2023లో బీజేపీదే అధికారం | BJP Leader Kishan Reddy Road Show in Yadadri | Sakshi
Sakshi News home page

2023లో బీజేపీదే అధికారం

Jan 21 2020 1:08 PM | Updated on Jan 21 2020 1:08 PM

BJP Leader Kishan Reddy Road Show in Yadadri - Sakshi

రోడ్డు షోలో మాట్లాడుతున్న కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి

యాదాద్రి భువనగిరి,చౌటుప్పల్‌ : 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ గెలవడం ఖాయమని, కేసీఆర్‌తో సహా టీఆర్‌ఎస్‌ పార్టీ  నుంచి ఎంతమంది గెలుస్తారో సర్వే చేయించుకోవాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు.  బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవడం ఎవరి వల్లా కాదన్నారు. మున్సిపాల్‌ ఎన్నికల్లో భాగంగా చౌటుప్పల్‌లో సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో భారీ రోడ్‌షో నిర్వహించారు. జెల్ల కాంప్లెక్స్, బస్టాండ్, కొండూర్‌రోడ్, భవానినగర్, విద్యనగర్, శాంతినగర్, రాంనగర్, వలిగొండరోడ్, గణేష్‌నగర్, తంగడపల్లి రోడ్, రాజేంద్రనగర్‌ కాలనీలతో పాటు తంగడపల్లి వరకు రోడ్‌షో సాగింది. వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారం కోసం టీఆర్‌ఎస్‌ పార్టీ మతోన్మాద ఎంఐఎంతో కలిసి పని చేస్తుందని ధ్వజమెత్తారు. బీజేపీ ముస్లింలకు ఏమాత్రం వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. వారి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న శని అని ధ్వజమెత్తారు.  బంగారు తెలంగాణ పేరుతో ఆయన కుటుంబాన్ని బంగారుమయం చేసుకున్నాడని ఆరోపించారు.

సచివాలయానికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటున్న ముఖ్యమంత్రి ఎక్కడా లేరని ఆరోపించారు. మున్సిపాలిటీ ఎన్నికలను ప్రజలు ఆయుధంగా భావించి టీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలన్నారు. చౌటుప్పల్‌ మున్సిపాల్‌ పీఠాన్ని ప్రజలు బీజేపీకి అప్పగించాలని కోరారు. చైర్మన్‌ పీఠం బీజేపీకి దక్కితే కేంద్రం నుంచి వందలాది కోట్ల రూపాయల నిధులను తీసుకొచ్చే బాధ్యత తనదేనని తెలిపారు. కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి డాక్టర్‌ గంగిడి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు దోనూరి వీరారెడ్డి, దూడల భిక్షంగౌడ్, జిల్లా కార్యదర్శులు సురేందర్‌రెడ్డి, జంగయ్య,  మున్సిపాల్‌ చైర్మన్‌ అభ్యర్థి రమనగోని శంకరయ్య, మున్సిపాల్, మండల పార్టీల అధ్యక్షులు ఊడుగు వెంకటేశ్, రిక్కల సుధాకర్‌రెడ్డి, అభ్యర్థులు రమనగోని దీపిక, బండమీది మల్లేశ్, చీకూరి అనిత, రూపాదేవి, ఆలె నాగరాజు, వనజ, గండూరి జయశ్రీ, పోలోజు శ్రీధర్‌బాబు, బాలగోని వరలక్ష్మి, బుడ్డ సురేష్, కడారి కల్పన, ఉబ్బు జయమ్మ, పంతంగి ఉమాదేవి, జొర్రీగల రామకృష్ణ, బత్తుల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement