‘భారత్‌ బంద్‌’ పాక్షికం

 Bharat Bandh evokes mixed response, opposition rallies against BJP - Sakshi

కేరళ, కర్ణాటక, బిహార్, ఒడిశాల్లో విజయవంతం

బెంగాల్, యూపీల్లో కనిపించని బంద్‌ ప్రభావం

బంద్‌ విజయవంతమన్న కాంగ్రెస్‌.. ప్రజలు తిప్పికొట్టారన్న బీజేపీ

రాంలీలాలో విపక్షాల నిరసన

న్యూఢిల్లీ: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా విపక్షాలు సోమవారం నిర్వహించిన భారత్‌ బంద్‌కు మిశ్రమ స్పందన లభించింది. చెదురుమదురు హింసాత్మక ఘటనలు మినహా మొత్తానికి ప్రశాంతంగా ముగిసింది. కార్యాల యాలు, విద్యాసంస్థలు మూతపడటం, వాహనాలు తిరగకపోవడంతో కేరళ, కర్ణాటక, బిహార్, ఒడిశా, అరుణాచల్‌ ప్రదేశ్‌ల్లో జనజీవనానికి అంతరాయం ఏర్పడగా.. ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం తదితర రాష్ట్రాల్లో బంద్‌ ప్రభావం అసలు కనిపించ లేదు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో 21 ప్రతిపక్ష పార్టీలు భారత్‌ బంద్‌ చేపట్టగా.. రాంలీలా మైదాన్‌ వద్ద నిరసన ర్యాలీలో మోదీ ప్రభుత్వంపై రాహుల్‌ నిప్పులు చెరిగారు. బంద్‌ విజయవంతమని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రకటించుకోగా.. విఫలమైందని బీజేపీ పేర్కొంది.

చెదురుమదురు ఘటనలు
బిహార్‌ రాజధాని పట్నాలో కొన్ని చోట్ల ఆందోళనకారులు రైల్వే ట్రాక్‌లపై టైర్లు మండించి రైలు సర్వీసులకు అంతరాయం కలిగించారు. ఎక్కడికక్కడ వాహనాల్ని అడ్డుకో వడంతో ట్రాఫిక్‌ స్తంభించింది. పలు ప్రాంతా ల్లో బస్సుల విధ్వంసం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు వాహనం ఏర్పాటులో జాప్యం వల్ల జెహనా బాద్‌ జిల్లాలో మూడేళ్ల చిన్నారి మరణించిందని బీజేపీ ఆరోపించింది. ఒడిశాలో రైల్వే ట్రాక్‌లపై కాంగ్రెస్‌ కార్యకర్తల బైఠాయింపుతో రైలు సేవలకు అంతరాయం ఏర్పడింది. 10 రైళ్లను అధికారులు రద్దు చేశారు. భువనేశ్వర్‌లో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో రోడ్లను దిగ్బంధించ డంతో రవాణాకు తీవ్ర ఆటంకం కలిగింది. దుకాణాలు, మార్కెట్లు, వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. కేరళలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది.

బస్సులతో పాటు ఆటోరిక్షాలు కూడా తిరగకపోవడంతో రోడ్లనీ ఖాళీగా దర్శనమి చ్చాయి. కర్ణాటకలో బంద్‌ ప్రభావం పూర్తిగా కనిపించింది. బెంగళూరులో వ్యాపార సంస్థ లు, దుకాణాలు, మాల్స్, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. ఆర్టీసీ, ప్రైవేట్‌ బస్సులు తిరగకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. మంగళూరులో తెరచి ఉంచిన దుకాణాలు, హోటల్స్‌పై రాళ్లు రువ్వడంతో ఉద్రిక్తత కొనసాగింది. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్‌ఎస్, ఎస్పీ కార్యకర్తలు పలు చోట్ల ధర్నాలు నిర్వహించారు. ముంబైలో సబర్బన్, మెట్రో రైళ్లను అడ్డుకున్నారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో దుకాణాలు, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. రోడ్లపై వాహనాలు తిరగలేదు.

పలు రాష్ట్రాల్లో ఆందోళన చేస్తున్న వందలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో వైపు పశ్చిమ బెంగాల్లో అన్ని స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాలు రోజువారీ కార్యక లాపాల్ని యథావిధిగా కొనసాగిం చాయి. ప్రయాణికుల నిరసనతో జాదవ్‌పూర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద ఆందోళనకారులు ధర్నాను ఉపసం హరించుకున్నారు. తమిళనాడులో బంద్‌ ప్రభా వం నామమాత్రంగా కనిపించింది. ఢిల్లీలో కార్యాలయాలు, కళాశాలలు, స్కూళ్లు యథావిధిగా తెరచుకున్నాయి. అయితే ఆందోళనలతో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తాయి. పార్లమెంటు స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌ వద్ద సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీతో పాటు పలువురు లెఫ్ట్‌ నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.

