బాపు మా అమ్మ | mahatma gandhi is my mother | Sakshi
Sakshi News home page

బాపు మా అమ్మ

Jan 30 2017 12:14 AM | Updated on Sep 5 2017 2:25 AM

బాపు మా అమ్మ

బాపు మా అమ్మ

"గాంధీ చేతి కర్ర"గా పేరు పొందిన మను బెన్, కస్తూర్బాకు ఆరోగ్యం క్షీణించిన కాలం 1945 నుంచి, ఆమె మరణం, అటుపై 1948 జనవరి చివర్న బాపు హత్యకు గురై కన్ను మూసేంతవరకూ, వారిని అనుసరించి ఉన్న అనుయాయి, వారి సేవలు చేసిన వ్యక్తి.

"గాంధీ చేతి కర్ర"గా పేరు పొందిన మను బెన్, కస్తూర్బాకు ఆరోగ్యం క్షీణించిన కాలం 1945 నుంచి, ఆమె మరణం, అటుపై 1948 జనవరి చివర్న బాపు హత్యకు గురై కన్ను మూసేంతవరకూ, వారిని అనుసరించి ఉన్న అనుయాయి, వారి సేవలు చేసిన వ్యక్తి. అప్పటికి ఈ ఇరవయ్యేళ్ళ లోపు పిల్ల, గాంధీ జ్ఞాపకాలు రాసింది. ఆ రచనకు అత్యంత విలక్షణంగా "బాపు మా అమ్మ" అని పేరు పెట్టింది. ఈ చిన్న పుస్తకం, అప్పట్లోనే సౌరాష్ట్ర కథియవాడ్‌కు చెందిన భావనగర్‌ సమాచార పత్రికలో ధారావాహికగా వెలువడ్డది. పుస్తక రూపేణా వచ్చినప్పుడు కె.జి.మశూర్వార్‌ దీనికి తొలిపలుకులు రాశారు. తదుపరి ఆంగ్లానువాదంలో వెలువడ్డది.

తన తరుణ వయసులో రాసిన ఈ జ్ఞాపకాలు సాహిత్య విలువ కలిగి ఉండడమే కాకుండా, తాను  విశ్వసించిన దాని పట్ల గాంధీజీకి గల బలమైన పట్టుదల గురించి తెలుపుతాయి. ఇంతవరకూ గాంధీజీ గురించి పెద్దగా తెలియని విషయాలు, ఉదాహరణకు తన ఆఖరు పుట్టిన రోజు అక్టోబర్‌  2, 1947న  దేశం బాగు పడ్డం అయినా జరగాలి, లేదా తానైనా కన్ను మూయడం మంచిది, అన్న భావనను గాంధీజీ వ్యక్తం చేశారు అని చెపుతుంది మనుబెన్‌.

ఈ మనుబెన్‌ చేతుల్లోనే గాంధీజీ నేలకొరిగారు. "హే రామ్" అన్నారని కూడా మను రాసింది. నేలకొరిగిన రెండు గంటల తర్వాత, గాంధీ చనిపోయారని కూడా ఇందులోని వివరాలు చెప్తాయి. "నాకు ముగ్గురు అమ్మలు, ఒకరు నా చిన్నప్పుడే పోయారు, రెండవ వారు, కస్తూర్బా. ఈ అమ్మకు ఆఖరు దశలో సేవ చేసే అవకాశం నాకు కలిగింది. మూడో అమ్మ బాపు. భగవంతుడు నా ముగ్గురు అమ్మలనూ నా నుంచి తీసుకెళ్లిపోయాడు," అని ఈ బాలిక వివశ అయి నమోదు చేసిన మాటలు, కేవలం వ్యవహార డైరీలుగా కాక, మానవ జీవనపు సంవేదన, సంతోషం తొణికిసలాడే మాటలుగా, ఈ చిన్న పుస్తకంలో దర్శనమిస్తాయి. మను బెన్‌ తరువాత కొంత కాలం గుజరాత్‌లో ఒక పాఠశాల నడిపి, తన నలభై ఏళ్ల వయసులోనే కన్ను మూశారు.

గాంధీ విధానంలో చిన్న నిర్మాణాలు, ప్రణాళికలు అందమైనవి, సంతోష కారకాలు. ఇదే "స్మాల్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌" దృష్టికోణం ఆర్థిక శాస్త్రంలో. ఇవాళ అన్నిటినీ పెంచి పెంచి "బిగ్‌ ఈజ్‌ ఆఫుల్‌" అన్న దశకు చేరిన తరుణంలో గాంధీజీ ప్రాసంగికత ఇవాళ చర్చనీయాంశం. అలాంటి గాంధీజీలో ఒక అమ్మ ను చూసింది మను బెన్‌. అలాగే ప్రపంచాన్ని ఒక అమ్మ భావనతో చూసారు బాపు. ఆ దృష్టి వైశాల్యం, సంయమనం ఇవాళ అతివేగంగా చీలిపోతున్న మనుషులకూ, దేశాలకూ, ప్రపంచానికి చాలా అవసరం. ("బాపు మై మదర్‌"ను వ్యాసకర్త "బాపు మా అమ్మ"గా విశాఖ ఆకాశవాణి కోసం తెలుగులోకి అనువదించారు.)
- రామతీర్థ
9849200385

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement