‘సెంచరీ కాదు.. ఎన్ని వికెట్లు పోతాయో చూస్కో’

BJP Leader Kishan Reddy Fire on Congress And TRS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్‌ కుటుంబ పాలన, కాంగ్రెస్‌ వల్ల దేశంలో వచ్చిన సమస్యలను ప్రచారం చేస్తూ ప్రజల్లోకి వెళతామని బీజేపీ తాజా మాజీ ఎమ్మెల్యే కిషన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణకు మంచి పాలనను బీజేపీ మాత్రమే అందిస్తుందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికల దృష్ట్యా పార్టీ యంత్రంగాన్ని అన్ని విధాల ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అక్టోబర్‌ మొదటివారంలో కరీంనగర్‌లో అమిత్‌ షా సభ ఉంటుందని తెలిపారు. ఉత్తర తెలంగాణలో షా సభ తర్వాత కేసీఆర్‌, కేటీఆర్‌ సీట్లకు ఎసరు వస్తుందన్నారు. కేటీఆర్‌ సెంచరీ కాదు కదా..ఎన్ని వికెట్లు ఉంటాయో, ఎన్ని వికెట్లు పోతాయో చూసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు.  వచ్చే నెల 3 నుంచి 5లోపు కోర్‌ కమిటీతో భేటి అయి అభ్యర్థుల మీద అభిప్రాయాలను చెబుతామన్నారు. అమిత్‌ షా పర్యటన తర్వాత మోదీ సభ ఉంటుందని కిషన్‌ రెడ్డి తెలిపారు.

అపవిత్ర కలయికతో మహాకూటమి
సిద్ధాంత వైరుద్యం ఉన్న పార్టీలు కూటమి ఏర్పాటుకు ఆపసోపాలు పడుతున్నాయని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అడ్రస్‌లేని టీడీపీ, సీపీఐలతో కాంగ్రెస్‌ అపవిత్ర పొత్తు పెట్టుకుందని విమర్శించారు. కాంగ్రెస్‌ గురించి చంద్రబాబు ఏం మాట్లాడడో ప్రజలకు తెలుసునన్నారు. రంగులు మార్చే మహాకూటమిని ఎండకట్టి ఎన్నికల్లో విజయం సాధిస్తామన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ కాదని, ప్రజల కేంద్రం మెడలు వంచి రాష్ట్రాన్ని సాధించుకున్నారని కిషన్‌రెడ్డి అన్నారు.

దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది
బోపోర్స్‌, 2జీస్కామ్‌లలో లక్షల కోట్లు దోపిడీ చేసిన కాంగ్రెస్‌కు  బీజేపీని విమర్శించే హక్కులేదని కిషన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ అవినీతి వల్ల దేశం భ్రష్టు పట్టిందని విమర్శించారు. అవినీతి గురించి కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. గాంధీ కుటుంబాల దగ్గర ఊడిగం చేసిన జైపాల్‌ రెడ్డి మోదీని మధ్యయుగపు చక్రవర్తి అనడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారం కోసం జైపాల్‌ ఏదైనా చేస్తాడని విమర్శించారు. నేషనల్‌ హెరాల్డ్‌ కుంభకోణం గురించి జైపాల్‌ మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. రాఫెల్‌ పై రాహుల్‌ గాంధీ మాట్లాడి ప్రజల ముందు నవ్వులపాలయ్యారని ఎద్దేవా చేశారు. అవినీతి మీద నరేంద్ర మోదీ క్రెడిబిలిటీ ఏమిటో ప్రజలకు బాగా తెలుసన్నారు. అబద్ధం అనేకమార్లు వల్లించి నిజం చేయాలనుకున్ననిజం కాదని కిషన్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top