‘టీఆర్‌ఎస్‌కు నిద్రలేని రాత్రులు రాబోతున్నాయి’

BJP State President K Laxman Fires On TRS At BJP Office In Hyderabad - Sakshi

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో చరిత్ర సృష్టించబోతున్నామని, టీఆర్‌ఎస్‌కు నిద్రలేని రాత్రులు రాబోతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ జోస్యం చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. బీజేపీ సభ విజయవంతం కావడంతో టీఆర్‌ఎస్‌ పీఠాలు కదులుతున్నాయని లక్ష్మణ్‌  ఎద్దేవా చేశారు. బీజేపీ ఎక్కడుందని కేటీఆర్‌ ప్రశ్నిస్తున్నారని, నిజామాబాద్‌​ వెళ్లి మీ చెల్లి కవితను అడిగితే బీజేపీ ఎ‍క్కడుందో చెబుతారని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. జేపీ నడ్డా ఎవరో తెలియదనడం.. కేటీఆర్‌ అహంకారాన్ని తెలుపుతోందని, కేటీఆర్‌ లాగా ఆయన ప్యారాచుట్‌ పట్టుకొని రాజకీయాల్లోకి రాలేదని విమర్శించారు. కేటీఆర్‌లాగా తండ్రి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి  వచ్చిన వ్యక్తి  కాదని, కేటీఆర్‌ పుట్టకముందు నుంచే నడ్డా రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. 

నడ్డా కల్వకుంట్ల కుటుంబ బిడ్డ కాదని, భారతమాత ముద్దుబిడ్డ అని లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. తండ్రి అధ్యక్షుడుగా ఉన్న పార్టీకి కొడుకు వర్కింగ్  ప్రెసిడెంట్ ఉన్న చరిత్ర  టీఆర్‌ఎస్‌ది అని, పూటకోమాట, రోజుకో వేషం వేయడం టీఆర్ఎస్‌కే సొంతమని విమర్శించారు.  సభలో నడ్డా వేసిన ప్రశ్నలు నిజామో కాదో టీఆర్‌స్‌ చెప్పాలని, టీఆర్‌ఎస్‌ కాంట్రాక్టర్లకు జేబులు నింపే పని పెట్టుకుందని మండిపడ్డారు. రైతు బంధు, ఆరోగ్య శ్రీ ఎందుకు ఆగిపోయిందో సమాధానమివ్వాలని డిమాండ్‌ చేశారు.

మిషన్‌ కాకతీయ కమీషన్‌ కాకతీయగా మారిందని, కాళేశ్వరంలో డీపీఆర్‌ లేకుండానే టెండర్ల ప్రక్రియకు ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. రెండు శాతం  కమీషన్‌ తీసుకోమని కేటీఆరే చెప్పారని టీఆర్‌ఎస్‌ నాయకులే చెప్పారని పేర్కొన్నారు. ప్రాజెక్టులు, కొనుగోలు అమ్మకాలపై విచారణ జరిపించాలని సూచించారు. కర్ణాటకలోని జేడీఎస్‌కు టీఆర్‌ఎస్‌ తోక పార్టీగా మారిందని దుయ్యబట్టారు. తమని రాజకీయంగా ఎదుర్కొలేకే తప్పుడు కేసులు పెడుతున్నారని, హైదరాబాద్‌ మురికికూపంగా విషాద నగరంగా మార్చిన ఘనత కేసీఆర్‌దే నని మండిపడ్డారు. తమది ఫామ్‌హౌజ్‌ పాలన కాదని, తెలంగాణలో మోదీ తరహా పాలన అందిస్తామని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top