రూ.10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి

 BJP party released  election manifesto - Sakshi

మద్దతు ధరకు అదనంగా బోనస్‌

ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ హామీలు 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో జైలుకెళ్లిన ఉద్యమకారులకు నెలకు రూ. 5 వేల పెన్షన్‌ సహా రైతు సంక్షేమ కార్యక్రమాలతోపాటు సబ్సిడీలు ఇచ్చేలా బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోను రూపొందించింది. విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల వంటి 26 రంగాల వారికి తాము అధికారంలోకి వస్తే అమలు చేయబోయే హామీలతో మేనిఫెస్టోను ఖరారు చేసింది. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్‌ ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్, కన్వీనర్‌ మల్లారెడ్డి, ఎంపీ దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

బీజేపీ మేనిఫెస్టోలోని ప్రధానాంశాలు... 
వ్యవసాయం:రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ. ప్రతి రైతుకు ఉచిత బోరు లేదా బావి, ఉచిత పంపుసెట్టు. ఉచితంగా నాణ్యమైన విత్తనాల పంపిణీ. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజనలో రైతులు చెల్లించాల్సిన ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెల్లింపు. మద్దతు ధరకు అదనంగా బోనస్, పంట సేకరణ సమయంలో రైతు ఖాతాలో జమ. అందుకోసం రూ. 10 వేల కోట్లతో రైతు సంక్షేమ నిధి ఏర్పాటు. ట్రాక్టర్లు, పంట కోత మిషన్, నాట్లు వేసే యంత్రాలకు 50 శాతం సబ్సిడీ. ప్రత్యేక వ్యవసాయ బడ్జెట్‌. 

నీటిపారుదల: పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌ సాగర్‌ ప్రాజెక్టుల పూర్తి. గోదావరి జలాల ట్రిబ్యునల్‌ తెలంగాణకు కేటాయించిన నీటిని సద్వినియోగం చేసేలా 13 చోట్ల తక్కువ ముంపుతో రిజర్వాయర్లు, బ్యారేజీల నిర్మాణం. కృష్ణా గోదావరి నదుల అనుసంధానం ద్వారా 100 టీఎంసీల గోదావరి జలాలను తెలంగాణలోని కృష్ణా పరీవాహక ప్రాంతంలో ఉపయోగించడం. గోదావరి, ఉపనదుల్లో జల రవాణా సౌకర్యం. 

విద్య: డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా లాప్‌టాప్‌లు. ప్రతిభావంతులైన 25 వేల మంది పేద విద్యార్థులకు జేఈఈ, బిట్‌శాట్, నీట్‌ పరీక్షలకు ఉచిత శిక్షణ. 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు బాలికలకు ఉచిత సైకిళ్లు. డిగ్రీ, ఆపైస్థాయి విద్యార్థినులకు 50 శాతం సబ్సిడీతో స్కూటీలు. ప్రతి మండలంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ. ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ. 

వైద్యం: రాష్ట్రంలోని 3.5 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా రూ . 5 లక్షల ఆరోగ్య బీమా వర్తింపు. ప్రతి మండల కేంద్రంలో అందుబాటులో అంబులెన్సులు. ప్రమాదంలో మరణించినా, శాశ్వత అంగవైకల్యం ఏర్పడినా రూ. 2 లక్షల బీమా, ఆ ప్రీమియం ప్రభుత్వమే చెల్లింపు. 

ఉద్యోగులు : నూతన సీపీఎస్‌ విధానం రద్దు చేసి పాత పెన్షన్‌ విధానం కొనసాగింపు. ఉద్యోగుల పదవీవిరమణ వయసు 60 ఏళ్లకు పెంపు. కాంట్రాక్టు, పార్ట్‌టైం, ఔట్‌సోర్సింగ్, తాత్కాలిక ఉద్యోగుల సర్వీçసునుబట్టి క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు. 

యువత, ఉపాధి :  2 లక్షల ప్రభుత్వోద్యోగాల భర్తీకి 3 నెలల్లో నోటిఫికేషన్‌. అ«ధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటన. నిరుద్యోగులకు నెలకు రూ. 3,116 నిరుద్యోగ భృతి. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలు ఎత్తివేత. 5 లక్షల మంది నిరుద్యోగులకు హామీ అవసరంలేని రుణాలు. 

సాంఘిక సంక్షేమం : 2022 నాటికి అర్హులైన పేదలందరికీ ఉచితంగా ఇళ్ల నిర్మాణం, ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు నెలకు రూ. 5 వేల అద్దె చెల్లింపు. పేద కుటుంబాల్లో 55 ఏళ్లు పైబడిన వారికి నెలకు రూ. 2 వేల పెన్షన్‌. వితంతువులకు రూ. 3 వేల పెన్షన్‌. రెడ్డి, వైశ్య, బ్రాహ్మణ కార్పొరేషన్ల ఏర్పాటు, వాటికి ఏటా రూ. 1000 కోట్లు కేటాయింపు. బీసీ కులాల ఫెడరేషన్ల ఏర్పాటు. చేతివృత్తుల వారికి ఉచితంగా విద్యుత్‌ సరఫరా, ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో పేదలకు ఇచ్చిన అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు. 

అమరుల కుటుంబాల సంక్షేమం:అమరుల  అమరుల కుటుంబాలకు రూ. 10 లక్షల సాయం. జైలుకు వెళ్లిన తెలంగాణ ఉద్యమకారులకు నెలకు రూ. 5 వేల పెన్షన్‌. 
రజకులను ఎస్సీల్లో, వాల్మీకి, బోయ, వడ్డెర కులాలను ఎస్టీల్లో చేర్చేందుకు చర్యలు. నేత, గీత, రజక, క్షౌ ర, వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, స్వర్ణకారులు తదితర కులవృత్తుల వారు 55 ఏళ్లు దాటితే నెలకు రూ. 3 వేల పెన్షన్‌. తాటి చెట్టు ఎక్కే ప్రతి గీత కార్మికునికి 50 ఏళ్లు దాటితే రూ. 3 వేల పెన్షన్‌. 

