‘కేసీఆర్‌లోకి రజాకార్ల ఆత్మ ప్రవేశించింది’

BJP MLA Raja Singh Went To Abids Police Station For Tiranga Yatra Case - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ‘టీఆర్‌ఎస్‌ కారైతే.. దాని స్టీరింగ్‌ మాత్రం ఎమ్‌ఐఎమ్‌ చేతిలో ఉంది.. ఎమ్ఐఎమ్‌ ప్రోద్భలంతోనే కేసీఆర్‌ నాపై అక్రమ కేసులు బనాయించారని బీజేపీ పార్టీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ ఆరోపించారు. గత నెల అనుమతి లేకుండా నగరంలో తిరంగ యాత్ర నిర్వహించినందుకుగాను రాజా సింగ్‌పై కేసు నమోదయిన సంగతి తేలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా నేడు రాజా సింగ్‌ అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. ఇద్దరు న్యాయవాదులతో కలిసి విచారణలో పాల్గొన్న ఆయన ప్రశ్నలన్నింటికి రాత పూర్వక సమాధానాలు ఇచ్చినట్లు సమాచారం.

విచారణ అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రజాకార్ల పాలన సాగుతుందంటూ మండి పడ్డారు. 50 ఏళ్ల క్రితం తుడిచిపెట్టుకు పోయిన రజాకార్ల ఆత్మ మళ్లీ ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్‌లో ప్రవేశించిందని విమర్శిచారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ పార్టీ కారైతే దాని స్టీరింగ్‌ మాత్రం ఎమ్‌ఐఎమ్‌ చేతిలో ఉందని ఆరోపించారు. ఎమ్‌ఐఎమ్‌ ప్రోత్సాహంతోనే కేసీఆర్‌ తనపై అక్రమ కేసులు బనాయించారని రాజాసింగ్‌ మండిపడ్డారు. స్వాతంత్ర్య దినోత్సవం నాడు తిరంగ యాత్ర నిర్వహించినందుకు తనపై కేసులు పెట్టారన్నారు. ఇవన్ని చూస్తే తెలంగాణ పాకిస్తాన్‌లో ఉందో, భారత దేశంలో ఉందో అర్థం కావడం లేదని వాపోయారు. తనను ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా భయపడనని రాబోయే ఎన్నికల్లో కూడా తాను బీజేపీ తరపున గోషామహల్‌ నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.

ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రాజాసింగ్ ఆద్వర్యంలో నగరంలో తిరంగ యాత్ర జరిగిన విషయం తెలిసిందే. అనుమతి లేకుండా ఆ యాత్ర నిర్వహించినందుకు అతడిపై నగరంలోని ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ కేసు విచారణలో భాగంగా తమ ఎదుట హాజరుకావాల్సిందిగా ఆబిడ్స్ పోలీసులు రాజాసింగ్‌కు నోటీసులు జారీ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top