ఒక్కరూ ఓటెయ్యలేదు!

Andaman And Nicobar Tribe Do Not Come Out To Vote - Sakshi

ఎన్నికల్లో ఓటింగ్‌ శాతాన్ని పెంచడం కోసం ఎన్నికల సంఘం మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. అలాగే, అండమాన్‌ నికోబార్‌లో కూడా అతి పురాతన ఆదిమ తెగ అయిన షొంపెన్ల కోసం కూడా ప్రత్యేకంగా పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అయితే, వాళ్లలో ఒక్కరూ ఓటు వేయడానికి ముందుకు రాలేదట. మంగోలాయిడ్‌ తెగకు చెందిన వీరు నాగరికులతో కలవడానికి బిడియపడతారు. అడవుల్లోంచి బయటకు రావడానికే ఇష్టపడరు. అడవుల్లో దొరికేవే తిని బతుకుతుంటారు. బాగా పరిచయం ఉన్న ఒకరిద్దరిని తప్ప ఇతరులెవరినీ వారు దగ్గరకి రానివ్వరు. అధికారులు అతి కష్టం మీద వీరికి ఓటరు కార్డులు జారీ చేశారు. వీరిలో 107 మంది ఓటర్లు ఉన్నారు. 2014 ఎన్నికల్లో వీరిలో ఇద్దరంటే ఇద్దరు (75 ఏళ్ల పురుషుడు, 32 ఏళ్ల మహిళ) మాత్రమే వచ్చి ఓటేశారు. ఈసారి మరింత ఎక్కువ మందిని రప్పించడం కోసం అధికారులు అవగాహన శిబిరాలు నిర్వహించారు. దానికి దాదాపు 35 మంది షొంపెన్లు ఓటరు కార్డులతో సహా హాజరయ్యారు. దాంతో అధికారులకు ఉత్సాహం కలిగింది. వారి కోసం ప్రత్యేకంగా రెండు పోలింగ్‌ కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. అయినా ఒక్కరు కూడా ఓటు వేయడానికి రాలేదు. ‘శిబిరాలకు వచ్చిన వాళ్లను చూసి సంతోషించాం. షొంపెన్‌ భాష తెలిసిన ఒక నికోబార్‌ జాతీయుడి సహాయంతో వాళ్లకు ఎన్నికల గురించి ఓటు’ గురించి అవగాహన కల్పించాం. వాళ్ల కోసం వారు నివసించే గుడిసెల్లాంటి పోలింగ్‌ కేంద్రాలనే ఏర్పాటు చేశాం. కొత్తగా ఉంటే రావడానికి భయపడతారని ఈ పని చేశాం. అయినా కూడా ఒక్కరూ ఓటు వేయడానికి రాలేదు’ అన్నారు కాంప్‌బెల్‌ బే అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రేమ్‌ సింగ్‌ మీనా. కాగా, ఇక్కడి ఓంగే, గ్రేట్‌ అండమాన్‌ తెగవాళ్లు కొన్నేళ్లుగా ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈసారి 51 మంది ఓంగేలు, 26 మంది గ్రేట్‌ అండమానీస్‌ ఓటు వేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top