అంతర్జాతీయ కారణాలతోనే : కేంద్రం
అంతర్జాతీయ అంశాల ప్రభావంతోనే పెట్రో ధరలు పెరిగాయని, భారత్‌ బంద్‌ పేరిట ప్రతిపక్షాలు హింసను రేకెత్తించేందుకు ప్రయత్నించాయని బీజేపీ ఆరోపించింది. పెట్రోలు, డీజిల్‌ ధరల పెరుగుదలతో ప్రజల తాత్కాలిక ఇబ్బంది తమకు తెలుసని, సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా మని కేంద్ర మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. పెట్రో ధరల్లో హెచ్చుతగ్గులు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో లేదన్న విషయం ప్రజలు అర్థం చేసుకున్నారని, అందువల్ల బంద్‌ పిలుపును తిప్పికొట్టారని చెప్పారు. పెట్రో ఉత్పత్తులపై వసూలు చేస్తున్న పన్నుల మొత్తాన్ని సంక్షేమ పథకాల కోసమే ఖర్చు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో పెట్రోలు ధర రూ. 39 నుంచి రూ. 71కి పెరిగిందని ఆయన తప్పుపట్టారు.

ప్రతిపక్షాలు ఐక్యంగా సాగాల్సిన తరుణమిది: మన్మోహన్‌
న్యూఢిల్లీ: దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజాస్వామ వ్యవస్థను కాపాడేందుకు ప్రతిపక్ష పార్టీలు విభేదాల్ని పక్కన పెట్టి కలిసి సాగాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఉద్ఘాటించారు. పెట్రో ధరల పెంపునకు నిరనసగా ప్రతిపక్షాలు చేపట్టిన భారత్‌ బంద్‌లో భాగంగా ఢిల్లీలోని రాంలీలా మైదానం వద్ద నిర్వహించిన ర్యాలీలో కేంద్రంపై ఆయన విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం తీసుకున్న అనేక చర్యలు దేశ ప్రయోజనాల కోసం కాదని విమర్శించారు. సమాజంలోని యువత, రైతులు, సామాన్య ప్రజలు ఇలా అందరూ మోదీ ప్రభుత్వ పనితీరు పట్ల అసంతృప్తిగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీల్ని నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని ఆరోపించారు. ‘మోదీ ప్రభుత్వం ఇప్పుడు పరిధి దాటి ప్రవర్తిస్తోంది. ఆ ప్రభుత్వాన్ని మార్చే సమయం ఆసన్నమైంది. పార్టీలు చిన్నచిన్న విభేదాల్ని పక్కనపెట్టి దేశ సమగ్రత, సార్వభౌమత్వం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు సిద్ధమైనప్పుడే అది సాధ్యం’ అని పేర్కొన్నారు.  

మోదీజీ.. ధరలపై మౌనం వీడండి: రాహుల్‌
ప్రధాని మోదీ పాలనలో దేశంలో విభేదాలు పెచ్చరిల్లుతున్నాయని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ప్రతిపక్షాల ఐక్య కూటమి ఓడించడం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ర్యాలీలో మాట్లాడుతూ.. పెట్రో ధరల పెరుగుదల, రాఫెల్‌ ఒప్పందం, రైతుల ఆత్మహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, నిరుద్యోగం వంటి సమస్యలపై ప్రధాని మోదీ మౌనాన్ని రాహుల్‌ ప్రశ్నించారు. ‘70 ఏళ్లలో జరగనిది ఈ నాలుగేళ్లలో చేశామని మోదీ చెబుతున్నారు. అది నిజమే. ఎక్కడ చూసినా ఒకరితో మరొకరు గొడవలు పడుతున్నారు. ప్రజల మధ్య విభేదాల్ని సృష్టించారు. అదే వారు సాధించింది’ అని తప్పుపట్టారు. ఈ ర్యాలీలో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్, లోక్‌తాంత్రిక్‌ జనతాదళ్‌ నేత శరద్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.   

పట్నాలో బస్సు అద్దాల ధ్వంసం; ఢిల్లీలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి


బెంగళూరులోని మెజెస్టిక్‌ బస్టాండ్‌లో నిలిచిపోయిన బస్సులు

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top