అర్ధరాత్రి ఓటు.. ఎవరికి చేటు.?

Andhra Pradesh Election Voting mid night In West Godavari - Sakshi

ఎన్నడూ లేని విధంగా సుదీర్ఘంగా సాగిన పోలింగ్‌

వెల్లువెత్తిన ఓటు చైతన్యంపై రాజకీయ పార్టీల్లో చర్చ

చివరి ఓట్లను చేజిక్కించుకునేందుకు టీడీపీ కుట్రలు

సమర్థంగా అడ్డుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

ఓటర్లకు మద్దతుగా పలుచోట్ల ధర్నాలు

చివరి ఓట్లు ఎవరికి పడ్డాయోనని పార్టీల లెక్కలుvisha

పోలింగ్‌ సుదీర్ఘంగా సాగింది.. మునుపెన్నడూ లేని విధంగా చాలాచోట్ల అర్థరాత్రి వరకూ ఓటర్లు లైన్‌లో నిలబడి ఓటు వేశారు. మధ్యాహ్నం వరకూ మందకొడిగా సాగిన పోలింగ్‌ ఆ తర్వాత నుంచి ఊపందుకుంది. చైతన్యం పెరిగి ఓటు వినియోగించుకోవడం బాగానే ఉన్నా.. అర్థరాత్రి వరకూ సాగిన పోలింగ్‌పైనే సర్వత్రా చర్చ జరుగుతోంది. రాత్రివేళ దొరికిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అధికార పార్టీ శతవిధాలా ప్రయత్నించిందన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ దీన్ని గట్టిగా ఎదర్కొని ఓట్లు కొల్లగొట్టాలన్న టీడీపీ ఆశలను వమ్ము చేసిందన్న వాదనలు ఉన్నాయి. మరోవైపు అర్ధరాత్రి ఓటింగ్‌.. పెరిగిన పోలింగ్‌ ప్రభుత్వంపై పేరుకుపోయిన వ్యతిరేకతకు అద్దం పడుతోందని.. అందువల్ల ఆ ఓట్లన్నీ తమవేనని వైఎస్సార్‌సీపీ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే మహిళలు ఎక్కువగా పాల్గొన్నందున ఆ ఓట్లన్నీ తమవేనని టీడీపీ బింకం ప్రదర్శిస్తోంది.

విశాఖసిటీ: జిల్లా ఓటర్లు సత్తా చాటారు. ఓటు వేసి సగర్వంగా తలెత్తారు. అర్థరాత్రి వరకూ లైన్‌లో నిలబడి ఓటు వేశారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన సార్వత్రిక సమరంలో దాదాపు అన్ని చోట్లా అధిక శాతం పోలింగ్‌ నమోదైంది. మధ్యాహ్నం వరకూ సాధారణ పోలింగ్‌ శాతం మాత్రమే నమోదైంది. అయితే.. సాయంత్రం 5 గంటలు దాటిన తర్వాత పోలింగ్‌ బూత్‌లవైపు లక్షల అడుగులు పడ్డాయి. ఒక్కొక్కరుగా వచ్చి లైన్‌లో నిలబడటంతో వందలు.. వేల మంది సాయంత్రం 6 గంటలకల్లా పోలింగ్‌ స్టేషన్‌కు చేరుకోవడంతో రాత్రి వరకూ బారులు తీరారు. దాంతో చివరి ఓటర్ల తీర్పు ఎవరివైపు మొగ్గు చూపిందన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ పోలింగ్‌ ఎవరికి మేలు.?
పెరిగిన పోలింగ్‌ శాతం ఏ పార్టీకి మేలు చేస్తుందన్నదే చిక్కుముడిగా మారింది. అర్థరాత్రి వరకూ సాగిన పోలింగ్‌లో మహిళలు, యువకులే ఎక్కువగా ఉన్నారు. ఓటర్లు పట్టుదలతో ఓటు వెయ్యడం వెనుక కారణాలు ఏంటన్న విషయమై అన్ని పార్టీల అభ్యర్థులూ వీలైనంత మంది నుంచి తెలుసుకు నే ప్రయత్నం ఇంకా చేస్తునే ఉన్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ప్రచారం చెయ్యగా.. ఈసారి ఎవరిదారి వారు ఎంచుకోవడంతో చివరి ఓటింగ్‌ తమకే లాభిస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత కూడా ఎక్కువగా ఉండటంతో ఎలాగైనా సుపరిపాలన అందించే పార్టీకి అధికారం ఇవ్వాలన్న తలంపుతో ఓటర్లు చైతన్యవంతులై ముందుకొచ్చారనేది ప్రతి ఒక్కరి వాదన.

