సొంత జిల్లాలో మోదీకి షాక్‌! | BJP loses PM Narendra Modi's hometown to Congress | Sakshi
Sakshi News home page

సొంత జిల్లాలో మోదీకి షాక్‌!

Dec 19 2017 4:31 AM | Updated on Aug 21 2018 2:30 PM

BJP loses PM Narendra Modi's hometown to Congress - Sakshi

వాద్‌నగర్‌: రచ్చ గెలిచిన ప్రధాని మోదీ ఇంట ఓడిపోయారు. మోదీ స్వగ్రామం వాద్‌నగర్‌ ఉండే ఉన్‌ఝా నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశాబెన్‌ పటేల్‌ బీజేపీ నేత నారాయణ్‌భాయ్‌ పటేల్‌పై 19,529 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నారాయణ్‌భాయ్‌ ఇప్పటివరకూ ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఉన్‌ఝాతో పాటు బెఛారజీ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌ పార్టీ విజయకేతనం ఎగరవేసింది. ఉన్‌ఝాలో 2.12 లక్షల ఓటర్లు ఉండగా..వీరిలో 77 వేలమంది పటీదార్లు, 50 వేల మంది ఠాకూర్లు ఉన్నారు. గుజరాత్‌లో ఉవ్వెత్తున ఎగసిన పటీదార్‌ ఉద్యమానికి ఈ ప్రాంతమే కేంద్రంగా గుర్తింపు పొందింది. ఉన్‌ఝా నియోజవర్గమున్న మెహసనా జిల్లాలోని మొత్తం ఏడు సీట్లలో బీజేపీ ఐదు చోట్ల, కాంగ్రెస్‌ రెండు చోట్ల గెలుపొందాయి.   

మెజారిటీపై తప్పిన అంచనాలు!
న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎంత మెజారిటీ సాధిస్తుందన్న విషయంలో పలు సర్వే సంస్థల అంచనాలు తప్పాయి. గుజరాత్‌లో 110కిపైగా స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆజ్‌తక్, ఇండియా టీవీ, టైమ్స్‌ నౌ, చాణక్య టుడే, జీ న్యూస్‌ వంటి సర్వేలు చెప్పినప్పటికీ ఆ పార్టీ 99 స్థానాలకే పరిమితమైంది. అలాగే హిమాచల్‌లోనూ 50పైగా నియోజకవర్గాల్లో బీజేపీ గెలుస్తుందని సర్వేలు తేల్చినప్పటికీ అక్కడ 44 స్థానాలతోనే బీజేపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది.  

ఇద్దరికీ పెరిగిన ఓటింగ్‌ శాతం
2014 లోక్‌సభ, 2012 గుజరాత్‌ శాసనసభ ఎన్నికలతో పోల్చితే ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటింగ్‌ శాతం పెరిగింది. ఆ పార్టీకి 2012 అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం, 2014 లోక్‌సభ ఎన్నికల్లో 33 శాతం ఓట్లు రాగా ఇప్పుడు 41.4 శాతం ఓట్లు పడ్డాయి. అయితే పెరిగిన ఓట్ల శాతం గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలుపొందేందుకు ఉపయోగపడలేదు. అదే బీజేపీ విషయానికొస్తే 2014 లోక్‌సభ ఎన్నికల్లో 60 శాతం వరకున్న ఓట్ల శాతం ఈ ఎన్నికల్లో 49.1 శాతానికి తగ్గింది. 2012 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఇప్పుడు బీజేపీకి ఒక శాతం ఎక్కువ ఓట్లు వచ్చాయి. 2017 ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం 7.7 మేర ఉంది. 2007 ఎన్నికల్లో బీజేపీ ఓట్ల శాతం 49.12 కాగా కాంగ్రెస్‌ ఓట్ల శాతం 39.63. ఆ ఎన్నికల్లో రెండుపార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 9.49. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంటే 30 శాతం అధిక ఓటింగ్‌తో గుజరాత్‌లోని అన్ని లోక్‌సభ సీట్లను బీజేపీ గెలుపొందింది. ఈ పరాజయం తర్వాత ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ తన ఓట్ల శాతాన్ని, 2012 ఎన్నికలతో పోల్చితే సీట్ల సంఖ్యను పెంచుకుంది.  

సరిపోలిన ఈవీఎం, వీవీప్యాట్‌ ఓట్లు
న్యూఢిల్లీ: గుజరాత్‌లో ఈవీఎం, వీవీప్యాట్‌ స్లిప్పుల ఓట్లను లెక్కించగా అవి 100 శాతం సరిపోలినట్లు ఈసీ ప్రకటించింది. మొత్తం 182 స్థానాల్లో ఒక్కో పోలింగ్‌ కేంద్రంలో ర్యాండమ్‌గా వీటిని లెక్కించారు. పోటీలో పాల్గొన్న అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో డ్రా తీసి ఈ కేంద్రాలను ఎంపికచేశారు. బీజేపీకి అనుకూలంగా ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరిగే అవకాశాలున్నట్లు ఆరోపణలు రావడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement