ప్రజల ఆకాంక్షలకు తగ్గటుగా బడ్జెట్‌: ధర్మాన

AP budget Result oriented and realistic, says Dharmana  - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్ర బడ్జెట్‌ నూతన అధ్యాయానికి తెర తీసిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. శాసనసభలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయన సోమవారం మాట్లాడుతూ..‘గతంలో ప్రజల అవసరాలు ఒక రకంగా, బడ్జెట్‌లో కేటాయింపులు మరో రకంగా ఉండేవి. అవసరాలకు తగ్గట్టుగా బడ్జెట్‌ ఎందుకు ఉండదు అని ఆలోచించేవాడిని. తొలిసారిగా ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయి. ప్రతిపక్షాలకు మేం ప్రవేశపెట్టినట్లుగా ఈ బడ్జెట్‌ అంచనాలు లేవనే బాధ ఉంది. వైఎస్సార్‌ పాలన దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. చేతల ప్రభుత్వం ఏర్పడింది. చేసి చూపిస్తోంది.

సంక్షేమ కార్యక్రమాలను పేదలు, బడుగులకు అందించిన వ్యక్తి వైఎస్సార్‌. ఆ పథకాలను లబ్ది చూసిన ప్రజలే వైఎస్సార్‌ సీపీని ఆదరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాదయాత్ర హామీలు ఈ బడ్జెట్‌లో కనిపిస్తుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టినప్పుడే ఏ వర్గాలకు ఎంత కేటాయించాలో స్పష్టంగా కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో సమస్య ఉంది. అన్ని అవసరాలను దృష్టిలో పెట్టుకునే బడ్జెట్‌ను రూపొందించారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వస్తే ఏ పథకాలు ఉంటాయో జగన్‌ ముందే చెప్పారు. ప్రతిపక్షాలు బడ్జెట్‌ను మేనిఫెస్టోలా ఉందంటున్నారు. మేనిఫెస్టో బడ్జెట్‌లో కనిపిస్తే తప్పేంటి?. అలా కనిపించకపోతేనే తప్పు. 

ఆ బాధ్యత మనపై లేదా?
అమ్మ ఒడి గొప్ప పథకం. అక్షరాస్యతను పెంచేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. అక్షరాస్యతలో మన రాష్ట్రం 31వ స్థానంలో ఉందంటున్నారు. చదువుకోవడానికి వసతులు కల్పించడంలో గత ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వాటిని పరిగణనలో తీసుకోవాల్సిన బాధ్యత మనపై లేదా?. అమ్మ ఒడి లాంటి పథకం ఈ నిర్లక్ష్యాన్ని తొలగిస్తుంది. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చే గొప్ప పథకం. ప్రభుత్వం ఏ దిశగా వెళుతుందో చూడకుండా వాటిలో తప్పులు వెతికే ప్రయత్నం మంచిది కాదు. కేటాయింపులు సరిపోకుంటే మరిన్ని కేటాయింపులు జరుగుతాయి. ప్రైవేట్‌ విద్యను ఇష్టానుసారంగా పెంచడంతో వారు దోపిడీ చేసుకుంటే వెళ్లిపోయారు. తప్పులు సరిదిద్దడానికి సీఎం జగన్‌ చేస్తున్న ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. 

అందుకే వ్యవసాయానికి అధిక కేటాయింపులు..
రైతులకు ఎంత చేసినా తక్కువే అవుతుంది. రైతులు తమతో పాటు అనేక కుటుంబాల కడుపు నింపడానికి ప్రయత్నిస్తారు. అయితే పంట కోసం చేసిన అప్పులు కూడా తీరక నిస‍్సహాయ స్థితిలో ఉన్నారు. అందుకే రైతులకు బడ్జెట్‌ అధిక కేటాయింపులు చేసింది. రాష్ట్రంలో 60శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయాన్ని మనం పట్టించుకోకుండా ఉండగలమా?. వాళ్లంతా వేరే రంగాల వైపు మళ్లితే పరిస్థితి ఎలా ఉంటుంది. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో తమ పిల్లలను వ్యవసాయం వైపు చూడనివ్వడం లేదు. ఇతర రంగాల వైపు ప్రోత్సహిస్తున్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన రైతులకు చివరకు ఏమీ మిగలడం లేదు. రైతు భరోసా, 9 గంటల విద్యుత్‌, రైతులకు ఇన్సురెన్స్‌, సున్నా వడ్డీ రుణాలు... ఇవన్నీ వ్యవసాయాన్ని ప్రోత్సహించే పథకాలే. వ్యవసాయానికి రూ.24వేల కోట్లు కేటాయింపుల ద్వారా రైతులకు నమ్మకం కల్పించారు. 

ఎన్నికలప్పుడే రాజకీయాలు..
సొంతిల్లు పేదవాడి కల. ఆ కలలు నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కృషి చేస్తోంది. చంద్రబాబు సర్కార్‌లో పేదవాడి ఇళ్ల నిర్మాణానికి ఒక్క ఎకరం కొనుగోలు చేసేందుకు బడ్జెట్‌ కేటాయించారా?. ప్రభుత్వ భూములు లేని చోట భూములు కొనుగోలు చేసి పేదవాడికి ఇళ్ల కోసం ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేయడం సంతోషం. ఎన్నికల్లో ఓటు వేయనివాడికి కూడా ప్రభుత్వ పథకాలు అందించాలనుకోవడం గొప్ప లక్ష్యం. చంద్రబాబు హయాంలో ఇంటిపై టీడీపీ జెండా కడితేనే, పచ్చ చొక్కా వేస్తేనే పథకాలు అందే పరిస్థితి. ఎన్నికలప్పుడే రాజకీయాలు చేయాలి. ఎన్నికల అనంతరం ప్రజలను పార్టీరహితంగా చూడాలి.

చంద్రబాబు 19సార్లు కేబినెట్‌ సమావేశాలు పెట్టినా ఇసుక అక్రమ రవాణా ఆగలేదు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇసుకపై కొత్త పాలసీ తీసుకొస్తామనగానే.. అక్రమ ఇసుక రవాణా రాష్ట్రం మొత్తం ఆగిపోయింది. నాయకుడి నిబద్ధతకు ఇది ఉదాహరణ. మత్స్యకార గ్రామాల్లో మహిళలు బెల్టు షాపులు రద్దు చేశారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయిదేళ్లలో రాజధాని పేరుతో చంద్రబాబు సాధించిందేమిటి?. ఎమ్మెల్యే, మంత్రులకు ఒక్క క్వార్టర్‌ కట్టలేదు. నాలుగో తరగతి సిబ్బంది ఉండేందుకు గృహ నిర్మాణం జరగలేదు. గవర్నర్‌, స్పీకర్‌ వ్యవస్థలతో పాటు అన్ని రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు నాశనం చేశారు.’ అని అన్నారు.

ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఎమ్మెల్యే ధర్మాన ప్రసంగం అనంతరం శాసనసభ సమావేశాలు మంగళవారానికి వాయిదా పడ్డాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top