కాంగ్రెస్‌ డీఎన్‌ఏ నుంచి పుట్టిందే టీఆర్‌ఎస్‌

BJP Leader Muralidhar Rao Comments On TRS And Congress - Sakshi

సూరారం:  జాతీయ పార్టీగా డబ్బాలు కొట్టుకునే కాంగ్రెస్‌  చేవలేని పార్టీగా తయారైందని, దాని డీఎన్‌ఏతోనే టీఆర్‌ఎస్‌ పార్టీ రూపొందిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు విమర్శించారు. కుత్బుల్లాపూర్‌ పరిధి షాపూర్‌నగర్‌ ఉషోదయ టవర్స్‌లో గురువారం నియోజకవర్గ బీజేపీ కార్యాలయాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పక్క పార్టీల నుంచి నాయకులను తెచ్చుకుని ఎదుగుతున్న పార్టీ టీఆర్‌ఎస్‌ అని, తెలంగాణ లో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఓ పక్క మిషన్‌ కాకతీయ, మరో పక్క భూప్రక్షాళన  కార్యక్రమాలు నిర్వహిస్తునే కబ్జాలు, ఆక్రమణల పర్వానికి తెర తీశారని దుయ్యబట్టారు.

కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో ఒకప్పటి దేవాదాయ శాఖ భూములు, ప్రభుత్వ భూములు ఇప్పుడు ఎవరి పరమయ్యాయో అందిరికి తెలుసని అన్నారు. భారతదేశంలో మోడీ ప్రభావంతో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో బీజేపీ పాలిస్తోందన్నారు. ఇందుకు కారణం కేవలం కింది స్థాయి కార్యకర్తలు చేస్తున్న కృషేనని స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అంతకన్నా సిగ్గుమాలిన పని మరొకటి లేదని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న పథకాలను తమ సొంత పథకాలుగా డప్పు కొట్టుకుని ప్రచార ఆర్భాటానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోందని టీఆర్‌ఎస్‌ పై ఆయన దుయ్యబట్టారు. కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే సీటు, మల్కాజ్‌గిరి ఎంపీ సీటు బీజేపీ కి ఎంతో ముఖ్యమైనవని, వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ గెలుపు ఇక్కడి నుంచే మొదలవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ఎస్‌.మల్లారెడ్డి, కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top