అందుకే వార్‌ వన్‌సైడ్‌: ఎమ్మెల్యే శ్రీదేవి

AP Election Results 2019 Tadikonda MLA Undavalli Sridevi Reacts On Her Victory - Sakshi

సాక్షి, అమరావతి : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితోనే రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ప్రజలు భావించారని, అందుకే ఎన్నికల్లో వార్‌ వన్‌సైడ్‌ అయిందని తాడికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్‌ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. ప్రజలందరూ కూడబలుక్కుని వైఎస్సార్ సీపీకి ఓటు వేశారనిపిస్తోందన్నారు. ఆమె సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ..ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో 151 సీట్లు సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర తిరగరాశారన్నారు. అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గత అయిదేళ్ల పాటు అబద్ధాలు చెప్పారంటూ శ్రీదేవి మండిపడ్డారు. చంద్రబాబును ప్రజలు నమ్మలేదని అందుకే తమ ఓటు హక్కు ద్వారా సరైన గుణపాఠం చెప్పారన్నారు.  తాడికొండ నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు సామాజిక వర్గానికి చెందినవారే ఎక్కువ ఉన్నారన్నారు. అందుకే ఆయన రాజధాని కూడా ఇక్కడ పెట్టారన్నారు. తుళ్లూరు పరిధిలోని 19 గ్రామాలు టీడీపీకి కంచుకోట అని, అలాంటి చోట వైఎస్సార్ సీపీ విజయ కేతనం ఎగురవేసిందన్నారు.

ఇక రాజధాని పేరుతో రైతులను చంద్రబాబు నిలువునా మోసం చేశారని శ్రీదేవి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని అన్నారు. చంద్రబాబు పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. టీడీపీ పాలనలో ఉద్యోగాలు రాలేదని, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు కాకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారన్నారు. పేదలకు పక్కా ఇళ్లు కూడా ఇవ్వలేదని, వృద్ధులకు కనీసం పింఛన్లు కూడా సరిగ్గా అందించలేదన్నారు. ప్రజలందరూ మార్పు కోరుకున్నారని అందుకే వైఎస్సార్ సీపీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే శ్రీదేవి అన్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : 
వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top