కె.చంద్రశేఖర్‌రావు రాయని డైరీ | KCR not written diary | Sakshi
Sakshi News home page

కె.చంద్రశేఖర్‌రావు రాయని డైరీ

Jun 7 2015 1:00 AM | Updated on Sep 3 2017 3:19 AM

కె.చంద్రశేఖర్‌రావు రాయని డైరీ

కె.చంద్రశేఖర్‌రావు రాయని డైరీ

చాయ్ కప్పులు ఎన్ని తాగినా సరిపోతలె. పాపం శోభ అప్పటికీ పెద్ద పెద్ద కప్పులల్ల చాయ్‌ల మీద చాయ్‌లు పంపిస్తనే ఉంది.

మాధవ్ శింగరాజు

  చాయ్ కప్పులు ఎన్ని తాగినా సరిపోతలె. పాపం శోభ అప్పటికీ పెద్ద పెద్ద కప్పులల్ల చాయ్‌ల మీద చాయ్‌లు పంపిస్తనే ఉంది. నిన్న రాత్రి కూడా ఎప్పట్లెక్కనె చాయ్‌లు తాగుతూ తెల్లార్లూ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూర్చున్న. కంప్యూటర్‌ల టీఎంసీల కొద్దీ డేటా ఉన్నది. మొత్తం స్టడీ చేశిన. అడవులకు అడ్డుపోకుండా, చంద్రబాబు అడ్డురాకుండా, ఇంటర్‌స్టేట్ క్లియరెన్స్ అవసరం లేకుండా కొత్త రూట్‌ల కోసం దేవులాడిన. బంగారు తెలంగాణ ముందుగాల నీల్లతోనే కదా అస్తది. తర్వాత కరెంటు, తర్వాత పచ్చటి పొలాలు, తర్వాత స్కై వేస్, తర్వాత తెలంగాణ ముద్దు బిడ్డలకు స్వేచ్ఛా వాయువులు. నీరు, నిప్పు, నింగి, నేల, గాలి! పంచభూతాలను దారిలోకి తెచ్చుకుంటె బంగారు తెలంగాణ రాకపోతదా. అప్పుడింక తెలంగాణ అంతా బంగారమే కాకపోతదా. సెట్లర్లకు కూడా దసరా దసరాకి ఇంత బంగారం ఇస్తే ఏంబోతది. పర్మనెంట్ టూరిస్టు ఉన్నడు కదా... చంద్రబాబు. ఆయనకి కూడా అలయ్‌బలయ్ అనుకుంట ఇంత బంగారం ఇస్తే కాదంటడా. వద్దు పొమ్మంటడా.
 
 ఇంటున్న కదా, చంద్రబాబు గీ మజ్జె ఒక కథ చెప్పబట్టె. గాయన తెలంగాణ టూర్‌కి వచ్చినప్పుడు ఒకామెను చూసిండంట. ఆమె ఎనకాలే ఒక గొర్రె పోతుండడం కూడా చూసిండంట. అప్పుడు ఆమెను అడిగిండంట, ‘‘ఆ గొర్రెందుకు నీ వెనకాలే వస్తోంది’’ అని. అప్పుడామె చెప్పిందట, ‘‘ఎప్పుడో గింత మేత ఏసినా సారూ. అందుకే అత్త్తంది’’ అన్నదట. ‘‘నేను వేసినా నా వెనకాల వస్తుందా’’ అని చంద్రబాబు అడిగిండంట. ‘‘అట్లెందుకస్తది. సిన్నప్పట్నుంచి ఎయ్యాలే మేత’’ అన్నదట ఆమె. అప్పుడాయన ‘‘ఈ గొర్రెలకున్న విశ్వాసం కూడా నా ఎమ్మెల్యేలకు లేకపోయెనే’’ అని బాధపడిపోయిండట. చంద్రబాబు ఎమ్మెల్యేలను గొర్రెలనుకుంటున్నడో ఏమో!
 
 గీ దినంతో ఉత్సవాలు ముగుస్తున్నయ్. ముహుర్తం కూడా మంచిగనే జరిగింది. చంద్రబాబు జూన్ రెండో తారీఖున హైద్రాబాద్ వదలిపెట్టి విజయవాడ పోయిండు. ఇంక తెలంగాణలో సంబురాలు షురూ కావా! విజయవాడ నుంచి సర్కారును నడిపించుకుంటడంట. ఏణ్ణుంచైనా నడిపించుకోనీ. ఈణ్ణుంచి కాకుండా. చంద్రబాబు పెద్ద క్యాపిటలిస్టు. జపాన్ పోతడు. అమరావతిని మీ సెకండ్ క్యాపిటల్ అనుకోండి అంటడు. సింగపూర్ పోతడు. అక్కడా అదేమాట అంటడు. ఆయనకు మాత్రం సింగపూర్ రెండో క్యాపిటల్ కావాలె. పొద్దున లేస్తే చంద్రబాబు గానీ, గాయన మంత్రులు గానీ, ఆఫీసర్లు గానీ ఏడికి పోవాలె. అమరావతి పోవాలె. మరి ఏడికి పోతుండ్రు. సింగపూర్ పోతుండ్రు. ఎమ్మెల్యేలు యాష్టకొచ్చి టీఆర్‌ఎస్‌లోకి వస్తుండ్రు. దీంట్ల మా తప్పేముంది? రుతుపవనాలు వస్తుంటే వద్దంటమా!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement