కాంగ్రెస్‌ది బెయిలు బండి

'Bail gaadi' Congress, its leaders out on bail - Sakshi

ముఖ్య నేతలంతా బెయిలుపై బయట ఉన్నవారే

అభివృద్ధే మా ప్రభుత్వ ధ్యేయం

రాజస్తాన్‌లో ప్రధాని మోదీ

సంక్షేమ పథకాల లబ్ధిదారులతో జైపూర్‌లో భారీ ర్యాలీ  

జైపూర్‌: కాంగ్రెస్‌ పార్టీని ఇప్పుడంతా ‘బెయిలు బండి’ అని పిలుస్తున్నారనీ, ఆ పార్టీలో పెద్దపెద్ద నేతలుగా చెప్పుకుంటున్న వారంతా ఇప్పుడు బెయిలుపై బయట ఉన్నారంటూ ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. 2016లో పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో సర్జికల్‌ స్ట్రైక్స్‌కు సంబంధించి కాంగ్రెస్‌ పార్టీ ఆర్మీ సామర్థ్యాన్నే శంకిస్తోందనీ, ఆ పార్టీ దురుద్దేశాలు ప్రజలందరికీ తెలుసునని మోదీ విమర్శించారు.

మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న 4 రాష్ట్రాల్లో ఒకటైన రాజస్తాన్‌లో మోదీ శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. జైపూర్‌లో జరిగిన ఈ ర్యాలీకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు హాజరయ్యారు. ‘ఆర్మీ సామర్థ్యాలను శంకించడం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు పాపానికి ఒడిగట్టారు. ఎన్నడూ ఇలా జరగలేదు. ఇలాంటి రాజకీయాలు చేసే వారిని ప్రజలు క్షమించరు’ అంటూ కాంగ్రెస్‌పై మోదీ విరుచుకుపడ్డారు.

2,100 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
రాజస్తాన్‌లో పర్యటన సందర్భంగా మోదీ రూ. 2,100 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు రిమోట్‌ ద్వారా శంకుస్థాపన చేశారు. రాజస్తాన్‌లోని బర్మార్‌ ముడిచమురు శుద్ధి కర్మాగారానికి కాంగ్రెస్‌ శంకుస్థాపన చేసినా, తాము అధికారంలోకి వచ్చిన తర్వాతనే అక్కడ పనులు వేగం పుంజుకున్నాయన్నారు. పర్బాతీ–కాళీసింధ్‌–చంబల్‌ నదుల అనుసంధానాన్ని జాతీ య ప్రాజెక్టుగా చేపట్టాలని వసుంధర రాజే కోరగా మోదీ సానుకూలంగా స్పందించారు.

బీజేపీ పేరు వింటే కలవరం..
‘బీజేపీ పేరు వింటే కొంత మంది కలవరపడతారు. మోదీ లేదా వసుంధర రాజేల పేర్లను ఎవరైనా ప్రస్తావిస్తే వారికి జ్వరం పట్టుకుంటుంది. అలాంటి వారికి ఈ ర్యాలీలంటే అసహ్యం. కానీ వీటితోనే ప్రభుత్వ పథకాల గురిం చి అందరికీ తెలుస్తుంది’ అంటూ మోదీ కాం గ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ ర్యాలీ లో రాజస్తాన్‌ గవర్నర్‌ కల్యాణ్‌ సింగ్,  సీఎం వసుంధర రాజే, తదితరులు పాల్గొన్నారు.

దివ్య శక్తులున్నాయి.. వేదికను పేల్చేస్తా
మోదీ ర్యాలీ వేదికను పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్‌ చేసి ‘నాకు దివ్య శక్తులున్నాయి. వేదికను పేల్చేస్తా’ అని బెదిరించాడు. వెంటనే ఫోన్‌ నంబర్‌ ద్వారా అతణ్ని పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.  మరోవైపు మోదీ సభ కోసం వచ్చిన వారిలో నల్ల దుస్తులు ధరించిన లేదా నలుపు రంగు వస్త్రం కలిగిన వారిని లోపలికి అనుమతించలేదు. ఎవరైనా నల్ల రంగు వస్త్రంతో నిరసన తెలుపుతారనే అనుమానంతో భద్రతాధికారులు ఈ ముందస్తు చర్య తీసుకున్నారు.

బీజేపీ అవినీతిపరులు జైలుకే: కాంగ్రెస్‌
న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడుతున్న బీజేపీ మంత్రులు, నేతలను మోదీ కాపాడుతున్నారని కాంగ్రెస్‌ ఆరోపించింది. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీ నేతలపై ఉన్న కేసులను విచారించి, శిక్ష పడేలా చేస్తామంది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా కొడుకుసహా అనేక మంది బీజేపీ మంత్రులపై వస్తున్న అవినీతి ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్‌ చేస్తున్నా, మోదీ అడ్డుపడుతున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఆర్పీఎన్‌ సింగ్‌ దుయ్యబట్టారు. మోదీ గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 20 లక్షల కోట్ల విలువైన జీఎస్‌పీసీ కుంభకోణం జరిగిందన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top