మెగాస్టార్‌ ఆంత్యరమేమిటి?

Amitabh starts following Congress leaders, triggers speculation - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ట్విట్టర్‌లో అకస్మాత్తుగా పలువురు కాంగ్రెస్‌ నేతలను ఫాలో కావడం తీవ్ర ఊహాగానాలకు తావిస్తోంది. రాజీవ్‌గాంధీ హయాంలో అమితాబ్‌ బచ్చన్‌ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన సంగతి తెలిసిందే. కొన్ని చేదు అనుభవాల అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. రాజకీయ వ్యాఖ్యలకు కూడా ఆయన దూరం పాటిస్తారు. ఈ నేపథ్యంలో ఆయన అకస్మాత్తుగా కాంగ్రెస్‌ పార్టీపై ఆసక్తి కనబరుస్తుండటంతో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.

మొదట కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఫాలో కావడం మొదలుపెట్టిన అమితాబ్‌ ఈ నెలలో కాంగ్రెస్‌ పార్టీ అఫిషియల్‌ ఖాతాతోపాటు ఆ పార్టీ సీనియర్‌ నేతలు పీ చిదంబరం, కపిల్‌ సిబల్‌, అహ్మద్‌ పటేల్‌, అశోక్‌ గెహ్లాట్‌, అజయ్‌ మాకెన్‌, జ్యోతిరాదిత్య సింథియా, సచిన్‌ పైలట్‌, సీపీ జోషి తదితరులను ఫాలో అవుతున్నారు. వీరే కాదు కాంగ్రెస్‌ నేతలు మనీష్‌ తివారీ, షకీల్‌ అహ్మద్‌, సంజయ్‌ నిరుపమ్‌, రణ్‌దీప్‌ సుర్జేవాలా, ప్రియాంక చతుర్వేది, సంజయ్‌ ఝాలను కూడా ఆయన ఫాలో అవుతున్నారు.

గాంధీ-నెహ్రూ కుటుంబానికి అమితాబ్‌ సన్నిహితుడు. రాజీవ్‌గాంధీకి మిత్రుడు. ప్రస్తుతం అమితాబ్‌ గుజరాత్ రాష్ట్ర బ్రాండ్‌ అంబాసిడర్‌గా కొనసాగుతున్నారు.  పలు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రచారం నిర్వహిస్తున్నారు. అమితాబ్‌కు ట్విట్టర్‌లో 3.31 కోట్లమంది ఫాలోవర్లు  ఉన్నారు. ఆయన మొత్తంగా 1689మంది ఫాలో అవుతున్నారు. అయితే, ఇటీవల  ఫాలో అవుతున్న వారిలో కాంగ్రెస్‌ నేతలే అధికంగా ఉండటం గమనార్హం.

అంతేకాకుండా పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలను కూడా బిగ్‌ బీ ఫాలో కావడం మొదలుపెట్టారు. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ య యాదవ్‌, ఆయన కూతురు మిసా భారతి, జేడీయూ అధినేత నితిశ్‌కుమార్‌, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులను ఆయన ఫాలో అవుతున్నారు. ఎన్సీ నేత ఒమర్‌ అబ్దుల్లా, ఎన్సీపీ నేత సుప్రియా సూలేను కూడా మెగాస్టార్‌ ఫాలో అవుతున్నారు. ఆయన ఫాలో అవుతున్న వారిలో బీజేపీ నేతలు కూడా కొందరు ఉన్నారు. ఇటీవల నితిన్‌ గడ్కరీ, సురేశ్‌ ప్రభు వంటివారిని ఫాలో కావడం బిగ్‌బీ మొదలుపెట్టారు. సోషల్‌ మీడియాలో క్రియాశీలకంగా ఉండే బిగ్‌ బీ అకస్మాత్తుగా కాంగ్రెస్‌ నేతలపై ఆసక్తి కనబరుస్తుండటం మాత్రం చర్చనీయాంశమైంది. దీనివెనుక ఆంతర్యం ఏదైనా ఉందా? లేదా కాకతాళీయంగానే వారిని ఫాలో అవుతూ రాజకీయ అప్‌డేట్స్‌ తెలుసుకుంటున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top