భారత సైన్యంపై అజాం ఖాన్‌ మళ్లీ వ్యాఖ్యలు

Azam Khan again comments on Indian Army

సాక్షి, లక్నో : ఉత్తర ప్రదేశ్ వివాదాస్పద నేత అజాం ఖాన్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. సైన్యం తనకు యుద్ధ ట్యాంక్‌ను బహుమతిగా ఇచ్చిందని ఆయన ఓ సంచలన ప్రకటన చేశారు. గతంలో ఆర్మీపై ఆయన దారుణమైన వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మరోసారి సైన్యం గురించి స్పందించారు.

మహ్మద్‌ అలీ జౌహర్‌ యూనివర్సిటీకి ఈ సమాజ్‌వాదీ పార్టీ సీనియర్‌ నేత వ్యవస్థాపకుడిగా, ఛాన్స్‌లర్‌గా ఉన్నారు. ఈ యూనివర్సిటీ కోసమే యుద్ధ ట్యాంకర్‌ను ఆర్మీ బహుమతిగా ఇచ్చిందంట. ‘నాకు సైన్యం అంటే గౌరవం లేదని కొందరు విమర్శిస్తున్నారు. కానీ, మా మధ్య ఆయధ సంపత్తితో కూడిన మంచి సంబంధాలు ఉన్నాయి. అధునాతన ఆయుధాల అధ్యయనం కోసం వారిని సంప్రదించగా.. ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా విద్యాలయానికి సైన్యం యుద్ధ ట్యాంకర్‌ను కూడా బహుకరించారు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి’ అని అజాం ఖాన్‌ తెలిపారు. 

అజాం ప్రకటనపై స్పష్టత కోసం మీడియా లక్నోలో కేంద్ర కమాండో దళాన్ని  సంప్రదించగా... అధికారులు స్పందించేందుకు నిరాకరించారు. జార్ఖండ్‌, అసోం రాష్ట్రాల్లో ఆర్మీ రేపిస్టుల‌పై మ‌హిళ‌లు చేస్తున్న దాడుల గురించి ప్రస్తావిస్తూ... సైన్యం దేశ నైతికతను దెబ్బతీస్తోందంటూ గతంలో అజాం ఖాన్ వ్యాఖ్యలు చేసింది విదితమే. ఆ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా.. ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు అయ్యింది కూడా.  అయితే తాను మాట్లాడే ప్రతీ మాటను కావాలనే విమర్శలు చేస్తున్నారని.. బీజేపీకి తాను ఓ ఐటెం గర్ల్‌ అయిపోయానంటూ అజాంఖాన్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top