
అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : జాతీయ రాజధాని ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని ఆమ్ ఆద్మీ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీ మద్దతుదారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఆదివారం కేజ్రీవాల్ ఢిల్లీలో సమావేశమయ్యారు. ఇచ్చిన హామీ మేరకు 2019 లోక్‌సభ ఎన్నికలలోపు ఢిల్లీకి రాష్ట్ర హోదా ఇవ్వాలని మోదీని కోరారు. దీనిపై ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి మనీశ్ శిసోడియా ప్రకటించారు. ఆప్ కార్యకర్తలు ఢిల్లీలోని ప్రతి ఇంటికి చేరుకుని హోదాకు ప్రజల మద్దతు కొరతారని తెలిపారు. సీఎం కేజ్రీవాల్ సంతకం చేసిన లేఖపై పది లక్షల మందితో సంతకాలు చేయించి వాటిని ప్రధాని మోదీకి పంపుతామని మనీశ్ శిసోడియా పేర్కొన్నారు.
ఢిల్లీకి రాష్ట్ర హోదా అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ అభిప్రాయం ఏంటో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై త్వరలో అన్ని పార్టీల నేతలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేస్తామని తెలిపారు. ఢిల్లీ జాతీయ రాజధాని అయినందువల్ల రాష్ట్ర హోదా ఇవ్వలేమని కేంద్రం చేస్తున్న వ్యాఖ్యలను కేజ్రీవాల్ కొట్టిపారేశారు. న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌ఎమ్‌డీసీ) మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటుందని, మిగిలిన ప్రాంతానికి రాష్ట్రహోదా ఇవ్వాలని అన్నారు.