వైఎస్సార్‌ సీపీలో చేరిన ఆనం

Anam Ramanarayana Reddy joins YSRCP - Sakshi

సాక్షి, విశాఖపట్నం: మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. పాదయాత్రలో భాగంగా విశాఖ జిల్లా వేచలంలో ఉన్న వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సమక్షంలో ఆయన తన అనుచరులతో పాటు పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాతో వీరిని వైఎస్‌ జగన్‌ సాదరంగా ఆహ్వానించారు. భారీ సంఖ్యలో ఆనం మద్దతుదారులు వైఎస్సార్‌ సీపీలో చేరడంతో ఇక్కడ పండగ వాతావరణం నెలకొంది.

జగన్‌ ప్రయత్నం విజయవంతం కావాలి
గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టీడీపీ ప్రభుత్వం విఫలమైందని ఈ సందర్భంగా ఆనం రామానారాయణ రెడ్డి విమర్శించారు. ప్రజలను టీడీపీ, బీజేపీ దారుణంగా మోసం చేశాయని దుయ్యబట్టారు. నాలుగేళ్లు కలిసి కాపురం చేసి ఇప్పుడు కొత్త నాటకానికి తెర తీశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికే విడిపోయినట్టు డ్రామాలాడుతున్నాయన్నారు. తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని ప్రమాణం చేసి ప్రధాని నరేంద్ర మోదీ మాట తప్పారని మండిపడ్డారు. ప్రజలకు అండగా నిలవాలని వైఎస్‌ జగన్‌ పాదయాత్ర చేస్తున్నారని, ఆయన చేసే ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఆనం రామానారాయణ రెడ్డి చేరికపై వైఎస్సార్‌ సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అందరం కలిసి ఏకతాటిపై నడిచి పార్టీని బలోపేతం చేస్తామన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top