బాబు వ్యాఖ‍్యలు చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది..

Ambati Rambabu Counter Punch to  Kodela Siva Prasad - Sakshi

సాక్షి, విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు వింటుంటే ఆశ్చర్యం కలుగుతోందని, ఆయన రకరకాల ఆరోపణలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఒకవేళ ఎన్నికలు లోపభూయిష్టంగా జరిగితే టీడీపీకి 150 సీట్లు ఎలా వస్తాయని ఆయన సూటిగా ప్రశ్నించారు. అంబటి రాంబాబు బుధవారం విజయవాడలో పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘చంద్రబాబు ఓడిపోతున్నారు అని తెలిసే రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. నువ్వు తాత్కాలిక సీఎంగా ఉండి పోలవరంపై ఎలా రివ్యూ చేస్తావ్‌. ఇక కోడెల శివప్రసాదరావు ఇనిమెట్ల బూత్‌లోకి వెళ్లి తలుపులు వేసుకుని రిగ్గింగ్‌కు ప్రయత్నించారు. ఆయనపై ఫిర్యాదు చేస్తే నాలుగు రోజుల వరకూ పోలీసులు కేసు నమోదు చేయలేదు. పోలీసులు కోడెల శివప్రసాద్ చేతిలో కీలుబొమ్మలా మారారు.

కోడెలపై పోలీసులు ఎందుకు వెంటనే కేసు నమోదు చేయలేదు. కోడెల శివప్రసాదరావు పోలింగ్‌ కేంద్రాన్ని క్యాప్చరింగ్‌ చేసే వ్యక్తి. క్రిమినల్‌ మైండ్‌తో రాజకీయాలు చేయడం ఆయనకు అలవాటు. పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి ఎవరైనా తలుపులు వేసుకుంటారా?. ఆయన రిగ్గింగ్‌కు ప్రయత్నించడంతోనే ఇనిమెట్ల గ్రామస్తులు తిరగబడ‍్డారు. కోడెల 40 ఏళ్ల రాజకీయ చరిత్ర కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలే. ఆయన అహంకారంతో మాట్లాడుతున్నారు. కోడెల నాకంటే కేవలం 928 ఓట్లు మాత్రమే ఎక్కువ వచ్చి గెలిచారు. 23మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే స్పీకర్‌గా ఏం చర్యలు తీసుకున్నారు. మా పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే నువ్వేం చర్యలు తీసుకున్నావ్‌. నరసరావుపేటలో కూడా టీడీపీ అభ్యర్థులని ఓడిస్తుంది నువ్వు కాదా?. కోడెలది దుర్మార్గపు మనస్తత్వం. నీ ఇంట్లో పేలిన బాంబుల వల్ల మరణించిన కుటుంబాలకు నువ్వేం చేశావ్‌. నరసరావుపేట, సత్తెనపల్లి ప్రజలకు కోడెల నరకం చూపించారు. ఓటమి భయంతోనే కోడెల డ్రామాలు ఆడుతున్నారు. ఆయనతో పాటు కలిసి పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లిన గన్‌మెన్‌లను కూడా వెంటనే సస్పెండ్‌ చేయాలి’ అని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top