సమరానికి సమయం! | Sakshi
Sakshi News home page

సమరానికి సమయం!

Published Mon, Jan 22 2018 8:35 PM

AAP MLAs disqualification: Profit and loss on political parties - Sakshi

పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులైన 20 మంది ఢిల్లీ ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్‌) ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దవడంతో ఈ సీట్లకు ఆరు నెలల్లో ఉప ఎన్నికలు తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు ఎన్నికల సంఘం(ఈసీ) సిఫార్సును రాష్ట్రపతి ఆదివారం ఆమోదించారు. మొత్తం 70 మంది సభ్యుల అసెంబ్లీలో ఆప్‌ బలం 66 నుంచి 44కు పడిపోయినా ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని సర్కారుకు ఢోకా లేదు. అయితే మధ్యంతరంగా వస్తున్న ఈ ఎన్నికల్లో అన్ని పక్షాలూ తమకు ఉన్న ప్రజాదరణను పరీక్షించుకునేందుకు అవకాశం లభిస్తోంది.

ఎన్నికల్లోపార్లమెంటరీ సెక్రెటరీల నియామకం ఎప్పటి నుంచి మొదలైంది?
ఆంధ్రప్రదేశ్‌ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకం1953 నుంచి జరుగుతూనే ఉంది. ప్రస్తుతం కర్ణాటక, రాజస్థాన్, ఒడిశా, నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఈ పదవుల్లో శాసనసభ్యులు కొనసాగుతున్నారు. అయితే, 2014 నుంచి తెలంగాణ, పశ్చిమబెంగాల్, పంజాబ్, హరియాణాలో జరిగిన ఈ నియామకాలు హైకోర్టుల తీర్పుల ఫలితంగా రద్దయ్యాయి. 2004లో ఇలాంటి నియామకాలను అనుమతించే అస్సాం చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మిజోరం, మేఘాలయ, మణిపూర్‌లో పదవుల్లో ఉన్న పార్లమెంటరీ సెక్రెటరీలు రాజీనామా చేశారు. 2014లో తెలంగాణలో కె.చంద్రశేఖర్‌రావు సర్కారు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమించిన ఆరుగురు శాసనసభ్యుల నియమకాన్ని హైకోర్టు రద్దు చేసింది. అయితే, ఏ సందర్భంలోనూ ఈ పదవులు చేపట్టిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు ప్రయత్నాలు జరగలేదు.

అనర్హత వేటుకు ఆస్కారమిచ్చే లాభదాయక పదవి అంటే?
సభ్యత్వం పోవడానికి దారితీసే లాభదాయక పదవి(ఆఫీస్‌ ఆప్‌ ప్రాఫిట్‌) అంటే రాజ్యాంగంలోగాని, ప్రజాప్రాతినిధ్యచట్టం(1951)లోగాని నిర్వచించలేదు. ఉన్నత న్యాయస్థానాల తీర్పులకు అనుగుణంగా లాభదాయకపదవులను నిర్ధారిస్తున్నారు. ఆర్థిక ప్రయోజనం ఉంటే దాన్ని ఇలాంటి పదవిగా పరిగణిస్తున్నారు. కొన్నేళ్ల క్రితం సవరించిన 164 (1ఏ) అధికరణ కారణంగా కేంద్ర, రాష్ట్ర మంత్రివర్గాల్లో సభ్యులు ఆయా దిగువసభల సభ్యుల సంఖ్యలో 15 శాతం మించకూడదు.

కేంద్రపాలితప్రాంతమైన ఢిల్లీలో మంత్రులు పదిశాతం దాటకూడదు. అదీగాక చీఫ్, పార్లమెంటరీ కార్యదర్శులు ఒక వేళ ప్రభుత్వం అందించే జీతాలు, సౌకర్యాలు పొందకపోయినాగాని ఇప్పుడు వారిని సహాయ మంత్రులుగా భావిస్తున్నారు. వాస్తవానికి ఆప్‌ ఎమ్మెల్యేలు ఈ పదవుల్లో ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. అయితే, వారిని ఎన్నికల కమిషన్‌ మంత్రులుగా పరిగణించి వారిపై అనర్హత వేటు ప్రక్రియ ప్రారంభించి ఆదివారం పూర్తిచేసింది. ఢిల్లీ మంత్రులు అసెంబ్లీ సభ్యుల సంఖ్యలో పది శాతం లోపే ఉన్నప్పటికీ అదనంగా నియమించిన 20 మంది పార్లమెంటరీ కార్యదర్శులను సహాయ మంత్రులుగా లెక్కించారు. ఫలితంగా వారు ఈసీ చర్యతో సభ్యత్వం కోల్పోయారు. ఈ పరిణామాలు రెండు ప్రధాన రాజకీయపక్షాలు బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు పాలకపక్షం ఆప్‌కు రాజధానిలో ప్రజల మద్దతు ఎంతుందో ఉప ఎన్నికలు తేలుస్తాయనడంలో సందేహం లేదు.

హరియాణాలోనూ నలుగురు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దుకు పిటిషన్‌!
గతంలో చీఫ్‌ పార్లమెంటరీ సెక్రెటరీలుగా హరియాణా ప్రభుత్వం నియమించిన నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను శాసనసభ్యత్వానికి అనర్హులుగా ప్రకటించాలని కోరుతూ పంజాబ్, హరియాణా హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ నియామకాలను కిందటేడాది హైకోర్టు రద్దచేసింది. రాష్ట్రంలో పార్లమెంటరీ కార్యదర్శుల నియామకానికి అనుమతించే ప్రత్యేక చట్టం ఉన్నందున ఎమ్మెల్యేలపై చర్యకు ఆస్కారం లేదని, దిల్లీ, హరియాణా పరిస్థితులకు పొంతన లేదని ముఖ్యమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ అభిప్రాయపడ్డారు.

(సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌)

Advertisement

తప్పక చదవండి

Advertisement