
కోల్‌కత్తా: సార్వత్రిక ఎన్నికల సమరంతో బెంగాల్‌లో మొదలైన హింసా ఇప్పటికీ చల్లారలేదు. ఎన్నికల సందర్భరంగా ఆ రాష్ట్రంలో జరిగిన ఘర్షణలో అధికార, విపక్ష పార్టీలకు చెందిన కార్యకర్తలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా బెంగాల్‌లోని నజత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలో నలుగురు బీజేపీ కార్యకర్తలు హత్యకు గురైయ్యారు. శనివారం రాత్రి బీజేపీ-తృణమూల్ కార్యకర్తల మధ్య చెలరేగిన హింసలో వారు మృతి చెందారు. నజత్‌లో బీజేపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బెంగాల్ హింసపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హత్యారాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత ముకుల్ రాయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బీజేపీ కార్యకర్తలు హత్యకు మమతనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. వరుస హత్యలపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాకి నివేధించినట్లు ఆయన తెలిపారు. కాగా తాజా ఘటనతో రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతను కట్టుదిట్టంచేసింది. పలు సమస్యత్మాక ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు.