సేవకుడే అక్కడ లీడర్‌

AP Elections 2019 Kamalapuram Constituency Review - Sakshi

సాక్షి, కడప: కమలాపురం నియోజకవర్గంలో 1952 నుంచి 2014 వరకూ 14సార్లు ఎన్నికలు జరిగాయి. ఏడుసార్లు కాంగ్రెస్‌ పార్టీ,  మూడు పర్యాయాలు టీడీపీ, రెండు దఫాలు స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. వైఎస్సార్‌సీపీ, సీపీఐ అభ్యర్థులు చెరోసారి  విజయం సాధిం చారు. ఈమారు ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొంది. అయినా ప్రధానంగా వైఎస్సార్‌సీపీ, టీడీపీ మధ్యనే పోటీ జరుగుతోంది. ఇరుపక్షాలు ముమ్మర ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే,  వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి నిత్యం ప్రజలతో మమేకమై ఉండటం  ప్రచారంలో కలిసివచ్చింది. మొత్తం నియోజకవర్గంలో గడప గడపా చుట్టేశారు. టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి ప్రచారం ఆలస్యంగా ప్రారంభించారు. ఎన్నికల గడువు ముగిసేలోపు ఇంటింటికీ తిరగడం కష్టసాధ్యమేనని పరిశీలకులు భావిస్తున్నారు. 

ఉద్దండులను ఎన్నుకున్న ప్రజలు....
గత ఎన్నికలు విశ్లేషిస్తే కమలాపురం ఎప్పుడూ ఉద్దండులకు పట్టం కడుతోంది. నర్రెడ్డి శివరామి రెడ్డి భూస్వామ్య వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరా టం చేసి, నిర్బంధ జీవితం గడిపారు. సొంత కుటుంబాన్ని ఎదిరించి పోరాటం చేశారు. మహోన్నతుడుగా కీర్తిగడించిన శివరామిరెడ్డి సీపీఐ తరుపున పోటీచేయగా 1952లో విజయం కట్టబెట్టారు. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన ఎన్‌ పుల్లారెడ్డి, పేర్ల శివారెడ్డిలను  కూడా ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నారు. రాయలసీమ ఉద్యమాన్ని భుజానికెత్తుకున్న ఎంవీ మైసూరారెడ్డిని 1985లో శాసనసభకు పంపించారు. 1989లో కూడా రెండో పర్యాయం ఆయన్నే ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. తర్వాత కమలాపురం తెరపైకి వచ్చిన వీరశివారెడ్డి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీచేసిన పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డిని తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 

పుత్తా ప్రతికూలతలు..
నియంతృత్వాన్ని కమలాపురం ప్రజలు కట్టడి చేస్తూ వస్తున్నారు. గత చరిత్ర అదే విషయాన్ని రుజువు చేస్తోంది. వరుసగా రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఎంవీ మైసూరారెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో హోంమంత్రిగా పనిచేశారు. మంత్రి హోదాలో 1994 ఎన్నికల్లో పోటీచేయగా కమలాపురం ఓటర్లు తిరస్కరించారు. కమలాపురం మండలాధ్యక్షుడు హోదాలో నియోజకవర్గంలో పరిచయం ఉన్న వీరశివారెడ్డికి పట్టం కట్టారు. అనుచరులు నియోజకవర్గ వ్యాప్తంగా చేసిన దౌర్జన్యకర ఘటనలు మైసూరారెడ్డి ఎన్నికను ప్రభావితం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. మంచితనానికి ఓటర్లు పట్టం కడుతున్నారని. దౌర్జన్యాన్ని సహించని పరిస్థితి ఇక్కడ ఓటర్లలో కనిపిస్తుంది. అదే విషయం టీడీపీ అభ్యర్థి పుత్తా నరసింహారెడ్డి పట్ల కూడా తేటతెల్లమైంది. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా 2009, 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా ఓటమి చవిచూశారు.

పార్టీలు మారినా విజయం దరి చేరలేదు.  పుత్తా ఫ్యాక్షన్‌ చరిత్ర, ఇప్పటికీ కొనసాగుతున్న దౌర్జన్యకర ఘటనలేనని ఇందుకు కారణమని పలువురు వివరిస్తున్నారు. పదేళ్లుగా టీడీపీలో ఉన్నా, ఇప్పటికీ కార్యకర్తలు తమ అభిప్రాయాలు కూడా వెల్లడించలేని పరిస్థితి  నెలకొంది. సాహసం చేసి ఎవరైనా అభిప్రాయం వెల్లడిస్తే దూషణలు ఎదుర్కోవాల్సి వస్తోంది. పెద్దా చిన్నా చూడకుండా వ్యవహరిస్తారని సీనియర్‌ నాయకులు వాపోతున్నారు. పుత్తా పట్ల కమలాపురం ప్రాంత ప్రజల్లో మరో అభద్రతాభావం కూడా లేకపోలేదు. భూములపై కన్ను పడితే వదిలేసుకోవాల్సిందేనని పెద్దచెప్పలి, దేవరాజుపల్లె, సముద్రంపల్లె, పెద్దపుత్త ప్రాంతాలల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. ‘చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లు’గా పుత్తా అనుచరులుగా కొంతమంది గ్యాంగ్‌లు నిర్వహిస్తూ ప్రధాన నగరాలల్లో భూ సెటిల్‌మెంట్లుకు పాల్పడుతోన్నారు. ఇదంతా ఎన్నికల్లో ప్రభావం చూపనున్నట్లు విశ్లేషకుల అంచనా.

అనుకూలించనున్న ఉద్యమ చరిత్ర:
ఎస్సార్‌సీపీ అభ్యర్థి పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి చేపట్టిన ఉద్యమ చరిత్ర ఆయనకు అనుకూలించనుందని పరిశీలకుల భావన. ప్రజాందోళన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు చేస్తూనే, సర్వారాయసాగర్‌ను తక్షణమే నిర్మించాలని, 2013లో ఆమరణదీక్ష చేపట్టారు. ఆమేరకు ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించారు. గత ఏడాది గండికోట, వామికొండ ప్రాజెక్టుల నుంచి సర్వారా యసాగర్‌కు నీటి విడుదలకు విశేషంగా కృషి చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఒత్తిడి తేవడంతో అధికారులు అంగీకరించినా తెరవెనుక టీడీపీ నేతలు మోకా లొడ్డారు.

ప్రజల కోసం సర్వారాయసాగర్‌ నుంచి కడప కలెక్టరేట్‌ వరకూ పాదయాత్ర చేపట్టారు. అధికారులపై ఒత్తిడి తీసుకవచ్చి సర్వారాయసాగర్‌కు నీరు తెప్పించారు. వీరపునాయునిపల్లె మండల ప్రజానీకం ఇదే విషయం మననం చేసుకుంటుం టారు. అంతేకాకుండా ప్రభుత్వంపై ప్రత్యక్షంగా నిరంతర పోరాటాలు ఎంచుకున్నారు. తమ పార్టీ పిలుపు మేరకు ప్రజాఉద్యమాలు చేపట్టిన చరిత్ర ఎన్నికల్లో కలిసిరానున్నట్లు పరిశీలకులు భావిస్తున్నారు. నియంతృత్వ పోకడ నేపథ్యం ఓ వైపు, ప్ర జా ఉద్యమ చరిత్ర మరోవైపు ఇక్కడ బరిలో పోటీ పడతున్నాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.    

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top