ప్రభుత్వ ఉద్యోగులకు బీజేపీ భరోసా!

BJP assurance to government employees - Sakshi

     పాత పెన్షన్‌ విధానం తెచ్చేందుకు చర్యలు 

     పాక్షిక మద్య నిషేధానికి చర్యలు  

     మేనిఫెస్టోపై వేగంగా కసరత్తు    

     ఫేస్‌బుక్‌ లైవ్‌తో ప్రజాభిప్రాయ సేకరణ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు భరోసా ఇచ్చేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేసే అంశాన్ని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీపీఎస్‌లో ఉంటారా? పాత పెన్షన్‌ విధానంలో ఉంటారా? అని కేంద్ర ప్రభుత్వం అడిగిన నేపథ్యంలో సీపీఎస్‌లో కొనసాగేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే ఒప్పందం చేసుకుందని, అది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అం శమే కాదని చెప్పేందుకు సిద్ధం అవుతోంది. తద్వారా వచ్చే ఎన్నికల్లో ఉద్యోగులను తమవైపు తిప్పుకునేందుకు చర్యలు చేపట్టింది. సీపీఎస్‌ రద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని టీఆర్‌ఎస్‌ చెబుతున్నది అబద్ధమని, తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్‌ స్కీమ్‌ను పునరుద్ధరించేలా చర్యలు చేపడ తామని చెబుతూ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని పొందుపరిచేలా ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాదు నిరుద్యోగులను ఆకర్షించేందుకు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని చెబుతోంది. బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది. ఇందులో భాగంగా ఫేస్‌బుక్‌ లైవ్‌ ద్వారా అభిప్రాయాలను తీసుకొని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు చర్యలు చేపట్టింది. ఆదివారం బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ బీజేపీ చెబుతున్న ప్రజా మేనిఫెస్టోలో అభిప్రాయాలను తీసుకొని తమ మేనిఫెస్టోలో పొందుపరచనున్న వివిధ అంశాలను వెల్లడించారు.  

ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ.. 
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని, పీఆర్‌సీ ప్రకటించకుండా, మధ్యంతర భృతి ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తోందని, తాము ఉద్యోగుల పక్షమని చెప్పేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మరోవైపు ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాపులకు అనుమతి ఇవ్వ కుండా, పాక్షిక మధ్య నిషేధం అమలు చేసేలా మేనిఫెస్టోలో విధానాన్ని పొందుపరిచే అవకాశాన్ని పరిశీలిస్తోంది. రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేసే అంశాన్ని పొందుపరచాలన్న నిర్ణయానికి వచ్చింది. ఎంఎస్‌పీని అన్ని వర్గాల రైతులకు అందించేలా చర్యలు చేపట్టే అవకాశం ఉంది. రైతు పంటపొలాల్లో ఉచిత బోర్లు వేసేలా, పంటలపై కేంద్రం ఇచ్చే ఎంఎస్‌పీకి అదనంగా బోనస్‌ ఇచ్చేలా, రైతులు బ్యాంకుల్లో తీసుకునే అప్పుల వడ్డీలను తామే చెల్లించే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది. ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు కార్పొరేషన్‌ ఏర్పా టు చేసి, కార్పస్‌ ఫండ్‌ ఏర్పా టుకు కసరత్తు చేస్తోంది.  

అన్ని వర్గాలకు రూ.20 లక్షలతో విదేశీ విద్య.. 
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడినవారి విదేశీ విద్యకు రూ. 20 లక్షలు ఇచ్చే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.  ఆయుష్మాన్‌భవ పథకాన్ని అమలు చేస్తామని మేని ఫెస్టోలో పొందుపరుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టడంతోపాటు ప్రైవేటు రంగంలో ఫీజుల నియంత్రణ, కార్పొ రేట్‌ విద్యా వ్యవస్థ నియంత్రణకు విధానాలు రూపొందించే అంశాన్ని మేనిఫెస్టోలో పొందుపరచా లని నిర్ణయించింది. గౌడ కులçస్తులకు తాటి వనాలు పెంచుకునేందుకు వరాలు ఇచ్చే జీవోలు ఉన్నాయని, వాటిని పక్కాగా అమలు చేయడం, నీర ఉత్పత్తిని పెంచి మార్కెటింగ్‌కు అవకాశాలు కల్పించే విధానాన్ని పొందుపరుచాలన్న ఆలోచనకు వచ్చింది.  

ఈబీసీలకు రూ.3 లక్షల ఆర్థిక సాయం.. 
ఈబీసీలకు రూ.3 లక్షల ఆర్థికసాయం అందించే అంశాన్ని బీజేపీ పరిశీలిస్తోంది. బీసీ సబ్‌ ప్లాన్‌ను అమలు చేయాలన్న ఆలోచన చేస్తోంది.  కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ హామీని మేనిఫెస్టోలో పొందుపరిచేందుకు సిద్ధమవుతోంది.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top