రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం

Anti Farmer Government In The State - Sakshi

రాజాం: రాష్ట్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. శుక్రవారం రాజాంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాలుగేళ్ల పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు ఏంచేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ప్రాంతానికి సంబంధించి తోటపల్లి ప్రాజెక్ట్‌  ఘనత దివంగత నేత వైఎస్సార్‌దేనని స్పష్టం చేశారు.

అప్పట్లో విస్తరణ మినహా టీడీపీ హయాంలో ఏమీ జరగలేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి టీడీపీ స్వలాభం చూసుకుంటోందన్నారు. అప్పట్లో వైఎస్సార్‌ పోలవరం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర జీవనధారగా గుర్తించి అభివృద్ధి చేస్తే ఆ విషయాన్ని కేంద్రం గుర్తించి జాతీయ ప్రాజెక్ట్‌గా తమ పరిధిలోకి తీసుకుందన్నారు. ఇప్పుడు చంద్రబాబు స్వలాభం, స్వప్రయోజనాల కోసం ప్రాజెక్ట్‌ను రాష్ట్ర పరిధిలోకి తీసుకుని అంచనాల్లో తేడాలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు.

తాజాగా కేంద్ర మంత్రి గడ్కారీ ప్రాజెక్ట్‌ను పరిశీలించి అనుమానాలు వ్యక్తం చేస్తే టీడీపీ నేతలు సమాధానాలు చెప్పలేకపోతున్నారని విమర్శించారు.  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ప్రాజెక్ట్‌ను వేగవంతం చేస్తామని చెప్పారు. రుణమాఫీలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు సర్కారు ఇప్పుడు సాగునీటిని కూడా సకాలంలో ఇవ్వలేని పరిస్థితిలో ఉందని దుయ్యబట్టారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్న క్యాంటీన్లు పెడతామని హామీ ఇచ్చి నాలుగేళ్లుగా పట్టించుకోలేదని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆదరాబాదరాగా ఏర్పాటు చేస్తూ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

సమావేశంలో పార్టీ రాజాం మండల కన్వీనర్‌ లావేటి రాజగోపాలనాయుడు, వంగర మండలం కన్వీనర్‌ కరణం సుదర్శనరావు, రాజాంటౌన్‌ యూత్‌ కన్వీనర్‌ వంజరాపు విజయ్‌కుమార్, పార్టీ సీనియర్‌ నాయకులు వాకముల్ల చిన్నంనాయుడు, పార్టీ అధికార ప్రతినిధి పారంకోటి సుధ, ఎస్‌.తవుడు, సమతం రమేష్‌  తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top