ఇప్పుడు నగరాల్లో గన్ సంస్కృతి ఎక్కువైపోయింది. ఇక్కడా అక్కడా అని లేదు ఎప్పుడు ఎక్కడ తుపాకీ పేలుతుందో అని నగర జీవి వణికిపోతు న్నాడు.
ఇప్పుడు నగరాల్లో గన్ సంస్కృతి ఎక్కువైపోయింది. ఇక్కడా అక్కడా అని లేదు ఎప్పుడు ఎక్కడ తుపాకీ పేలుతుందో అని నగర జీవి వణికిపోతు న్నాడు. రాష్ట్రంలో ఆయుధాల లెసైన్స్ కలిగి ఉన్నవారెవరో? లేనివారెవరో తెలియని పరిస్థితి నెలకొంది. బస్టాండ్లలో ఖాకీలపైనే తుపాకీ గురిపెట్టే సాహసానికి పాల్పడ్డారంటే నేరగాళ్లు ఎంత రెచ్చిపోయారో వేరే చెప్పనక్కర లేదు. ఇప్పుడు మన మార్కెట్లలో కూడా తుపాకులు సాధారణ వస్తువుల లాగా దొరుకుతుండటంతో, నేరాలు ఎక్కుైవైపోయాయని సామాజిక శాస్త్ర వేత్తల వాదన. పైగా ఎవరు అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారో చెప్పడం కష్టం అని పోలీసు శాఖ కూడా చేతులెత్తేసినట్లుంది. మన పోలీసుల వద్ద ఉన్న ఆయుధాల కంటే నేరస్థుల దగ్గరే అత్యాధునిక ఆయుధాలు ఉండటం, వాటిని విచ్చలవిడిగా ఉపయోగించడానికి సిద్ధపడటమే ప్రజలను భయ భ్రాంతులకు గురిచేస్తోంది.
మొన్న సరూర్‌నగర్, నిన్న సూర్యాపేట. రేపు మరెక్కడ ఏం జరగబోతోందోనని పోలీసు వర్గాలే ఆందోళన చెందుతు న్నాయి. ఒక పక్క పోలీసు వ్యవస్థను పటిష్టం చేస్తాం, నేరరహిత నగరంగా తీర్చిదిద్దుతామని, స్మార్ట్ సిటీల లక్ష్యమే ఏర్పాటని చెబుతున్న తెలంగాణ సర్కారుకు వరుసగా జరిగిన కాల్పుల సంఘటనలతో ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఇకనైనా అక్రమ ఆయుధాలు కలిగిన వాళ్ల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. తక్షణమే రాష్ట్ర పోలీసులకు అత్యాధునిక ఆయుధాలు అందించి పౌరుల భద్రతకు చర్యలు చేపట్టాలి.
విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్