మిత్రుడికి కాంట్రాక్టు ఎలా దక్కింది?

BJP targets Rahul Gandhi over defence deal under UPA - Sakshi

రాహల్‌ కుంభకోణాలు భూమి, గాలి, నీటిలోంచి వెలుగులోకి వస్తున్నాయి

ఆయనవన్నీ తెరవెనుక కార్యకలాపాలే

మధ్యప్రదేశ్, యూపీ ఎన్నికలప్రచారంలో మోదీ

సాగర్‌ (మధ్యప్రదేశ్‌) / భదోహి (యూపీ): ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. మధ్యప్రదేశ్, యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన యూకే సంస్థ బ్యాకాప్స్‌తో రాహుల్‌ సంబంధాలను ప్రస్తావించారు. మీ మిత్రుడికి జలాంతర్గాముల కాంట్రాక్టు ఎలా దక్కిందో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడి కుంభకోణాలన్నీ భూమి, గాలి, నీటిలోంచి వెలుగులోకి వస్తున్నాయని మోదీ చెప్పారు.

ఆయన మాజీ వ్యాపార భాగస్వామి యూపీఏ హయాంలో జలాంతర్గాముల కాంట్రాక్టు పొందినట్లుగా బయటపడిందన్నారు. ఆ సంస్థ పేరు ‘బ్యాకాప్స్‌’ కూడా.. ముందు నుంచి కాకుండా తెరవెనుక (బ్యాక్‌ ఆఫీస్‌) జరిగే కార్యకలాపాల్లో పాల్గొనడం లాంటి కాంగ్రెస్‌ నేత (రాహుల్‌) చర్యలకు తగ్గట్టుగానే ఉందని అన్నారు. రాహుల్‌ బహిరంగంగా ఎప్పుడూ ఆ కంపెనీలో పనిచేయలేదని, అంతా తెరవెనుకే ఉండి నడిపించారని మోదీ ఆరోపించారు. ఈ తెరవెనుక సంస్థ 2009లో మూతపడినా.. కంపెనీలో ఆయన భాగస్వామి 2011లో జలాంతర్గాముల కాంట్రాక్టు పొందినట్లు వెలుగుచూసిందన్నారు. ఆ కంపెనీ యజమాని రాహుల్‌ స్నేహితుడే అన్నారు.

కేవలంలో లైజనింగ్‌లో (రెండు కంపెనీల మధ్య సంధానకర్తగా వ్యవహరించడంలో) అనుభవం కలిగిన మీ భాగస్వామికి జలాంతర్గాముల రంగంలోకి వచ్చే అవకాశం ఎలా దక్కిందంటూ ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారని మోదీ అన్నారు.  బోఫోర్స్‌ తుపాకులు, హెలికాప్టర్లు (అగస్టా వెస్ట్‌ల్యాండ్‌).. తాజాగా జలాంతర్గాములు.. ఎంత లోతుగా తవ్వితే అంతగా.. అది గాలైనా (నభ్‌), నీరైనా (జల్‌), భూమైనా (తల్‌) కానివ్వండి.. వారి కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయని ప్రధాని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అంటేనే అసత్యం, దుష్ప్రచారం, మోసం అని అన్నారు. రాహుల్‌ తనపై చేసిన అవినీతి ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ‘నేను ఒంటరిని కాదు..దేవుడు నాతో ఉన్నాడు. నాపై మీరెంత బురద వేస్తే అంతగా మరిన్ని కమలాలు వికసిస్తాయి..’ అని చెప్పారు.

దేశం ఓ దశాబ్దం కోల్పోయింది
ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో పదేళ్ల పాటు సాగిన యూపీఏ పాలనపై మోదీ ధ్వజమెత్తారు. 2004లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్‌ భావించలేదు. ఊహించని విధంగా అవకాశం వచ్చింది. అయితే అప్పటికి ‘యువరాజు’ రెడీ కాకపోవడం, ఆయనకు ‘శిక్షణ’ ఇచ్చేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో కాంగ్రెస్‌ ఒక ‘కుటుంబ విశ్వాసపాత్రుడు’, ఒక కాపలాదారుని ప్రధానిని చేసిందన్నారు. దీంతో 21వ శతాబ్దిలో మొత్తం ఒక దశాబ్దాన్ని దేశం కోల్పోయిందని విమర్శించారు.  అమరుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకునేందుకు తాను ప్రతిన బూనానన్నారు.

సంక్షేమమే వికాస్‌పంతి లక్ష్యం
ఉత్తరప్రదేశ్‌ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీలపై ఆయన ధ్వజమెత్తారు. కులం పేరిట ప్రజలు ఎప్పుడూ కొట్లాడుకునేలా ఈ పార్టీలు చేశాయన్నారు. స్వాతంత్య్రానంతరం నాలుగు రకాలైన పరిపాలన, పార్టీలు, రాజకీయ సంస్కృతి (నామ్‌పంతి, వామ్‌పంతి, దామ్‌ అవుర్‌ దామన్‌పతి, వికాస్‌పంతి) ఉండేవని చెప్పారు. ఓ కుటుంబానికి చెందిన సభ్యుల పేర్లు జపించడంలో నామ్‌పంతి నిమగ్నమై ఉండేదని, వామ్‌పంతి విదేశీ విధానాలు దేశంపై రుద్దే ప్రయత్నం చేసేదని, దామ్, దామన్‌పంతి డబ్బు, కండబలం ఉపయోగించి పరిపాలన సాగించేందని ప్రధాని వివరించారు. ఇక నాలుగోదైన వికాస్‌పంతిని తాము తెచ్చామంటూ.. దీనికి దేశంలోని 130 కోట్ల మంది ప్రజల అభివృద్ధి, సంక్షేమమే ప్రధానమని చెప్పారు.  తమ సంపద రెట్టింపు చేసుకోవడానికే అధికారం అన్నట్టుగా మహాకల్తీ నేతలు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top