బీజేపీతో పొత్తు ఘోర తప్పిదం

BJP indulging in horse-trading - Sakshi

2006 నాటి సంకీర్ణంపై కుమారస్వామి

బెంగళూరు: 12 ఏళ్ల క్రితం తండ్రి మాటకు ఎదురుచెప్పి బీజేపీతో జతకట్టి ఘోర తప్పిదం చేశానని జేడీఎస్‌ నాయకుడు హెచ్‌డీ కుమారస్వామి పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఫలితంగా తన తండ్రి దేవెగౌడ లౌకిక సిద్ధాంతాలను ప్రజలు ప్రశ్నించారని, ఆ మరకను తొలగించుకునే అవకాశం ఇప్పుడొచ్చిందని అన్నారు. జేడీఎస్‌ శాసనసభా పక్ష నాయకుడిగా ఎన్నికైన తరువాత కుమారస్వామి బుధవారం మీడియాతో మాట్లాడారు. ఆనాడు తన పార్టీని కాపాడుకోవడానికే బీజేపీ వెంట నడిచినట్లు చెప్పారు. తన తండ్రి లౌకిక సిద్ధాంతాల్ని ప్రజలు వేలెత్తిచూపడం ఆయన ఆరోగ్యంపై ప్రభావం చూపిందని తెలిపారు. 2006లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడంపై స్పందిస్తూ..తాను, తన తండ్రి సంకీర్ణం పేరిట డ్రామా ఆడుతున్నామని ప్రజలు అనుకున్నారని, కానీ ఆ నిర్ణయం తన ఒక్కడిదేనని స్పష్టతనిచ్చారు. ఆ ఒక్కసారే తన తండ్రి మాటకు విరద్ధంగా వ్యవహరించానని, అంతకుముందు, ఆ తరువాత ఎప్పుడూ అలా జరగలేదని తెలిపారు. ఈసారి బీజేపీ, కాంగ్రెస్‌లు తనకు ఆఫర్‌ ఇచ్చాయని, కానీ బేషరతు మద్దతు తెలిపిన కాంగ్రెస్‌తో కలసి పనిచేస్తానని అన్నారు.
అంత తేలిగ్గా వదిలిపెట్టం
ప్రభుత్వ ఏర్పాటుకు యడ్యూరప్పను గవర్నర్‌ ఆహ్వానించండపై కుమారస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం రాజ్యాంగబద్ధమైన సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. యడ్యూరప్పను ప్రమాణస్వీకారానికి ఆహ్వానిస్తూ గవర్నర్‌ లేఖ రాసిన వెంటనే కుమారస్వామి విలేకరులతో మాట్లాడుతూ ‘దీన్ని మేం అంత తేలిగ్గా వదిలిపెట్టం’ అని అన్నారు. బలనిరూపణకు యడ్యూరప్పకు నాలుగైదు రోజులు కాకుండా ఏకంగా 15 రోజుల సమయాన్ని ఇవ్వడాన్ని ఆయన తప్పుబట్టారు. తమ ఎమ్మెల్యేలను బీజేపీలోకి చేర్చుకునేందుకు ఆ పార్టీ అనేక ప్రలోభాలకు గురిచేస్తోందని కుమారస్వామి ఆరోపించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top