పొత్తుపై మాయావతి యూటర్న్‌..!?

BSP chief Mayawati Comments On Alliance With Congress Party - Sakshi

లక్నో : మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల్లో అధికార బీజేపీని ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీలు పొత్తుకు ప్రయత్నిస్తోన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌లలో బీఎస్పీతో కలసి పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ఇప్పటికే సూత్రప్రాయంగా అంగీకరించినట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. అయితే వచ్చే సాధారణ ఎన్నికల్లో బీఎస్పీ అధినేత్రి మాయావతే ప్రధాన మంత్రి అభ్యర్థని.. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఆ పదవి దక్కదంటూ బీఎస్పీ నేత జై ప్రకాశ్‌ వ్యాఖ్యలు చేయడంతో పొత్తుపై సందేహాలు నెలకొన్నాయి. జై ప్రకాశ్‌ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన మాయావతి ఆయనను పార్టీనుంచి బహిష్కరించారు. ఈ నేపథ్యంలో రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం ఖాయమని ఇరు పార్టీల నేతలు భావించారు. కాగా పొత్తుపై పునరాలోచించుకునే అవకాశాలు ఉన్నాయంటూ ట్విస్ట్‌ ఇచ్చారు మాయావతి.

మూడు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి తగినన్ని సీట్లు కేటాయిస్తేనే కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకుంటామని మాయావతి స్పష్టం చేశారు. అలా జరగని పక్షంలో పొత్తు విషయమై పునరాలోచించుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన మాయావతి.. మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ వైఫల్యంల వల్లే మూక హత్యలు జరుగుతున్నాయని మండిపడ్డారు. అళ్వార్‌ ఘటనపై బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోదని, ఈ విషయంలో కోర్టు జోక్యం చేసుకుని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని విఙ్ఞప్తి చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top