ఓట్ల కొనుగోలుకు టీడీపీ ప్రయత్నం
అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోరాదన్న రీతిలో టీడీపీ వ్యవహరించింది. సాయంత్రం తర్వాత వచ్చిన ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే ఎత్తుగడలకు దిగారు. నగరంలోని ఉత్తరం, దక్షిణం, పెందుర్తితో పాటు పలు నియోజకవర్గాల్లో అర్థరాత్రి వరకూ ఓటింగ్‌ సాగింది. ఇదే అదనుగా మరోసారి డబ్బులు పంపిణీ చేసి ఓట్లు కొనుగోలు చేయాలని ప్లాన్‌ చేశారు. వీరి ఎత్తుగడలను చాలా చోట్ల ప్రజలు తిప్పికొట్టారు. పోలింగ్‌ ముగిసే చివరి వరకూ ఓటర్లను ప్రలోభ పెట్టే పనిలోనే టీడీపీ శ్రేణులు వ్యవహరించాయి. విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని రాంజీ ఎస్టేట్స్, తాటిచెట్లపాలెంలో జరిగిన సంఘటనలే దీనికి నిదర్శనం. ఈవీఎంలు మొరాయించాయంటూ టీడీపీ కార్యకర్తలు కొందరు తప్పుడు ప్రచారాలు చేసి ఓటర్లను బయటకు పంపించి గేట్లు వెయ్యడం, రాంజీ ఎస్టేట్‌లోని పోలింగ్‌ బూత్‌లలో గంటా అనుచరులు చేసిన హల్‌చల్‌ కారణంగా ఓటర్లు ఇబ్బంది పడ్డారు. వెంటనే రంగంలోకి దిగిన వైఎస్సార్‌సీపీ ఓటర్లకు మద్దతుగా ధర్నాలు చేయడంతో అధికారులు, పోలీసులు వచ్చి ప్రలోభాలకు చెక్‌ పెట్టారు.

అర్ధరాత్రీ చురుగ్గా ఓటర్లు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియలో ప్రతి ఓటరూ తమ హక్కు వినియోగించుకునేందుకు తహతహలాడారు. ఉత్తర నియోజకవర్గంలోని రాంజీ ఎస్టేట్‌లో 229, 204 పోలింగ్‌ బూత్‌లలో రాత్రి 11.30 గంటల వరకూ పోలింగ్‌ జరిగింది. దక్షిణ నియోజకవర్గం కొబ్బరితోటలో రాత్రి 11 గంటల వరకూ సాగింది. మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రాత్రి 11 గంటల వరకు, పాయకరావుపేట నియోజకవ

ర్గం నక్కపల్లి మండలంలోని పలు గ్రామాల్లో అర్థరాత్రి 12 గంటల వరకు, చోడవరం నియోజకవర్గం రోలుగుంట మండలంలో వేకువ జామున 3.30 గంటల వరకూ ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మావో ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌ అని ప్రకటించినా.. అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని పలు ప్రాంతాల్లో రాత్రి 11  గంటల వరకూ ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతగిరి మండలం వేంగడ పంచాయతీలో అర్థరాత్రి ఒంటి గంట వరకూ పోలింగ్‌ జరిగింది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top