గాంధీభవన్‌కు ఇక టులెట్‌ బోర్డే | Sakshi
Sakshi News home page

గాంధీభవన్‌కు ఇక టులెట్‌ బోర్డే

Published Thu, Aug 1 2019 1:41 AM

BJP Leader Laxman Comments On Gandhi Bhavan - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని, కాంగ్రెస్‌ ఐసీయూలో ఉందని, గాంధీభవన్‌కు టులెట్‌ బోర్డు పెట్టుకోవాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. బుధవారం ఇక్కడి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను కాపాడుకోలేని ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బీజేపీని విమర్శించే హక్కు లేదన్నారు. తమ వ్యాపారాల కోసం టీఆర్‌ఎస్‌లో చేరి లోపాయికారి ఒప్పందాలతో ప్రజలకు ద్రోహం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. బీజేపీని ఎదుర్కోవడం టీఆర్‌ఎస్‌ వల్ల కాదు కాబట్టే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ ఏకమై బీజేపీ అధికారంలోకి రాకుండా కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. బీజేపీని ఏ శక్తి కూడా అడ్డుకోలేదని, 2023లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  

రెచ్చిపోతే.. పుచ్చిపోతరు.. 
‘టీఆర్‌ఎస్‌ నేతలు రెచ్చిపోయి మాట్లాడుతున్నారు.. పుచ్చిపోవడం ఖాయం’అని లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కారు టీఆర్‌ఎస్‌దే అయినా స్టీరింగ్‌ మాత్రం ఎంఐఎం చేతుల్లోనే ఉందని ఆరోపించారు. కట్టడాలు, కూల్చడాలు, ప్రతిపక్షంపై తొడగొట్టడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమీ లేదని విమర్శించారు. కుటుంబ పాలన, అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తామన్నారు. అమెరికాలో సైతం ప్రవాస భారతీయులు బీజేపీకి మద్దతు ఇస్తున్నారని తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నేతలు చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement