రాజ్యసభకు కపిల్‌దేవ్, మాధురీ!

BJP may nominate Madhuri Dixit, Kapil Dev for Rajya Sabha - Sakshi

నామినేట్‌ చేయనున్న బీజేపీ!

సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యుల ఖాళీలను భర్తీ చేసే దిశగా కేంద్రం ప్రయత్నాలు ప్రారంభించింది. క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్, సినీ నటి రేఖ, పారిశ్రామికవేత్త అను ఆఘా ఇటీవలే రిటైర్‌ అయ్యారు. సీనియర్‌ లాయర్‌ కే పరాశరన్‌ నేడు(శుక్రవారం) రాజ్యసభ నుంచి రిటైర్‌ కానున్నారు. దీంతో ప్రస్తుతం రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యుల ఖాళీల సంఖ్య నాలుగుకి చేరనుంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎవరిని రాజ్యసభకు నామినేట్‌ చేయనుందనే విషయంలో పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యే జూలై 18 నాటికి కొత్త సభ్యుల నియామకంపై ఒక స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 12 మంది నామినేటెడ్‌ సభ్యులుంటారు.

మాజీ సీజేఐ, ఆర్మీ మాజీ చీఫ్‌ పేర్లు!
రాజ్యసభకు నామినేట్‌ అయ్యే అవకాశమున్న వారిలో మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్‌సీ లహోటియా, ఆర్మీ మాజీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్, రాజ్యాంగ వ్యవహారాల నిపుణుడు సుభాష్‌ కాశ్యప్, బాలీవుడ్‌ నటి మాధురీ దీక్షిత్‌.. తదితరుల పేర్లు బీజేపీ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నాయి. దాదాపు వీరందరినీ ఇటీవల బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కలిశారు. ‘సంపర్క్‌ సే సమర్థన్‌’ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా, క్రీడాకారుడు మిల్ఖా సింగ్, జర్నలిస్ట్‌ కుల్దీప్‌ నయ్యర్, యోగా గురు బాబా రామ్‌దేవ్, జస్టిస్‌ ఆర్‌సీ లహోటియా, మాజీ ఆర్మీ చీఫ్‌ దల్బీర్‌ సింగ్‌  సహా పలువురు ప్రముఖులను అమిత్‌ షా కలిసిన విషయం తెలిసిందే. హరియాణాకు చెందిన మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌కు, అలాగే, ఇటీవలి కాలం వరకు హీరోయిన్‌గా వెండితెరపై మెరిసిన మాధురీ దీక్షిత్‌కు దేశవ్యాప్తంగా అభిమానులున్న విషయాన్ని బీజేపీ పరిగణనలోకి తీసుకుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top