
బస్సుల్లేక ఆటో ట్రాలీ ఎక్కిన బాధితురాలు
బలవంతంగా మత్తుమందు కలిపిన డ్రింక్ తాగించడంతో స్పృహతప్పిన వైనం
కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో వైద్యం.. కేసు నమోదు
పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో శనివారం రాత్రి ఓ ఆదివాసీ బాలిక ఒంటిపై గాయాలు, చిరిగిన దుస్తులతో కనిపించడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన గురించి ఐసీడీఎస్ సీడీపీవో ఆదివారం తెలిపిన వివరాల ప్రకారం ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలానికి చెందిన ఓ బాలిక ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా కుంటలో ఉన్న బంధువుల ఇంటికి వారం క్రితం వెళ్లింది. తిరిగి శనివారం తన సోదరులు ఉంటున్న చింతూరు మండలం గొల్లగుప్పకు వెళ్లేందుకు కుంట బస్టాండ్‌కు చేరుకుంది.
ఆ సమయంలో బస్సులు లేకపోవడంతో అటుగా వెళ్తున్న ఓ ట్రాలీ ఆటో ఎక్కింది. అందులోని ఇద్దరు యువకులు మధ్యలో ట్రాలీ నిలిపి మద్యం సేవించారని.. తనకు కూడా మత్తుమందు కలిపిన డ్రింక్‌ను బలవంతంగా తాగించడంతో స్పృహ కోల్పోయానని బాలిక తెలిపింది. తనకు మెలకువ వచ్చేసరికి పాల్వంచ మండలం పెద్దమ్మతల్లి ఆలయం వద్ద ఉన్నానని చెప్పింది. ఆలయ వాచ్‌మన్ లింగపంపల్లి శ్రీను అందించిన సమాచారంతో బాలికను వెంటనే కొత్తగూడెంలోని బాలిక సంరక్షణ అధికారుల పర్యవేక్షణలో ఉంచారు.
ఆమె సోదరులకు సమాచారం అందించామని సీడీపీవో లక్ష్మీప్రసన్న తెలిపారు. బాలికకు కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించి పాల్వంచ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. బాలిక శరీరంపై గాయాలు ఉండగా.. దుస్తులు కూడా చిరిగిపోయాయని చెప్పారు. బాలికపై అత్యాచారం జరిగిందా లేదా అనేది వైద్య నివేదిక వస్తే తెలిసే అవకాశం ఉందని.. సీడీపీవో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని పాల్వంచ సీఐ సతీశ్ పేర్కొన్నారు.