అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు

Botsa Satyanarayana Comments On Chandrababu - Sakshi

అనుభవమని చెప్పి అప్పు మిగిల్చారు

రాష్ట్ర మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ

సాక్షి, విశాఖపట్నం: రాష్ట్ర అభివృద్ధికి విపక్ష నేత చంద్రబాబు అడ్డుపడుతున్నారని మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో బొత్స మీడియాతో మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ నుంచి పేద ప్రజలకు ఉచితంగా ఇళ్ల స్థలాల వరకూ ప్రతీ అభివృద్ధి పనికి చంద్రబాబు విఘాతం కల్పించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. అనుభవమని చెప్పి చివరకి అప్పులు మిగిల్చిపోయారని మండిపడ్డారు. పాదయాత్రలో ప్రజల సమస్యలు విని.. వాటికనుగుణంగా రెండు పేజీల మేనిఫెస్టోను తయారుచేసి.. కేవలం ఏడాది పాలనలోనే 90 శాతంపైగా సంక్షేమ పథకాలను అమలుచేసిన ఏకైక సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

► మా ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యానికి పెద్దపీట వేశాం. అమ్మ ఒడి నుంచి ఆరోగ్యశ్రీ వరకు అన్ని సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధిక నిధులు కేటాయిస్తున్నారు.  
► ఉత్తరాంధ్రలో మహానేత వైఎస్సార్‌ హయాంలోనే అభివృద్ధి జరిగింది. మళ్లీ ఆ తరహా అభివృద్ధి ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌తోనే జరుగుతుంది.
► విశాఖను ఎగ్జిక్యూటివ్‌ కేపిటల్‌గా ప్రకటిస్తే.. ఉత్తరాంధ్ర అభివృద్ధికి చంద్రబాబు అడ్డుపడుతున్నారు. 
► పరిపాలన వికేంద్రీకరణ నుంచి ప్రతీ అభివృద్ధి పనులను చంద్రబాబు అడ్డుకుంటున్నారు. 
► ఐదేళ్లలో చంద్రబాబు మేనిఫెస్టోలో పేర్కొన్న ఒక్క సంక్షేమ పథకాన్నయినా అమలుచేశారా?. 
► మా పాలన ఎలా ఉందో తెలుసుకోవడానికి నేరుగా ప్రజల దగ్గరకే వెళ్లి మా ఎన్నికల మేనిఫెస్టో ఇస్తాం. అందులో ఏయే సంక్షేమ పథకాలు అమలుచేశామో నేరుగా ప్రజలే చెబుతారు. 
► లాక్‌డౌన్‌ కారణంగా చాలామంది ప్రజలు తినడానికి తిండిలేకుండా బాధపడుతుంటే.. హైదరాబాద్‌లో మనవడితో చంద్రబాబు ఆడుకున్నారే తప్ప ప్రజల గురించి పట్టించుకున్న పాపానపోలేదు. కేవలం జూమ్‌ వీడియోలకే పరిమితమయ్యారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top