ఏపీ చరిత్రలో ఇది బ్లాక్‌ డే | Bhuggana Rajendranath Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

ఏపీ చరిత్రలో ఇది బ్లాక్‌ డే

Jan 23 2020 4:25 AM | Updated on Jan 23 2020 11:11 AM

Bhuggana Rajendranath Comments On Chandrababu - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన. చిత్రంలో మంత్రి బొత్స, ఎమ్మెల్సీ ఇక్బాల్‌ తదితరులు

సాక్షి, అమరావతి: పాలన, అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి సెలెక్ట్‌ కమిటీకి పంపడం దారుణం అని, ఈ రోజు ఏపీ చరిత్రలో బ్లాక్‌ డే అని ఆర్థిక, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. బుధవారం శాసనమండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపిన అనంతరం ఆయన అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడారు. ‘చట్టసభలపై ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు ఏమాత్రం గౌరవం లేదు. శాసనమండలి గ్యాలరీ నుంచి చైర్మన్‌కు డైరెక్షన్‌ ఇచ్చి, వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్నారు.  వంద సంవత్సరాల చరిత్ర చూసి.. ప్రభుత్వం రెండు బిల్లులను తీసుకొచ్చింది. శాసనసభ ఆమోదించినా మండలి వ్యతిరేకించడం రాజ్యాంగ విరుద్ధం. బీఏసీ (బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ)లో యనమల రామకృష్ణుడు మాట్లాడిన దానికి, చేసిన దానికి పొంతన లేదు. రూల్‌ 71ని అడ్డుపెట్టుకుని సభను పక్కదారి పట్టించారు. రూల్‌ 71 అనేది ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉంది. బిల్లును ప్రవేశపెట్టే సమయంలోనే సెలెక్ట్‌ కమిటీకి పంపించాలంటే ఒక మోషన్‌ పెట్టాలి.

మొదట ఇది చేయకుండా చివర్లో మోషన్‌ బిల్లు పెడుతున్నట్లు తాజా తేదీ వేసి సెలెక్ట్‌ కమిటీకి బిల్లులు పంపించాలని కుట్రలు చేశారు. రూల్స్‌ను విస్మరిస్తూ.. చివరకు ఇదంతా తప్పు అని, అయినా కూడా విచక్షణాధికారంతో సెలెక్ట్‌ కమిటీకి పంపిస్తున్నానని చైర్మన్‌ చెప్పారు. రూల్‌ 71ని అడ్డుపెట్టుకుని బిల్లులకు అడ్డుపడి.. పార్టీకి చైర్మన్‌ లొంగిపోతే ప్రజల పరిస్థితి ఏంటి? మా నాయకుడు చెప్పినట్లు చేస్తున్నానని చైర్మన్‌ చెప్పినట్లుగా ఉంది. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు ఇలా వ్యవహరించడం దుర్మార్గం. రెండు రోజులుగా బిల్లును ఓటింగ్‌కు పెట్టకుండా కావాలనే అడ్డుకున్నారు. చంద్రబాబు మాటలు విని మండలి చైర్మన్‌ నడుచుకుంటారా? చైర్మన్‌గా తప్పు చేసి, విచక్షణాధికారాలను ఉపయోగించానని ఎలా చెబుతారు? సభను చైర్మన్‌ రాజకీయాల కోసం వినియోగించారు. 13 జిల్లాల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నారు.. ఆ తర్వాత శాసనసభలో 90 శాతం మెజారిటీతో ఆమోదించిన బిల్లులను మండలిలో ఎలా అడ్డుకుంటారు?’ అని బుగ్గన మండిపడ్డారు.  

బాబు కనుసన్నల్లో మండలి చైర్మన్‌
శాసన మండలిలో పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లులపై చర్చ సందర్భంగా మండలి చైర్మన్‌.. చంద్రబాబు కనుసన్నల్లో నడుచుకున్నారని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తప్పుబట్టారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌లో బుధవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. ఒక పార్టీ అధ్యక్షుడు చెబితే చైర్మన్‌ చేయడం సిగ్గుచేటని.. చంద్రబాబు, చైర్మన్‌లు చరిత్రహీనులుగా మిగిలిపోతారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘శాసన మండలిలో ఈ రోజు జరిగిన ఘటన చట్టసభలకు మాయని మచ్చ. చట్ట ప్రకారం, రాజ్యాంగం ప్రకారం వ్యహరించాలని మంగళవారం నుంచి చైర్మన్‌ను కోరుతున్నాం. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధికి అసెంబ్లీలో రెండు బిల్లుల్ని ఆమోదించాం. వాటిని మండలి ఆమోదించాలి... లేదా సలహాలివ్వాలి. అయితే తన పార్టీ అధినేత చంద్రబాబు చెప్పినట్లు చైర్మన్‌ వ్యవహరించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. అదే మాట చైర్మన్‌ స్వయంగా చెప్పారు. తప్పుచేసే వారికి ఇక విచక్షణాధికారం ఎక్కడుంటుంది. ఐదు కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అధికారం ఇచ్చారు.

రెండు బిల్లుల్ని శాసన సభలో ఆమోదింపజేసుకున్నాం. ఇష్టమో, లేదో మండలిలో ప్రతిపక్ష సభ్యులు తేల్చాలి. నాన్చుడు ధోరణి వల్ల రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతాయి. శాసన మండలి రూల్‌ బుక్‌ ప్రకారం చేయాలని చైర్మన్‌ను కోరాం. ఆయన అలా చేయలేదు. చైర్మన్‌ చర్య రాష్ట్ర చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోతుంది. ప్రజాస్వామ్యానికి ఇది గొడ్డలిపెట్టు. ప్రతీ ఒక్కరికి విచక్షణాధికారం ఉంటుంది. చట్టానికి లోబడకుండా విచక్షాణాధికారాన్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది. అన్ని వర్గాలకు విచక్షణాధికారం ఉంటుంది. సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తుంటే శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తూ, దుర్మార్గంగా ప్రతిపక్షం వ్యవహరిస్తోంది. రాష్ట్రం ఏమైపోయినా బాబుకు పట్టదు. ఆస్తులు కాపాడుకోవడమే ఆయనకు ముఖ్యం. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను.. నీతిమాలిన కార్యక్రమాలను ప్రజలు గమనించాలి. ఇలాంటి చైర్మన్లు ఉంటే వ్యవస్థకే ప్రమాదం. దుర్మార్గపు ఆలోచనతో ముందుకు వెళ్తున్న చంద్రబాబుకు చరమగీతం పాడేంతవరకు సీఎం వైఎస్‌ జగన్‌కు తోడుగా ఉంటాం. సీఎం తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజామోదం మెండుగా ఉంది’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement