రాష్ట్రానికి పట్టిన చంద్ర గ్రహణం వీడిపోయింది

Botsa Satyanarayana Slams Chandrababu Naidu - Sakshi

ఐదేళ్ల బాబు పాలనకు ఓటుతో బుద్ధి చెప్పారు

వైఎస్సార్‌సీపీ సీనియర్‌  నేత బొత్స  

విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్రంలో గురువారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌తో ఐదు సంవత్సరాలుగా ప్రజలు పడిన ఇబ్బందులతో పాటు రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడిపోయిందని వైఎస్సార్‌సీపీ సీనియర్‌  నేత బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం రాత్రి విజయనగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లాకు సంబంధించి కొన్ని ఘటనలు మినహా పోలింగ్‌ శాతం పెరగడం మంచి పరిణామమన్నారు. చివరిలో టీడీపీ దౌర్జన్యపూరితమైన, వారికున్న సహజగుణంతో దారుణమైన ప్రయత్నాలు చేసిందన్నారు. ప్రధానంగా కురుపాం శాసనసభ్యురాలు పుష్పశ్రీవాణి, ఆమె భర్త శత్రుచర్ల పరీక్షిత్‌రాజుపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.

రాష్ట్రమంతా ఫ్యాన్‌ గాలి..
రాష్ట్రమంతా ఉధృతంగా  ఫ్యాన్‌ గాలి వీచిందని బొత్స చెప్పారు. ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కళ్లకు కట్టినట్లు కనిపించిందనీ, చట్టాలను చేతుల్లోకి తీసుకుని, వ్యవస్థలను భ్రష్టుపట్టించిన వారికి, సంప్రదాయాలకు తూట్లు పొడిచేలా పాలన సాగించే వారెవ్వరికైనా శిక్ష తప్పదని అన్నారు.

హామీలన్నీ తప్పక నెరవేరుస్తాం..
ఎన్నికల్లో జగన్‌మోహన్‌రెడ్డి, ఏమైతే హమీలిచ్చారో వాటిని తప్పక నెరవేరుస్తామని బొత్స చెప్పారు. దివంగత మహానేత వైఎస్సార్‌ మళ్లీ రాజకీయంగా పుట్టాలని కోరుకున్నారనీ, అందుకే జగన్‌ నాయకత్వాన్ని బలపరిచారని స్పష్టం చేశారు. సాక్షాత్తూ స్పీకరే పోలింగ్‌ బూత్‌లో కూర్చుని బయటకు వెళ్లాలంటూ ఓటర్లపై దౌర్జన్యం చేస్తే ఏ విధంగా ప్రజలు ఎదురు తిరుగుతారో రుజువైందని తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, విభజన చట్టంలోని హామీలు, ప్రత్యేక హోదా సాధన కోసం టీఆర్‌ఎస్‌ తమకు మద్దతిస్తుందని, దానిని పూర్తిగా స్వాగతిస్తామని చెప్పారు. ఒడిశా సీఎం నవీన్‌పట్నాయక్‌ మద్దతిచ్చినా స్వాగతిస్తామని స్పష్టం చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top