టులు కట్టుకుంటే వాటికి హక్కు మాత్రం రాదని బచావత్ అవార్డులో ఉందన్నారు. తర్వాత బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ వచ్చిందని చెప్పారు. గత టీడీపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో దేన్నీ పట్టించుకోలేదని విమర్శించారు.