సమగ్ర విచారణ చేపట్టండి

Bajireddy Letter To Collector On Land cleansing process - Sakshi

భూపతిరెడ్డి ఆరోపణలపై కలెక్టర్‌కు బాజిరెడ్డి లేఖ

వ్యూహాత్మకంగా స్పందించిన ఎమ్మెల్యే

నా 35 ఏళ్ల రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీశారు..

ఆరోపణలు తప్పని తేలితే ఎమ్మెల్సీపై చర్య తీసుకోవాలని వినతి

విచారణకు ఆదేశించిన కలెక్టర్‌

వారంలో నివేదిక ఇవ్వాలని డీఆర్వోకు ఆదేశం  

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ముఖ్య నేతల మధ్య వర్గ పోరు రసకందాయంలో పడింది. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ వ్యూహాత్మకంగా  స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్‌కు లేఖ రాశారు. ఆరోపణలు తప్పని తేలితే ఎమ్మెల్సీపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సాక్షిప్రతినిధి, నిజామాబాద్‌:భూ ప్రక్షాళన ప్రక్రియపై ఎమ్మెల్సీ భూపతిరెడ్డి చేసిన సంచలన ఆరోపణలపై నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌ వ్యూహాత్మకంగా స్పందించారు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ కలెక్టర్‌ ఎం.రామ్మోహన్‌రావుకు ఆదివారం లేఖ రాశారు. ఈ ఆరోపణలు తన 35 ఏళ్ల రాజకీయ ప్రతిష్టను దెబ్బ తీశాయని లేఖలో పేర్కొన్నారు. పోలీసు శాఖతో గానీ, తగిన అధికారం కలిగిన యంత్రాంగంతో గానీవిచారణ జరిపించాలని కోరారు. తనపై చేసిన ఆరోపణలు రుజువు కాని పక్షంలో ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు ఉప్పు నిప్పులా మారిన విషయం విదితమే. గతంలో భూపతిరెడ్డి పలుమార్లు చేసిన విమర్శలపై బాజిరెడ్డి ఘాటుగానే స్పందించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. కానీ ఈసారి బాజిరెడ్డి వ్యూహాత్మకంగా కలెక్టర్‌కు లేఖ రాయడం రాజకీయ వర్గాల్లోనే కాకుండా అధికార వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ ఆరోపణలపై బాజిరెడ్డి అవసరమైతే న్యాయ పోరాటం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఇన్‌చార్జి డీఆర్వోతో విచారణ..
బాజిరెడ్డి రాసిన లేఖపై కలెక్టర్‌ రామ్మెహన్‌రావు తక్షణం స్పందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణ అధికారిగా ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి వినోద్‌కుమార్‌ను నియమించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి ఆరోపించిన గ్రామాలతో పాటు అన్ని చోట్లా విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈ మేరకు వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు సమాచారం. మరో వైపు జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి శనివారం సిరికొండ తహసీల్దార్‌ కార్యాలయాలన్ని తనిఖీ చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనకు సంబంధించిన ప్రగతిపై ఆరా తీశారు. జిల్లాలో భూ రికార్డుల ప్రక్షాళన 95 శాతం పూర్తయిందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఆధార్‌ సీడింగ్, డిజిటల్‌ సిగ్నిచర్‌లను ఖాతాల వారీగా ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. మొదటి విడతలో జిల్లాలోని 105 గ్రామాల్లో పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పాసుపుస్తకాల ముద్రణకు సైతం ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆరోపణలు, బాజిరెడ్డి కలెక్టర్‌కు లేఖ చర్చనీయాంశంగా మారింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top