వెనుకబడిన కులాలు: ఎస్సీ వర్గీకరణ. ఆ అధికారాన్ని రాష్ట్రాలకే అప్పగించేలా కేంద్రాన్ని ఒప్పించేందుకు చర్యలు. డప్పు కళాకారులు, చెప్పులు కుట్టేవారికి ప్రతి నెలా రూ . 3 వేల పెన్షన్‌. పేద, గిరిజన కుటుంబాలకు 100 యూనిట్లలోపు ఉచిత విద్యుత్‌. జనాభా దామాషా ప్రకారం గిరిజన రిజర్వేషన్ల పెంపు. మైనారిటీలకు కేంద్ర పథకాలైన సీకో ఔర్‌ కమావో, నయా మంజిల్, పడో పరదేశ్, నయా రోష్నీ వర్తింపు. వక్ఫ్‌ భూముల పరిరక్షణ, మదర్సాలలో కంప్యూటర్, నైపుణ్య శిక్షణ. 

మహిళా సంక్షేమం:సౌభాగ్యలక్ష్మి పథకం పేరుతో వివాహ సమయంలో పేద మహిళలకు రూ. లక్ష నగదుతోపాటు ఒక తులం బంగారం. బాల్యవివాహాలు, డ్రాపవుట్ల నిరో«ధానికి గ్రామీణ పేద బాలికలకు 7వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు నెలకు రూ. 1,000 స్కాలర్‌షిప్‌. డ్వాక్రా గ్రూపులకు రూ. 5 లక్షల వరకు వడ్డీలేని రుణం, రూ. లక్ష గ్రాంటు, స్మార్ట్‌ఫోన్లు. 

సింగరేణి కార్మికులకోసం: సింగరేణిలో 20 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు. 100 కారుణ్య నియామకాల అమలు. సిబ్బందికి రూ. 15 లక్షల వరకు గృహ నిర్మాణ అడ్వాన్సు సింగరేణి నుంచే చెల్లించేలా చర్యలు. తక్కువ వడ్డీతో వాయిదాల్లో రికవరీ. 

పారిశ్రామిక రంగానికి: ఖాయిలా పడిన సంస్థల పునరుద్ధరణకు రూ. 2 వేల కోట్లతో నిధి. పారిశ్రామిక రంగాలకు రూ. 2 వేల కోట్లు. ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రుణాలపై 4 శాతం వరకు వడ్డీ తగ్గింపు. ఉచిత విద్యుత్‌ సదుపాయం.

స్థానిక సంస్థల బడ్జెట్‌ రెట్టింపు, గ్రామీణ రోడ్ల అభివృద్థి. జర్నలిస్టుల సంక్షేమ నిధికి ఏటా రూ. 100 కోట్లు. జిల్లా, మండల కేంద్రాల్లో ఇంటి స్థలాలు. అర్హులందరికీ అక్రెడిటేషన్లు. సెప్టెంబర్‌ 17 తెలంగాణ విమోచన దినాన్ని రాష్ట్ర ఉత్సవంగా నిర్వహణ. వృద్ధ కళాకారులకు రూ. 3 వేల పెన్షన్‌. మానస సరోవరయాత్ర, కాశీ, పూరీ, చార్‌ధామ్‌లను సందర్శించే సీనియర్‌ సిటిజన్లకు సబ్సిడీ. ఉత్సవాలు, పండుగల సమయంలో ఏటా లక్ష గోవుల వితరణ. అన్ని నగరాలు, పట్టణాల్లో నిర్మాణ అనుమతులకు సింగిల్‌ విండో వ్యవస్థ. ‘‘పాత ఆటో ఇవ్వండి, కొత్త ఆటో పొందండి’నినాదంతో పర్యావరణహిత స్వచ్ఛ వాహనాలకు ప్రొత్సాహం. హైదరాబాద్‌ నుంచి తాండూరు, కామారెడ్డి, జనగామ, నల్లగొండ, జడ్చర్ల వరకు ఎంఎంటీఎస్‌ పొడిగింపు. మెట్రో రైలును పటాన్‌చెరు, సూరారం, కొంపల్లి, అల్వాల్, ఈసీఐఎల్, బీఎన్‌రెడ్డి నగర్, తుక్కుగూడ, రాజేంద్రనగర్‌కు విస్తరణ. ప్రతిభావంతులైన కానిస్టేబుళ్లకు ఎస్సైలుగా పదోన్నతి. డ్రైవింగ్‌ లైసెన్సు, ఆధార్, ఓటర్‌ ఐడీ, జనన ధ్రువీకరణ సర్టిఫికెట్లు ఎలక్ట్రానిక్‌ రూపంలో వినియోగం. 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పత్తికి చర్యలు. ఉత్తర, దక్షిణ పవర్‌గ్రిడ్‌ల అనుసంధానం ద్వారా నిరంతర విద్యుత్‌. రూ. 2 కోట్లతో తెలంగాణ క్రీడా నిధి ఏర్పాటు. 1,000 మంది క్రీడాకారులకు ఏటా రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు స్కాలర్‌షిప్‌. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు భృతి. కోచ్‌లకు పూర్తిస్థాయి ఉద్యోగులుగా గుర్తింపు, వేతనాలు పెంపు.  హోంగార్డుల సర్వీసు క్రమబద్ధీకరణ, కానిస్టేబుళ్లతో సమానంగా ప్రభుత్వ సౌకర్యాలు, హోంగార్డు లందరికీ ఇళ్లు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top